- స్కూల్ అనుమతులు రద్దు చేసిన విద్యాశాఖ
- ఈ మేరకు విద్యాశాఖ అధికారి హరీష్ చంద్ర ఆదేశాలు
- ఇటీవల స్కూల్‌పై ఈగల్ టీమ్ దాడిలో బయటపడ్డ డ్రగ్స్ తయారీ ముఠా..
- పాఠశాల విద్యార్థులను ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు ఏర్పాట్లు
- నేడు మేధా స్కూల్‌ను పరిశీలించనున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై పోలీసులు దాడులు వేగవంతం
- డ్రగ్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు వెల్లడి
సికింద్రాబాద్ పరిధి బోయినపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంగా కొనసాగుతున్న మేధా హైస్కూల్‌పై విద్యాశాఖ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. మేధా హైస్కూల్‌కు విద్యాశాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. బాలానగర్ మండల విద్యాశాఖ అధికారి హరీశ్ చంద్ర ఆదేశాలతో.. ఈ హైస్కూల్‌ను సీజ్ చేశారు. అంతేకాకుండా స్కూల్‌కు సంబంధించిన అన్ని అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఈ మేధా హైస్కూల్‌ను నేడు విద్యాశాఖ ఉన్నతాధి కారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ హైస్కూల్‌ను శాశ్వతంగా మూసి వేయనున్నారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిని ఇతర స్కూళ్లలో జాయిన్ చేసేందుకు విద్యా శాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సికింద్రాబాద్ పరిధి ఓల్డ్ బోయినపల్లిలోని మేధా హైస్కూల్‌పై రెండ్రోజుల క్రితం ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా స్కూల్ వేదికగా భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించింది. అందుకు సంబంధించి హైస్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల తరగతి గదుల పక్కనే.. ఎవరికీ అనుమానం రాకుండా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. అందుకు సంబంధించి లక్షలాది రూపాయాల విలువైన డ్రగ్స్ ను ఈ సందర్భంగా ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మేధా హైస్కూల్‌కు గతంలో జారీ చేసిన అన్ని అనుమతులు రద్దు చేయడంతోపాటు శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ముఠాలపై పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారు. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో భారీగా డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగు మంది డ్రగ్ పేడ్లర్లను అరెస్టు చేసి 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకుని మరో 5 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. ఇదే సమయంలో వరంగల్లో కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 32 కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు 8 లక్షల రూపాయలని పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు పరిధిలో ఇద్దరిని అరెస్టు చేసి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. దాని విలువ 7.5 లక్షల రూపాయలుగా అంచనా వేయబడిరది. వరంగల్ ఇనావోలు పరిధిలో మరో పేడ్లర్ను అరెస్టు చేసి భారీగా 214 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసిన గంజాయి విలువ 53.5 లక్షలు అని పోలీసులు తెలిపారు. ఇక సంగారెడ్డిలో ఆల్ఫాజొలామ్ తయారీ యూనిట్ను గుట్టురట్టు చేసిన పోలీసులు, 270 గ్రాముల ఆల్రాజొలామ్, 7.890 కేజీల నోర్డయాజిపామ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంలను అరెస్టు చేశారు. మొత్తంగా ఈ దాడుల్లో పోలీసులు 16.31 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.