Sunday, September 8, 2024
spot_img

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి..

తప్పక చదవండి
  • శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్నికల్ల గట్టెక్కేందుకు ఏకంగా ఏడుగురు ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి 2020 మార్చి మధ్య 15 నెలలు మినహా బీజేపీ గత నాలుగు పర్యాయాలుగా అధికారంలో ఉన్నది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కమలం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కమలం పార్టీ ప్రధానంగా మోదీ చరిష్మానే నమ్ముకొన్నది. రాష్ట్రంలో బీజేపీ ‘50 శాతం కమీషన్‌’ సర్కార్‌ను నడుపుతున్నదని కాంగ్రెస్‌ విమర్శిస్తున్నది. గత 18 ఏండ్ల బీజేపీ పాలనలో 250కి పైగా మేజర్‌ స్కామ్‌లు జరిగాయని ఆరోపిస్తూ లిస్టు విడుదల చేసింది. వీటిలో వ్యాపం రిక్రూట్‌మెంట్‌, అడ్మిషన్‌ స్కామ్‌ వంటివి ఉన్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో నేరాలు విపరీతంగా పెరిగాయి. మహిళలపై లైంగిక దాడులు, దళితులు, గిరిజనులపై దాడుల వార్తలు నిత్యం వస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు చీతాలో ఆరు చీతాలు, మూడు కూనల మరణాల అంశం కూడా బీజేపీకి ప్రతికూలం అయ్యే అవకాశం కనిపిస్తున్నది. రాష్ట్రంలో రైతాంగం, నిరుద్యోగ సమస్యలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. 2020 మార్చిలో తిరుగుబావుటా ఎగురవేసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చిన ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తన మద్దతుదారులందరికీ టిక్కెట్లు ఇప్పించుకోవడం పెద్ద సవాల్‌ అని చెప్పవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు