Friday, September 12, 2025
ePaper
spot_img
Homeజాతీయంహైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు హైదరాబాద్‌ను అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఆ నాయకులు పునాది వేసినట్టు ఆయన గుర్తుచేశారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. హైటెక్‌ సిటీ నిర్మాణ సమయంలో చాలామంది అవహేళన చేసినప్పటికీ, నేడు హైదరాబాద్‌ సింగపూర్‌, టోక్యో వంటి మహానగరాలతో పోటీ పడుతున్న స్థాయికి ఎదిగిందని చెప్పారు. “మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయాలి. గూగుల్‌ వంటి గ్లోబల్‌ కంపెనీల్లో తెలుగువారు పెద్ద ఎత్తున ఉన్నారు. ఐటీ రంగ అభివృద్ధికి రాజీవ్‌ గాంధీ చొరవతోనే పునాది పడింది,” అని సీఎం వ్యాఖ్యానించారు.

అమెరికాలో ఐటీ రంగంలో తెలుగువారి ప్రతిభ కీలకమని రేవంత్ పేర్కొన్నారు. “మన నిపుణులు పని ఆపేస్తే ఆ దేశం స్తంభించిపోతుంది” అని ఆయన అన్నారు. గతంలో విద్యా అవకాశాలు విస్తరించేందుకు పలు విద్యాసంస్థలను నిర్మించారని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అయితే, నగర అభివృద్ధికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారిని ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణంకు వ్యతిరేకంగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. “మూసీ నది ప్రక్షాళనతో పాత నగరానికి పూర్వ వైభవం తిరిగి వస్తుంది. అయినా ఈ పనిని ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు,” అని సీఎం ప్రశ్నించారు.

2047 నాటికి తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రేవంత్ వెల్లడించారు. “మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన తప్పనిసరిగా జరుగుతాయి. నగర అభివృద్ధికి అడ్డుపడేవారు మనకు శత్రువులే” అని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు ఉద్యోగ భద్రతను కల్పించామన్న ముఖ్యమంత్రి, భవిష్యత్తు తరాలకు మరింత బలోపేతమైన మౌలిక సదుపాయాలు అందించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News