Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణKTR | కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

KTR | కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, దేశ ప్రజలను బీజేపీ నిలువునా ముంచింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో విమర్శించారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని, వాటిని దారిలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌కు చెందిన డాక్టర్ దంపతులు డా. ఒంటేల రోహిత్ రెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ డా. గొగుల గౌతమి రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాత రోజులు తెస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతులకు కేవలం కన్నీళ్లే మిగిల్చారని కేటీఆర్ ఆరోపించారు. రైతు డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, రాష్ట్రంలోని రైతుల దుస్థితిపై మౌనంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇటీవల సూర్యాపేటలో యూరియా కోసం నిరసన తెలిపిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని, ఒక గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ టార్చర్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకువెళ్తానని కేటీఆర్(KTR) హామీ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్లలో జీఎస్టీ శ్లాబుల ద్వారా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు బీహార్ ఎన్నికల ముందు ఏదో ఉపకారం చేస్తున్నట్లుగా వాటిని తగ్గిస్తున్నారని విమర్శించారు. నల్లధనం వెనక్కి తెస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు ఇస్తామని ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని గుర్తుచేశారు. ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.350 నుంచి రూ.1,200కు, పెట్రోల్ ధరను రూ.65 నుంచి రూ.110కి పెంచి మతం పేరుతో ఓట్లు అడగడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు రహస్య సీఎంలా వ్యవహరిస్తూ, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తులను కావాలనే ఆలస్యం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును కేవలం ఐదు అడుగులు పెంచడానికి రూ.70,000 కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ మౌనంగా ఉందని, కానీ బీఆర్ఎస్ పాలనలో రూ.93,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు :

బీసీ రేజర్వేషన్ల పై ప్రభుత్వ జీఓ

RELATED ARTICLES
- Advertisment -

Latest News