Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఆదాబ్ ప్రత్యేకంజూబ్లీహిల్స్ బైపోల్.. టికెట్ ఫైట్..

జూబ్లీహిల్స్ బైపోల్.. టికెట్ ఫైట్..

  • యువ నేతగా వి. నవీన్ యాదవ్.. మాజీ మేయర్ ఇమేజ్‌తో బొంతు రామ్మోహన్?
  • కాంగ్రెస్ వ్యూహం.. డబుల్ టార్గెట్
  • నగరంలో కాంగ్రెస్ ప్రతిష్టను పరీక్షించే ఎలక్షన్
  • బొంతు రామ్మోహన్ వర్సెస్ వి. నవీన్ యాదవ్
  • ఒక్క సీటు, రెండు ఫాక్టర్లు, మూడు సమీకరణాలు
  • హైటెక్ సిటీ ప్రాంతం, బస్తీల సమీకరణం కీలకం
  • నూతన ఓటర్ల తీర్పు ఎటు మళ్లుతుందో ఉత్కంఠ
  • టికెట్ కేటాయింపుల్లో బీసీ అభ్యర్థికే ప్రాధాన్యం

తెలంగాణ రాజకీయాల వేడి మళ్లీ హైదరాబాద్ నగరంపై కేంద్రీకృతమైంది. సాధారణంగా బైపోల్ ఎన్నిక అంటే రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఈసారి జూబ్లీహిల్స్ బైపోల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇది కేవలం ఒక నియోజకవర్గం ఎన్నిక కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు పునాది వేయగల కీలక సమరం. ఇది బిఆర్ఎస్ భవిష్యత్తు పతనానికి నాంది కావచ్చు. ఇది బీజేపీ నగర దండయాత్రకు బ్రేక్ వేయగల సమరం కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు జూబ్లీ‌హిల్స్ నియోజకవర్గం పరిధిలోని రెహమత్ నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశం కేటీఆర్ సమక్షంలో జరిగింది.. ఆ సమావేశంలో కేటీఆర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత పోటీ చేస్తారని చెప్పకనే చెప్పేశారు.. ఇక బీజేపి అభ్యర్థి విషయానికొస్తే మహా కూటమి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఆ అభ్యర్థి బీజేపీ,టీడీపీ,జన సేన పార్టీలలో ఎవరనేది తేలాల్సి ఉంది.. ఇక బీఆర్ఎస్ కు ఎమెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత కూడా పోటీ చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్.. రసవత్తరంగా మారింది..

జూబ్లీహిల్స్ బైపోల్.. గ్రేటర్ ఎన్నికలను ప్రభావితం చేయొచ్చు..
జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం తెలంగాణలోని శాసనసభ సమీకరణాలను మార్చకపోయినా, నగర రాజకీయ సమీకరణాలను మలుపు తిప్పగల శక్తి కలిగి ఉందనేది అక్షర సత్యం… ఎందుకంటే హైదరాబాద్ నగరం కేవలం 24 అసెంబ్లీ సీట్లు కలిగి ఉన్నట్టే కాదు, రాష్ట్ర రాజకీయాలకు సైకాలజికల్‌గా పెద్ద ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ కాంగ్రెస్ బలం పెరిగితే అది రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ కు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. బిఆర్ఎస్ బలం తగ్గితే అది మొత్తం రాష్ట్రంలో డామినో ఎఫెక్ట్ సృష్టిస్తుంది. బీజేపీ హడావిడి ఆగిపోతే అది రాష్ట్ర స్థాయి పొలిటికల్ నెరేటివ్‌ను మార్చేస్తుంది..ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఉప ఎన్నిక ప్రభావం తప్పక ఉంటుంది..అందుకే జూబ్లీహిల్స్ బైపోల్ “ఒక చిన్న సీటు ఎన్నిక కాదు..తెలంగాణ రాజకీయ దిశను మలుపు తిప్పగల కేంద్రీయ సమరం” గా మారిపోయింది..

బొంతు రామ్మోహన్ – కాంగ్రెస్ కొత్త హోప్
జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ తరఫున బొంతు రామ్మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. రామ్మోహన్‌ ఒక సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు.జీహెచ్ఎంసీ మేయర్‌గా తన పనితీరు ద్వారా నగర ప్రజలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పాలనలో రోడ్లు, డ్రైనేజీలు, కాలనీల సమస్యలు, హౌసింగ్, బస్తీ అభివృద్ధి వంటి పలు సమస్యలు పరిష్కారం అయ్యాయి. ముఖ్యంగా కార్పొరేటర్లతో గాఢమైన సంబంధాలు ఏర్పరచుకున్న ఆయన, వారిని సమన్వయం చేయగల మిడిల్ లీడర్‌గా నిలిచాడు.జూబ్లీహిల్స్ లాంటి మిశ్రమ జనాభా ఉన్న నియోజకవర్గంలో ఈ ఫ్యాక్టర్ చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ బస్తీలు ఉన్నాయి, మధ్యతరగతి అపార్ట్‌మెంట్ కాలనీలు ఉన్నాయి, ఎలైట్ సెగ్మెంట్ ఉంది. ఈ మూడు వర్గాలకీ ఏదో ఒక విధంగా కనెక్ట్ అవ్వగల సామర్థ్యం ఒక్క రామ్మోహన్‌కు మాత్రమే ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లకు – రోడ్లు, డ్రైనేజీ, చెత్త సమస్యలపై ఆయన గతంలో మేయర్‌గా పనిచేసిన అనుభవం గుర్తు ఉంది. ఇక బస్తీ ఓటర్ల విషయానికొస్తే – హౌసింగ్, రేషన్, బేసిక్ సర్వీసులపై ఆయన చూపిన పట్టుదల గుర్తు ఉంది…ఇక ఎలైట్ వర్గం విషయానికొస్తే – ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్‌లో కూడా ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఇది “మూడు వర్గాల సమీకరణ” ..ఇది జూబ్లీహిల్స్ సీటు గెలుపు నిర్ణయించే ప్రధాన అంశం.

నవీన్ యాదవ్ ఒక ఫ్రెష్ ఫేస్, ఒక కొత్త దిశ
తెలంగాణ రాజకీయాల్లో చాలా మంది యువ నేతలు ఉన్నా,అందులో ప్రజలతో బలమైన కనెక్ట్ సాధించినవారు చాలా తక్కువ. నవీన్ యాదవ్ ఆ లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది, డైనమిక్ అటిట్యూడ్ ఉంది, ముఖ్యంగా యువతను తనవైపు తిప్పుకునే మానసిక శక్తి ఉంది.రాజకీయాల్లో ఆయన ప్రవేశం పెద్దగా హంగామా లేకుండా మొదలైంది. కానీ కాలక్రమేణా పాదయాత్రల్లో, పార్టీ ఉద్యమాల్లో, గాంధీభవన్ ఆందోళనల్లో ఆయన ముందువరుసలో నిలబడి పని చేశారు. పార్టీ లైన్‌కు నిబద్ధత, స్పష్టత, పరపతి .. ఇవన్నీ కలగలిపితే ఆయన ఒక పాజిటివ్ లీడర్‌గా, ఒక కొత్త శక్తిగా బయటకు వచ్చారు.ఇప్పటి ఎన్నికల్లో ఒక వాస్తవం సూటిగా చెప్పుకోవాలి. 50% కంటే ఎక్కువ ఓటర్లు యువతే. వీరు సాంప్రదాయ నాయకులపై, పాత ముఖాలపై విసుగెత్తిపోయారు. వీరు కోరేది కొత్త ఆలోచనలు, కొత్త దిశ, తమ సమస్యలను అర్థం చేసుకునే లీడర్.నవీన్ యాదవ్ ఈ యువతలో అసాధారణ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయనలో ఉన్న సింప్లిసిటీ, గ్రౌండ్ కనెక్ట్, టెక్-సావీ ఇమేజ్ యూత్ ఐకాన్. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్, స్టార్టప్ యూత్, విద్యార్థులు, జాబ్ ఆశావహులు “మన వాడే, మన భవిష్యత్తు లీడర్” అనిచెప్పుకునేలా చేశేశాయి..

జూబ్లీహిల్స్ ఓటర్ల గణాంకాల గణితం
జూబ్లీహిల్స్ అనగానే చాలా మంది ఇది కేవలం హై-ఫై, ఫిల్మ్ నగర్ సీటు అనుకుంటారు. కానీ వాస్తవం భిన్నం.
మధ్యతరగతి (అపార్ట్‌మెంట్ కాలనీలు) – 40%
బస్తీలు (పేద వర్గాలు) – 35%
ఎలైట్ వర్గం (ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్) – 25%
ఈ లెక్కల్లో కాంగ్రెస్ గెలవాలంటే మధ్యతరగతి + బస్తీ వర్గాల మద్దతు తప్పనిసరి. ఎలైట్ వర్గం ఎన్నికలపై అంతగా ప్రభావం చూపదు. కానీ ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. కాంగ్రెస్ కి ఈ మూడు వర్గాలపై బలమైన కనెక్ట్ ఉంది.

కాంగ్రెస్ వ్యూహం .. డబుల్ టార్గెట్
కాంగ్రెస్‌కి ఈ ఎన్నికలో రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి:
బిఆర్ఎస్ అసంతృప్తిని వాడుకోవడం
– కవిత, కేసీఆర్ కుటుంబంపై అసంతృప్తి ఉన్న వర్గాలను తనవైపు తిప్పుకోవాలి.
బీజేపీ వర్గాన్ని బ్రేక్ చేయడం
– బీజేపీ నగరంలో హిందూ ఓటర్లపై ఆధారపడుతుంది. కానీ రామ్మోహన్,నవీన్ యాదవ్ ముస్లిం కార్పొరేటర్లతోనూ, హిందూ సంఘాలతోనూ మంచి అనుబంధం కలిగి ఉన్నారు. ఈ “సోషల్ ఇంజనీరింగ్ లతో ” బీజేపీకి బ్రేక్ వేయవచ్చు. ఈ రెండు లక్ష్యాలు సాధించాలంటే రామ్మోహన్, నవీన్ యాదవ్ వంటి బీసీ లీడర్లలో ఒకరికి టికెట్ ఇవ్వడం తప్ప కాంగ్రెస్ వద్ద మరో మార్గం లేదు.

జూబ్లీహిల్స్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ తీసుకోబోయే నిర్ణయం కేవలం టికెట్ ఎవరి చేతికెళ్తుందనే విషయమే కాదు, అది పార్టీ భవిష్యత్తు దిశను కూడా నిర్ణయిస్తుంది. బొంతు రామ్మోహన్‌ అనుభవంతోనూ, నవీన్ యాదవ్‌ యువశక్తితోనూ కాంగ్రెస్ ఒకే ఫలితాన్ని అందుకోనుంది.. అది విజయమే. కాబట్టి టికెట్ కేటాయింపులో ‘ఎవరు’ అనేది పెద్ద ప్రశ్న కాదు, ‘ఎలా గెలుస్తారు’ అనేదే ఇప్పుడు చర్చించదగిన అంశం. ఎందుకంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురడం అనివార్యమని ప్రజా సమీకరణలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి కాబట్టి..

RELATED ARTICLES
- Advertisment -

Latest News