హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు (Kurnool Bus Accident) జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై సీఎం రేవంత్ (CM Revanth) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు, డీజీపీ (DGP) శివధర్ రెడ్డితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.

సీఎం ఆదేశాల మేరకు ఫోన్ నంబర్లు 99129 19545, 94408 54433 ద్వారా హెల్ప్‌లైన్ (Help Line) ఏర్పాటుచేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రమాద మృతుల గుర్తింపు, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గద్వాల్ కలెక్టర్(Collector), ఎస్పీ(Sp) అక్కడే ఉండి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు జెన్‌కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హెల్ప్‌లైన్ వ్యవస్థను సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్నారు.
