- హడావుడి నిర్ణయాలు తీసుకోదన్న గోయల్..
- అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందన్న కేంద్ర మంత్రి
అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎవరికి తలొగ్గదని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. జర్మనీ రాజధాని జెర్లిన్లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడిన గోయల్, అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ అనేక వ్యూహాత్మక విధానాలను అమలు చేస్తోందని తెలిపారు. “కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలో వచ్చిన అంతరాయాల తరువాత 2021లో భారత వాణిజ్య విధానంలో కీలక మార్పులు చేశాం.
ప్రపంచంతో కలిసి నడవకపోతే అభివృద్ధి సాధ్యం కాదని అర్థమైంది. అందుకే విశ్వసనీయ దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాం,” అని ఆయన వివరించారు. భారత్ వాణిజ్య ఒప్పందాల ద్వారా సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లకు విస్తృతంగా అవకాశాలు పొందుతుందని గోయల్ పేర్కొన్నారు. “మన దేశం ఒప్పందాలకు కట్టుబడి ఉంటుంది, కానీ ఏ దేశం ఒత్తిడికి లోనవ్వడు. ఇప్పటికే ఉన్న సుంకాలను అంగీకరించాం, కానీ కొత్త సుంకాల బెదిరింపులను అంగీకరించం,” అని స్పష్టం చేశారు. వాణిజ్యంలో సమాన అవకాశాలు లభించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త మార్కెట్లను అన్వేషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తేల్చి చెప్పారు..
