ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
నారపల్లి వద్ద ఉన్న సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనతో విద్యార్థి సాయి తేజ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ముందు ధర్నా చేపట్టి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ర్యాగింగ్‌ను అరికట్టడంలో విఫలమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆత్మహత్యకు గురైన విద్యార్థి సాయి తేజ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, విద్యార్థులను ఇబ్బంది పెట్టే అంశాలపై విచారణ చేపట్టి, సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ధర్నాలో పాల్గొన్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో జాజుల లింగం గౌడ్, భూపెల్లి నారాయణ, పూదరి హరీష్ గౌడ్, మద్దల సంతోష్ ముదిరాజ్, జక్కుల మధు యాదవ్, కాటం శివ, పెంచాలా సతీష్, భారీ అశోక్ యాదవ్, కొమ్మరబోయిన సైదులు యాదవ్, లింగంపల్లి నాగరాజ్, మామిడాల రవికుమార్, కేశ బోయిన మురళి తదితరులు ఉన్నారు.