రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్(Abdullapurmet) మండలంలో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ, అధికారుల అండతో నమిశ్రీ నిర్మాణ సంస్థ అనే ప్రైవేట్ సంస్థ ఏకంగా 6.15 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసి భారీ అక్రమ నిర్మాణానికి తెరలేపింది. అనుమతులు పొందిన భూమిని కాదని, పక్కనే ఉన్న విలువైన అటవీ భూమిలో ఐదు ఆకాశహర్మ్యాలను (ఒక్కొక్కటి 25 అంతస్తులు, మొత్తం 625 ఫ్లాట్లు) నిర్మిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
అసలు మోసం ఇదీ…
నమిశ్రీ(Namishri ) నిర్మాణ సంస్థ, తట్టిఅన్నారం గ్రామంలోని సర్వే నెం. 121/పిలో నిర్మాణం కోసం అధికారికంగా లేదా (లేదా నెం. : 02400061375) మరియు హెచ్ఎండిఎ (హెచ్ఎండిఏ బిపి నెం.: 01610/ఔలిపి/హచ్ఎండిఏ/0341/జీహెచ్లో/2023) అనుమతులు పొందింది. అయితే, ఆ స్థలాన్ని వదిలేసి, పక్కనే ఉన్న సర్వే నెం. 117/6 లోని అటవీ భూమిలో అక్రమంగా బ్రోచర్లు, నిర్మాణం ప్రారంభించింది. రంగురంగుల ఆకర్షణీయమైన ఆఫర్లతో 625 కుటుంబాలను మోసం చేసేందుకు సిద్ధమైంది.
అధికారుల నిర్లక్ష్యం… అక్రమార్కులకు అండ?
ఈ అక్రమ నిర్మాణంపై బాధితులు, స్థానికులు హెచ్ఎండిఎకు ఫిర్యాదు చేయగా, విచారణ బాధ్యతను అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు అప్పగించారు. అయితే, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంటి కింది స్థాయి అధికారులు అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై, భారీగా ముడుపులు అందుకుని విచారణను పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలున్నాయి.
“అటునుంచి కొలిస్తే అలా, ఇటునుంచి కొలిస్తే ఇలా వస్తుంది” అంటూ గందరగోళ నివేదికలు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప, వాస్తవాలను వెలికితీయడం లేదు. ఈ వ్యవహారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా ఫలితం శూన్యం. విలువైన అటవీ సంపద అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
నకిలీ ‘నాలా’ పత్రాలతో వ్యవస్థకే సవాల్
ఈ కుంభకోణంలో మరో కీలక మోసం నకిలీ ‘నాలా’ (వ్యవసాయేతర భూమిగా మార్పు) పత్రాల సృష్టి సర్వే నెం. 121లో కేవలం 25 ఎకరాలకు మాత్రమే ‘నాలా’ అనుమతి ఉండగా, ఈ సంస్థ ఏకంగా 6.15 ఎకరాలకు బోగస్ పత్రాలను సృష్టించింది. ఈ నకిలీ పత్రాలనే హెచ్ఎండిఎకు సమర్పించి నిర్మాణ అనుమతులు పొందడం వ్యవస్థలోని లొసుగులకు అద్దం పడుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ మోసం బయటపడటంతో, ఇబ్రహీంపట్నం ఆర్టీఓ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి
కింది స్థాయి రెవెన్యూ, హెచ్ఎండిఎ అధికారులు పూర్తిగా విఫలమైన నేపథ్యంలో, ఈ అటవీ భూమి ఆక్రమణపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం భూ వివాదం కాదు, ప్రభుత్వ ఆటవీ సంపదను కొల్లగొడుతున్న తీవ్రమైన నేరం.
కలెక్టర్ వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి, అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన, అవినీతికి పాల్పడిన అధికారులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ భూములను కాపాడటంలో జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా, నకిలీ పత్రాలతో ప్రజలను మోసం చేస్తూ, పర్యావరణానికి హాని కలిగిస్తున్న సమిశ్రీ నిర్మాణ సంస్థ అనుమతులను తక్షణమే రద్దు చేయాలి. ఇప్పటివరకు కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, సంస్థ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

