- తుది జాబితా ప్రకటించిన ఎన్నికల అధికారి
- 23 మంది నామినేషన్ల ఉపసంహరణ
- ఊపందుకోనున్న ఉప ఎన్నిక ప్రచారం
- నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు
- ఈసారి బ్యాలెట్లో అభ్యర్థుల కలర్ ఫోటో
- నియోజకవర్గ చరిత్రలో ఇదే రికార్డు!
- నవంబర్ 11న ఉప ఎన్నికకు పోలింగ్
- కాంగ్రెస్ను ఓడించేందుకంటూ నిరుద్యోగులు, ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు పోటీ..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు. ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
వారిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల పరిశీలనతోపాటు ఉపసంహరణ వరకు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ ఉపఎన్నికలో చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పలువురు అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ ఉద్యమానికి వేదికగా మలచుకునేందుకు, తమ సమస్యలను ఫోకస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ కారణాలు పేర్కొంటూ నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు, ఇతరులు రూ.10 వేలు చెల్లించిమరీ నామినేషన్లు వేశారు. ప్రధానంగా ప్రాంతీయ రింగు రోడ్డు భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేశారు.
12 మంది ప్రస్తుతం రంగంలో ఉన్నారు. యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు 10 మంది దాఖలు చేశారు. తగిన పరిహారం ఇవ్వలేదని, భూములు తిరిగి అప్పగించాలనేది వారి డిమాండ్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం తరఫున 10 మంది నామినేషన్ వేశారు. ఉద్యోగ నియామక ప్రకటనలు లేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది నామినేషన్లు సమర్పించారు. పింఛన్లు సక్రమంగా రావడం లేదని పెన్షన్దారుల తరఫున 9 మంది సీనియర్ సిటిజన్లు నామినేషన్లు వేశారు. తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకరు సమర్పించారు. ఇదిలావుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్జన్ ప్రకటించారు. ఉపఎన్నికపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్ 2,383 మంది ఓటర్లు పెరిగారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. రూ.3.69 లక్షల విలువ చేసే 512 లీటర్ల మద్యం పట్టుబడింది. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్లో.. నాలుగు బ్యాలెట్ యూనిట్స్, ఒక వీవీ ప్యాట్ వినియోగిస్తాం అని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
