Sunday, September 8, 2024
spot_img

పేదలకు సంక్షేమ పథకాలు అందాలి

తప్పక చదవండి
  • అధికారులు ప్రజలతో మర్యాదపూర్వంగా, సున్నితంగా మెలగాలి
  • అధికారులు విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు
  • తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం క్రింద అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణపై శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌ నియోజకవర్గస్థాయి అధికారులకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం దిశా నిర్దేశం సమావేశాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్వ హించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. వారం రోజుల పాటు కొనసాగే ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డులలో ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో 5 పథకాలైన మహా లక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ వారం రోజుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆయన తెలిపారు.

ప్రజా పాలనకు దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరిస్తూ దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ప్రజా పాలన నిర్వహణపై ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలన్నారు. ప్రజాపాలన బృందాలు సమయ పాలన పాటించాలని, షెడ్యూల్‌ ప్రకారం గ్రామాలు, వార్డులకు వెళ్లాలని, ముందుగానే గ్రామాలకు వెళ్లాలని, ప్రజాపాలన నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని చెప్పారు. గ్రామసభలు నిర్వహించే గ్రామపంచాయ తీలు, మున్సిపల్‌ వార్డుల వద్ద తాగునీరు, టెంట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజా పాలన సందర్భంగా మండల స్థాయి బృందాల ఏర్పాటు, గ్రామ సభ నిర్వహణపై ముందుగానే గ్రామాలలో ప్రజలకు సమాచారం అందించే విధంగా పత్రికలు, సోషల్‌ మీడియా, ఫ్లెక్సీలు, సైన్‌ బోర్డ్స్‌ తో పాటు టాంటాం ద్వారా ప్రచారం చేపట్టాలని ఆయన తెలిపారు.
అధికారులు అలసత్వం వహించారు..
అధికారులు అలసత్వం వహించకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా శ్రద్ధగా విధులు నిర్వహిస్తూ అమలు పరిచేందుకు కృషి చేయాలన్నారు. తహసిల్దార్‌, ఎంపీడీవోలు స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. గ్రామస్థాయిలో పనిచేసే అధికారులు ప్రజలు తమ దరఖాస్తులను పూరించడంలో అనుమానాలను నివృత్తి చేస్తూ వారికి సహకరించాలని స్పీకర్‌ సూచించారు. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలతో మమేకమై మంచి సమన్వయంతో ప్రజలకు సేవలందించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు విధుల పట్ల ఎలాంటి అలసత్వం వహించిన ఉపేక్షించేది లేదని సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ హెచ్చరించారు. అభయహస్తం ఆరు గ్యారెంటీల పైన పేద, నిరుపేదలు, అర్హులైన ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించాలని ఆయన తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్‌ 28 నుండి జనవరి 6వ తేది వరకే కాకుండా.. నాలుగు మాసాలకు ఒకసారి వివిధ అంశాలపై దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.అధికారుల దిశా నిర్దేశ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌ శర్మ, లింగ్యా నాయక్‌, ఆర్డీవో విజయ కుమారి, డిఎస్పి నర్సింలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల రమేష్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు సుధాకర్‌ రెడ్డి, సురేష్‌, శ్రీదేవి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు