Friday, September 12, 2025
ePaper
spot_img
Homeజాతీయం13న ప్రధాని మోడీ మణిపూర్‌ పర్యటన

13న ప్రధాని మోడీ మణిపూర్‌ పర్యటన

  • అక్కడి ప్రజల్లో సర్వత్రా ఆసక్తి
  • ఎలాంటి హామీలు ఇస్తారన్న ఉత్కంఠ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న కల్లోలిత మణిపూర్‌ను సందర్శించనున్నారు. విదేశాలకు వెళుతున్న మోడీ మణిపూర్‌ మాత్రం వెళ్లడం లేదని విపక్షాలు విమర్వలు చేస్తున్న వేళ ఆయన మణిపూర్‌ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి స్వాంతన కలిగించే అవకాశం ఉంది. బ్రిటిష్‌ వలసపాలకులు మణిపూర్‌ను కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలుగా విభజించి ఆ రెండిటిని వేర్వేరు పరిపాలనా వ్యవస్థల కింద ఉంచారు. ఈ వేర్పాటు కొండ ప్రాంతాలలో అధికంగా ఉండే కుకీజోలు, మైదాన ప్రాంతాలలో సంపూర్ణ ప్రాబల్యమున్న మెయితీల మధ్య వైమనస్యతను సృష్టించించింది. అది క్రమంగా తీవ్రతను సంతరించుకుని ఇప్పటికీ వైషమ్యాలను రగుల్కొలుపుతోంది. కొండ ప్రాంతాలలో ఉండే కుకీజోలు, ఇంకా నాగాలు మొదలైన తెగలవారు రాష్ట్ర జనాభాలో 47 శాతంగా ఉన్నారు. అయితే వీరి అధీనంలో విస్తారమైన భూములు ఉన్నాయి. మైదాన ప్రాంతాలలో ఉండే మెయితీలు రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్నారు వీరికి భూ వసతి తక్కువే అయినప్పటికీ మొదటి నుంచీ రాజకీయ అధికారం చెలాయిస్తున్న సామాజిక వర్గమిది. భూమి హక్కులతో పాటు రాజకీయ అధికారంలో అసమ ప్రాతినిధ్యం విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో ఆ ఘర్షణలు విషమించాయి.

రాష్ట్ర రాజకీయాలపై పెత్తనం చెలాయిస్తున్న మెయితీలు తమకు షెడ్యూల్డు తెగ హోదా సాధించుకునేందుకు పూనుకున్నారు. తద్వారా కొండ ప్రాంతాలలోని భూములను తమ ఆర్థిక బలంతో కైవసం చేసుకోవచ్చనేది వారి ఆలోచన. మణిపూర్‌ హైకోర్టు 2023 ఏప్రిల్‌ 14న మెయితీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వానికి సూచించింది. మెయితీలకు ఎస్టీ హోదా లభిస్తే కొండ ప్రాంతాల భూములు సమస్తమూ వారి అధీనమవుతాయని తమకు మనుగడే కష్టమవుతుందని కుకీలు ఆందోళనకు గురయ్యారు. తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు కుకీజోలు పోరాటపథం పట్టారు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పూర్తిగా మెయితీ పక్షపాతం వహించారు. కుకీజోల అలజడిని నిర్లక్ష్యం చేశారు. పైగా వారిని నార్కో టెర్రరిస్ట్‌లు అని నిందించారు. దీంతో కుకీజోలు మే 3న ఒక బృహత్‌ నిరసన ప్రదర్శనకు ఉద్యుక్తులయ్యారు. మెయితీలు ప్రతిదాడులకు పూనుకున్నారు. హింస ప్రజ్వరిల్లింది. అది దావానలంలా రాష్ట్రమంతటా వ్యాపించింది. వందల మంది బలయ్యారు. వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రెండేళ్లు దాటినా ఆ హింసాగ్నులు ఇంకా పూర్తిగా ఆరనేలేదు. మెయితీలు, కుకీజోలను దహించివేస్తున్న పరస్పర విద్వేషాగ్నులు మణిపురి సమాజాన్ని సైనికీకరణ చేశాయి.

సంక్షోభానికి కారకుడైన ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చివరకు పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయిన తరువాత రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోయిన మోదీ సర్కార్‌ రాష్ట్రపతి పాలనను విధించింది. అయినా పరిస్థితులు యథాతథంగా కొనసాగుతున్నాయి. మెయితీలతో తమ సహజీవనం అసాధ్యమని, తమ ప్రాంతాలకు శాసన నిర్మాణ అధికారాలతో కేంద్ర పాలిత ప్రాంత హోదా నివ్వాలని కుకీజోలు డిమాండ్‌ చేస్తున్నారు. మెయితీలు, కుకీజోల మధ్య హింసాత్మక ఘర్షణలను నివారించేందుకు ఇరువర్గాల ప్రాంతాల మధ్య తటస్థ మండలాలనేర్పాటు చేసి వాటిని కేంద్ర భద్రతా బలగాల కాపలాలో ఉంచారు. దీనివల్ల మణిపూర్‌లో ప్రజల, సరుకుల రవాణా నిర్నిరోధంగా సాగడం అసాధ్యమైపోయింది. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడాలంటే కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలి. ఇది జరగాలంటే బీజేపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు విశాల దృక్ఫథంతో నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. ఇలా అతలాకుతలమైన ఈశాన్య భారత రాష్ట్రం శాతి సాధించాలి. ప్రధాని మోదీ పర్యటనతో మార్పు వస్తుందా అన్నది చూడాలి. అక్కడి ప్రజలకు ఎలాంటి హావిూలు ఇస్తారన్నది కూడా ముఖ్యం. అన్నింటికి మించి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News