కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ECI) గురువారం నిరాధారమైనవని అని తోసిపుచ్చింది.
ఎన్నికల ప్రక్రియపై రాహుల్ గాంధీ అవగాహన ప్రశ్నార్ధకంగా ఉందని, ‘ఆన్‌లైన్ సాధనం’ ద్వారా ఓట్లు తొలగించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం పేర్కొంది. రాహుల్ గాంధీ చేసిన వాదనలలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.
అంతకుముందు, రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక విలేకరుల సమావేశంలో, కాంగ్రెస్ బలోపేతంగా ఉన్న ప్రాంతాలలో, నకిలీ లాగిన్‌ల మరియు ఫోన్ నంబర్‌లను ఉపయోగించి అధిక సంఖ్యలో ఓట్ల తొలగింపులు జరిగాయని పేర్కొన్నారు. అలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లు తొలగించబడ్డాయని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపు ఆరోపణను ఎన్నికల కమిషన్ ఖండిస్తూ, ఏ అధికారి ఓట్ల తొలగింపు చేయలేరని, అది కూడా ఆన్‌లైన్‌లో చేయలేమని అన్నారు. ఓటర్ ని సంప్రదించకుండా, తెలియకుండా ఓటు తొలగించడం జరగదని ఎన్నికల కమిషన్ తెలిపింది. 2023లో, అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపుకు కొన్ని విఫల ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల కమిషనే స్వయంగా FIR దాఖలు చేసిందని తెలిపారు.