ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రముఖ హంగేరియన్ నవలా రచయిత, స్క్రీన్ రైటర్ లాస్లో క్రాస్జ్నాహోర్కై దక్కించుకున్నారు. ప్రళయాల మధ్య కూడా కళ శక్తిని చూపించిన ఆయన రచనలకు గాను ఈ అత్యున్నత గౌరవం దక్కినట్లు స్వీడిష్ అకాడమీ పేర్కొంది. గతేడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి హాన్ కాంగ్‌కు వచ్చింది. ఇక క్రాస్జ్నాహోర్కై.. గంభీరమైన వాక్య నిర్మాణాలు, నిరాశ, భవిష్యత్తు గురించి భయపెట్టే ఇతివృత్తాలతో కూడిన పోస్ట్‌మోడర్న్ నవలలు రచించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్య రచనలలో ‘సాతాన్ ట్యాంగో, ‘ది మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్’ ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. నోబెల్ సాహిత్య బహుమతిని స్వీడిష్ అకాడమికి చెందిన నోబెల్ కమిటీ విజేతలకు ప్రధానం చేస్తుంది. స్వీడిష్ అకాడమీ సభ్యులు ముందుగా నామినేటెడ్ అభ్యర్థుల రచనలను సీక్రెట్‌గా అంచనా వేస్తారు. అకాడమీ సభ్యులు ఎవరికి ఎక్కువగా మద్దతిస్తే వాళ్లే నోబెల్ బహుమతికి తుది అర్హత సాధిస్తారు. నోబెల్ బహుమతికి సంబంధించి గోప్యతా నియమం అన్ని విభాగాలకు వర్తిస్తుంది. అక్టోబర్ 6న నోబెల్ బహుమతి పురస్కారాలు ప్రకటన మొదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 13 వరకు ఇది కొనసాగించనున్నారు. ఇటీవల వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ల పేర్లు ప్రకటించారు. గురువారం సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి విజేత పేరును ప్రకటించారు. ఇక శుక్రవారం శాంతి బహుమతి, చివరగా అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోబోయే వాళ్ల పేర్లు ప్రకటించనున్నారు.