- భవిష్యత్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే
- లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకోవడం సంతోషం
- ఆర్ఎస్ఎసు అడ్డుకోవడం ఎవరి తరం కాదు
- కర్నాటకలో సస్పెండైన అధికారికి ప్రమోషన్ ఇస్తాం
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్..
పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్నాకే ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. పార్లమెంట్ లో 8 స్థానాలు గెలుచుకోవడమే కాకుండా విజయ పరంపరను కొనసాగిస్తున్నామని చెప్పారు. లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తామని పునరుద్ఘాటించారు. కర్నాటకలో ఆరెస్సెస్ పథ సంచలన్ లో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రాగానే సదరు అధికారికి రెండున్నరేళ్ల కాలానికి జీతభత్యాలు ఇవ్వడంతోపాటు ప్రమోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. దీపావళి పర్వదినం మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జె.సంగప్ప, ఉమా మహేందర్ తదితరులతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సంజయ్ కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనం అందించారు.
అనంతరం ఆయా నేతలతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే… దీపావళి పర్వదినం సందర్భంగా పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అమ్మవారి శక్తి అందరికీ తెలుసు. అమ్మవారి కరుణాకటాక్షం కోసమే అందరం ఇక్కడికి వస్తున్నం. అమ్మవారివల్లే తెలంగాణలో అందరం సుభిక్షంగా ఉన్నాం. నాకైతే కరీంనగర్ లో మహాశక్తి అమ్మవారు, భాగ్యనగర్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం, కరుణాకటాక్షంతోనే ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నా. భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే అవకాశం, అద్రుష్టం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించినం.
ఎండకు, వానకు, చలిని తట్టుకుని ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా పాదయాత్రను విజయవంతం చేసినం. 1600 కి.మీలు పాదయాత్ర చేసిన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల్లో పోటీ చేసి హిందూ సంఘటిత శక్తిని చాటినం. అమ్మవారి దయవల్లే 4 నుండి 48 స్థానాలు గెలిచినం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనే అమ్మవారి దర్శనం తరువాతే గెలిచినం. మునుగోడు ఎన్నికల్లో నాటి ప్రభుత్వం అనేక అరాచకాలు గెలిచినా పోరాడి గెలుపు అంచులదాకా వచ్చినం. అమ్మవారి దయతోనే బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో గెలిచినం. విజయపరంపరను కొనసాగిస్తున్నాం.
గతంలో భాగ్యలక్ష్మీ అమ్మవారు లేనే లేదు. బండి సంజయ్ కొత్త కొట్లాట పెడుతున్నారని కాంగ్రెస్, బీఆర్ఎసోళ్లు హేళన చేశారు. ఆనాడు హేళన చేసిన వాళ్లే ఇయాళ అమ్మవారి శక్తి తెలుసుకుని దర్శించుకుంటున్నారు. ఆలస్యంగానైనా అమ్మవారి శక్తిని తెలుసుకున్నందుకు అభినందనలు. అమ్మవారి శక్తి తెలుసుకాబట్టే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఎంతో మంది ప్రముఖులు దర్శనం చేసుకున్నారు.అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. రాబోయే రోజుల్లో రాబోయేది మోదీ రాజ్యమే. కర్నాటకలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ లో పాల్గొన్న పాపానికి ఒక ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేయడం దుర్మార్గం. తీవ్రంగా ఖండిస్తున్నా.
ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. సాంస్కృతిక, జాతీయవాద సంస్థ. ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన గొప్ప సంస్థ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ చెప్పారు. అంతెందుకు కర్నాటక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న శివకుమార్ సైతం అసెంబ్లీ సాక్షిగా ఆర్ఎస్ఎస్ గీతం పాడి గొప్పతనాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ ఉండేది ఇంకా రెండేళ్లే. రెండేళ్ల దాకా సస్పెండైన అధికారి ఆర్ఎస్ఎస్ ద్వారా దేశ సేవ చేయాలని కోరుతున్నా, రెండేళ్ల తరువాత కర్నాటకలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే సస్సెండైన అధికారికి రెండున్నరేళ్ల జీతభత్యాలన్నీ ఇవ్వడం తోపాటు ప్రమోషన్ కూడా ఇస్తాం. ఒక్కటి మాత్రం చెబుతున్నా. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేమన్నది ఎంత సత్యమో, నిషేధం పేరుతో ఆర్ఎస్ఎస్ ను అడ్డుకోలేరనేది కూడా అంతే సత్యం.
