విద్యార్థినిలపై ఉపాధ్యాయుడి లైంగిక వేదింపులు?
ప్రాథమికోన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి
పది లక్షలిస్తా రాజీ చేయండి
రెస్టారెంట్‌లో బేరసారాలు
విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రణాళిక
విద్యార్థుల చేత పెన్ను, పుస్తకం చేతబట్టించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడుగా మారాడు. పాఠశాలకి వచ్చిన విద్యార్థినిలను తల్లితండ్రుల వలే కంటికి రెప్పలా కాపాడుతూ అక్షరాలు నేర్పించాల్సింది పోయి వెకిలి చేష్టలతో వంకర బుద్దుని ప్రదర్శించాడు. కూసుమంచి మండలంలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వచ్చే అభం శుభం తెలియని విద్యార్థినిలతో సదరు ఉపాధ్యాయుడు తాకరాని చోట అసభ్యకరంగా తాకుతూ, వెకిలి చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడు వికృత చేష్టలను అర్ధం చేసుకోలేని అమాయకత్వంతో విద్యార్థినిలు మిన్నకుండిపోయారు.
కాగా.. ఓ విద్యార్థిని ధైర్యం చేసి ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల వ్యవహరిస్తున్న ఘోరాన్ని కళ్లకు కట్టినట్లుగా తల్లితండ్రులకు వివరించింది. దీంతో విద్యార్థిని తండ్రి పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులని నిలదీశారు. తోటి విద్యార్థినులు సైతం ఉపాధ్యాయుడు అరాచకా లను బహిరంగంగా పూస గుచ్చినట్టు వివరించారు. తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఉపాద్యాయులు కాళ్ల వెళ్లా పడి విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుడు విషయాన్ని బయటకి పొక్కకుండా గుట్టుగా ఉంచే ప్రయత్నం చేశారు.
వర్క్ అడ్జెస్ట్ మెంట్ ఖమ్మం నగరానికి బదిలీ..!
విద్యార్ధినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు ఇటీవల జరిగిన వర్క్ అడ్జెస్ట్ మెంట్ లో భాగంగా ఖమ్మం నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకి బధిలి పై వెళ్లాడు. అంగ బలం, అర్థ బలంతో పాటుగా సామాజిక వర్గం అండదండలు తొడవ్వడంతో పైరవీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఈ బదిలీని చేయించుకున్నాడు.
జైలు జీవితం గడిపినా మారని బుద్ధి..!
పాఠశాల విద్యార్థినిలను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు గతంలో ఖమ్మం రూరల్ మండలంలోని ఓ పాఠశాలలో పనిచేసే సమయంలో ఇదే విధంగా ప్రవర్తించి కేసుల పాలై, సస్పెన్షన్ కి గురై జైలు జీవితం కూడా గడిపాడు. సస్పెన్షన్ అనంతరం తిరిగి విధుల్లో చేరినప్పటికి ఉపాధ్యాయుడి వంకర బుద్ధి మాత్రం మారలేదు.
పది లక్షలు ఇస్తా రాజీ కుదర్చండి!?
అన్నెం పున్నెం ఎరుగని పాఠశాల విద్యార్థినీలను లైంగికంగా వేధించిన విషయం బట్టబయలు కావడంతో ఈ కేసు నుండి బయట పడేందుకు, సస్పెన్షన్ వేటు పడకుండా కాపాడితే పది లక్షలు ఇస్తా.. రాజీ కుదర్చండి అంటూ ఉపాధ్యాయుడు బేరసారాలు చేయడం గమనార్హం. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ఓ రెస్టారెంట్ లో ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు,ఓ అధికారి భేటీ అయి ఈ సంఘటన నుండి ఉపాధ్యాయుడుని ఎలా బయట పడేయాలో తలమునకలై ఉన్నారు. విచారణ సమయంలో ఉపాధ్యాయుడుకి అనుకూలంగా, తప్పుదోవ పట్టించే రిపోర్ట్ ఇచ్చేలా దాదాపుగా అన్ని రకాల ప్రణాలికలను సిద్ధం చేసుకున్నారు.
డిఈఓనే విచారణ చేయాలి
కామ కోర్కెలతో విద్యార్థినిలను వేధించిన ఉపాధ్యాయుడు వ్యవహరం పై జిల్లా విద్యాధికారిణి స్వయంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకొని, విద్యార్థినిలకి న్యాయం చేయాలని తల్లితండ్రులు వేడుకుంటున్నారు.
