కర్ణాటకలోని బీదర్ ప్రాంతం లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ తన ఆరేళ్ళ సవితి కూతురిని మూడో అంతస్థు పైనుంచి తోసి చంపేసింది. నిందితురాలు రాధ తన సవితి కూతురైన శాన్వి ని మూడో అంతస్థు నుంచి కిందకి తోసి చంపేసింది. శాన్వి ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయినట్టు చిత్రీకరించింది.
చిన్నారి తండ్రి సిద్ధాంత్ తన రెండవ భార్య మాటలు నమ్మి ఆగస్టు 28న గాంధీ గంజ్ పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తె మూడవ అంతస్తు నుంచి జారిపడి మరణించిందని పేర్కొంటూ ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అయితే పక్కన ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అసలు నిజం బయట పడింది. సీసీటీవీ ఫుటేజ్‌లో, రాధ బాలికతో టెర్రస్ పై అనుమానాస్పదంగా నడుస్తూ కనిపించిందని, ఉద్దేశపూర్వకంగా ఆమెను తోసేస్తున్నట్లు కనిపించిందని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, వివరణాత్మక దర్యాప్తు తర్వాత, చిన్నారి శాన్వి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
చిన్నారి శాన్వి తల్లి 2019 లో అనారోగ్యంతో మరణించింది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సిద్ధాంత్, రాధను వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. సిద్ధాంత్ మరియు రాధలకు కవల పిల్లలు ఉన్నారు. ఆస్తి మొత్తం తన పిల్లలకే దక్కాలనే దురాలోచన తో శాన్వి ని చంపానని పోలీసుల విచారణ లో రాధ తెలిపింది.