సొంత పార్టీ నుంచే తనకు అన్యాయం జరిగిందని, తనను పార్టీకి దూరం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత, భావోద్వేగానికి గురయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తనపై జరిగిన కుట్రలు ఎంత గానో బాధపెట్టాయని,ఈ కుట్రల వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోనని ఆమె శపథం చేశారు.
సిద్దిపేట, చింతమడకకు రావడానికి కూడా తనపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశిస్తూ చింతమడక ఎవరి సొంత ఆస్తి కాదని కవిత వ్యాఖ్యానించారు. ఎన్ని ఆంక్షలు పెట్టిన, ఈ గ్రామానికి మళ్ళీ మళ్ళీ వస్తానని ఆమె స్పష్టం చేశారు.
బతుకమ్మ వేడుకలకు తనను ఆహ్వానించిన గ్రామ ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజల ఆశీస్సులు ఉంటే, తన పుట్టిన గడ్డ తన ‘కర్మభూమి’గా మారుతుందని ఆమె పేర్కొన్నారు. చింతమడక చరిత్ర సృష్టించిన గ్రామమని కవిత అన్నారు. “ఈ నేల నుంచి ఒక ఉద్యమం మొదలై చరిత్రను సృష్టించింది. కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు” అని ఆమె గుర్తు చేసుకున్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సెప్టెంబర్ 3న తన తండ్రి కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత కవిత బీఆర్ఎస్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కేసీఆర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలకు హరీశ్ రావు, సంతోష్ కుమార్ లే కారణమని ఆమె బహిరంగంగా ఆరోపించారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. తన భవిష్యత్తు కార్యాచరణను తన మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయిస్తానని కవిత ఇప్పటికే ప్రకటించారు.