కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ వ్యాఖ్యలు
హెచ్1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయం పెను సంచలనం సృష్టించడం ఒక ఎత్తయితే, దీనిపై దేశీయంగా, విదేశాల్లోనూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రంప్ నిర్ణయంపై టెక్ కంపెనీలు సమాలోచనలు చేస్తున్నాయి. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్ మాట్లాడుతూ… ట్రంప్ నిర్ణయాలు దేశీయ రాజకీయాలతో ముడిపడి ఉంటాయని అభిప్రయాపడ్డారు. హెచ్1బీ వీసాల కారణంగా ఎక్కువ జీతాలు తీసుకొనే అమెరికన్ల కంటే, తక్కువ జీతాలు తీసుకొనే భారతీయుల వైపే అక్కడి కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని ట్రంప్ ఆయన కార్యవర్గం భావిస్తోంది. అయితే, ఫీజు లక్ష డాలర్లకు పెంచితే తమకు కావాల్సిన, ఎక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే అమెరికాకు వస్తారని వారు అనుకుంటున్నారు. ఈ నిర్ణయం వెనక ట్రంప్ లాజిక్ ఏంటో, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది నాకు అర్థం కావడం లేదు. దీంతో అనేక కంపెనీలు ఎక్కువ ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చేస్తాయని శశిథరూర్ పేర్కొన్నారు.