- కర్నూలు శివారులో ఘోర బస్సు ప్రమాదం
- హైదరాబాద్ నుంచి బెంగళూరుకు జర్నీ
- వేమూరి కావేరి బస్సుకు అంటుకున్న నిప్పు
- ఇద్దరు డ్రైవర్లతో సహా 43 మంది ప్రయాణం
- సురక్షితంగా బయటపడ్డ 23 మంది
- పలువురికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
మాటకందని విషాదం.. తెల్లవారు జామున ఏం జరిగిందో తెలుసుకునే లోపే 22 నిండుప్రాణాలు బుగ్గిగా మారాయి. నిద్రలోనే ప్రాణాలు హరీమన్నాయి. మంటల్లో బస్సు తగలుబడుతోందన్న విషయం తెలిసే లోపు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మరెందరో ఆశలను బుగ్గి చేసింది. కర్నూలు జిల్లాలో జరగిన ట్రావెల్ బస్సు దుర్ఘటన కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపింది. బస్సుకు మంటలు అంటుకుని బూడిదయ్యింది.

బస్సులోనే ఈ 22మంది సజీవ దహనం అయ్యారు. తాము ఎక్కిన బస్సే శ్మశానవాటికి అవుతుందని… అందులో తాము సజీవ దహనం అవుతామని ఊహించని ఘటన ఇది. శుక్రవారం తెల్లవారుజాము సుమారు 2-3 గంటల సమయం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. తాము వెళ్లాల్సిన చోటుకి సురక్షితంగా చేరుకుంటామనే నమ్మకంతో ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో మునిగిపోయారు. ఒక్కసారిగా అనుకోని ప్రమాదం.. బైక్ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు వ్యాపించి పొగ కమ్మేసింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో బస్సులోని అద్దాలు పగలగొట్టి కొందరు కిందకు దూకేశారు.
మరికొందరు బస్సులోనే అగ్నికి ఆహుతైపోయారు. కర్నూలు శివారు చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణమైన ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. భయానకమైన ఘటనా స్థలి దృశ్యాలు ప్రమాద స్థాయిని కళ్లకు కడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.
కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 22 మంది సజీవ దహనం కాగా.. 23 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్లలో ఒకరు పరారవగా.. మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు. బస్సు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్ లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూ పూర్కు చెందిన నవీన్ అనే యువకుడు బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
