- రాజ్యాంగాన్ని తిరగారాయాలంటున్న జెన్ జడ్
- సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసిన భారత్
హిమాలయ హిందూ దేశం ఆర్మీ చేతుల్లోకి వెళ్లింది. ఆర్మీ కంట్రోల్ చేసేందుకు అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. జెన్ జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగిరాయాలని డిమాండ్ చేశారు. ఈ యువతరంగం నేపాల్ పాలనలో సమూల మార్పులు ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగా కొన్ని డిమాండ్లను ముందుంచింది. ఈ ఉద్యమం ఒక పార్టీ, ఒక వ్యక్తి కోసం కాదు. మొత్తం ఒక జనరేషన్, దేశ భవిష్యత్తు కోసం. కొత్త రాజకీయ వ్యవస్థ ఆధారంగానే శాంతి నెలకొంటుంది. అధ్యక్షుడు, నేపాల్ సైన్యం మా ప్రతిపాదనలను సానుకూలంగా అమలుచేస్తుందని భావిస్తున్నామని ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని, మూడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. అలాగే ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగాన్ని పారదోలేందుకు, వలసలు అరికట్టేందుకు, సామాజిక అన్యాయాన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. వీరి బృందం ఆర్మీ ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడిని కలవనుంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న భారత్.. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్కసారిగా పెల్లుబికిన ఆందోళనల తీవ్రతకు కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో సైనికులు రాజధాని కాఠ్‌మాండూ వీధుల్లో పహారా కాస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. నిరసనకారులు చర్చలకు రావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ వేళ.. విధ్వంసం, దోపిడీ, దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేపాల్ ను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మన దేశం భద్రతను పెంచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూగబోయాయి. తమ రోజువారీ జీవనానికి ఆటంకం ఏర్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.