వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ చీదురు శంకర్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి స్వాతంత్ర్య ఫలాలను ప్రతి పౌరునికి అందించడమే ఈ గణతంత్ర దినోత్సవం ముఖ్య ఉద్దేశమని, విద్యార్థులు నవ భారతానికి నాంది పలకాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు విచ్చేసి “పద పద పదరా మన పర్వతగిరి పాఠశాలకు” అనే ‘పాఠశాల గీతా’న్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా నాన్న గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ఎర్రబెల్లి జగన్నాధ రావు కుటుంబం తరఫున ఐదు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగిందని, పాఠశాల అభివృద్ధికి పేద విద్యార్థుల చదువుకు మునుముందు కూడా మా సహాయం ఉంటుందని తెలిపారు. పాఠశాల గీతాన్ని రూపొందించిన ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్ కుమార్ ని, తెలుగు సీనియర్ పండితులు డా.మడత భాస్కర్ ని, ఉపాధ్యాయులను అభినందించారు. సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం విశిష్టతను వివరించారు.
పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు పాక రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు తన బాధ్యతను కూడా దేశం కోసం నిర్వర్తించాలని ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ఆటల పోటీలలో పాల్గొన్న విద్యార్థి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పరుశరాములు, కే .శ్రీధర్ అశోక్ కుమార్, మనోహర్, రజిత డి రాధాకృష్ణకుమారి ఏ తిరుమల, డాక్టర్ ఎం. రాజలక్ష్మి ,డి రవి కుమార్, పి.అనిల్ కుమార్, జి ప్రశాంత్, ఐ.రమేష్ బాబు, ఎం శ్వేత బి. రేఖ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
