Sunday, September 8, 2024
spot_img

ఎమ్మార్వో ‘గౌతమ్‌’ భూదానం

తప్పక చదవండి
  • కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్‌
  • ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం
  • రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్‌ చేసిన వైనం
  • కోర్టు స్టే ను లెక్కచేయని తహశీల్ధార్‌
  • సర్వే నెం. 789/1లో బై నెం.లు క్రియేట్‌
  • పైసల కోసం ప్రభుత్వ భూమి రాసిచ్చిన ఎమ్మార్వో
  • రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మార్వో

భాగ్యనగరం నడిబొడ్డున ప్రభుత్వ భూమి కబ్జాకు గురవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కోట్లాది రూపాయల సర్కారు భూమిని అప్పనంగా రాసిచ్చాడు. గవర్నమెంట్‌ భూమిని కంటికి రెప్పల కాపాడాల్సిన ఉన్నత ఉద్యోగి (రెవెన్యూ అధికారి) పైసలకు కక్కుర్తిపడి సుమారు రూ. 50కోట్లకు పైగా విలువ చేసే ల్యాండ్‌ను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్‌ చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ మండలం, ఖల్సా గ్రామ పరిధి, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గరలో ఉన్న అత్యంత విలువైన సర్కారు భూమి కబ్జాకు గురైంది.

తహశీల్దార్‌ కోట్లల్లో లంచం..!
ఉప్పల్‌ ఖల్సా గ్రామ పరిధిలోని సర్వే నెం. 789/1లో మొత్తం 58 ఎకరాల తొమ్మిది గుంటల సర్కార్‌ భూమి ఉంది. అయితే దానిపై కన్నుపడ్డ కబ్జా కోరులకు అప్పటి తహశీల్దార్‌ గౌతం కుమార్‌ తన వంతు సహకరించారు. అందినకాడికి దోచుకొని సదరు ప్రైవేటు వ్యక్తులకు భూమిని రిజిస్టర్‌ చేశాడు. నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమి ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉంది. భూమికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు చేయకుండ కోర్టు స్టే ఉన్నప్పటికీ దానిని లెక్క చేయకుండా సుమారు రూ. 4 కోట్ల లంచం తీసుకుని నాటి ఉప్పల్‌ తహశీల్దార్‌ గౌతం కుమార్‌ (ప్రస్తుతం మొయినాబాద్‌ తహశీల్దార్‌) రాసిచ్చాడు. సర్వే నెం.789/2/2/1/1 లో 0.18 గుంటలు, సర్వే నెం.789/2/2/2లో 1 ఎకరం, సర్వే నెం.789/2/1 /2లో 0.34 గుంటల చొప్పున మొత్తం 2ఎకరాల 12 గుంటల భూమిని ఎం.కె తిరుపతి, తండ్రి ఎం.కె స్వామి పేరిట ఎమ్మార్వో రిజిస్టర్‌ చేసి ఇచ్చాడు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీగా ఉంటూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని బహిరంగ విమర్శలు ఉన్నాయి.

- Advertisement -

ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూమినే..
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ మండలం ఖల్సా గ్రామ పరిధిలో సర్వే నెం.789/1 లో 58ఎకరాల 9గుంటలు ఉండగా.. 789/2 లో 7 ఎకరాల 12 గుంటలు పట్టా భూమి ఉంది. సర్వే నెం.789/1 లో ఉన్న 58ఎకరాల 9గుంటల ప్రభుత్వ భూమిని ఎం.కె తిరుపతితో లోపాయికారి ఒప్పందం చేసుకొని 789/2లో బై నెంబర్‌లు సృష్టించి 2 ఎకరాలు 12 గుంటల ప్రభుత్వ భూమిని పట్టా చేసిండు. సమాచార హక్కు చట్టం ప్రకారం సదరు భూమిపై ఆధారాలు సేకరించడంతో తహసీల్దార్‌ భూభాగోతం బట్టబయలు అయింది. ఈ అక్రమ వ్యవహారంలో ఉప్పల్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షాహిన్‌ బేగం పాత్ర కీలకంగా ఉంది. సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉంటూ సీరియస్‌గా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. ఈమె గారు అవినీతి సొమ్మును తన భర్త ద్వారా తీసుకుంటున్నట్లు పూర్తి ఆధారాలను ఆదాబ్‌ సేకరించడం జరిగింది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి పాల్పడిన ఎమ్మార్వో గౌతమ్‌ కుమార్‌ పై, సీనియర్‌ అసిస్టెంట్‌ షాహిన్‌ బేగం పై జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి స్వాధీన పరుచుకొని ప్రజల సంక్షేమం కొరకు ఉపయోగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ అవినీతి భూభాగోతంలో భాగస్వాములైన అధికారుల, బీఆర్‌ఎస్‌ నాయకుల చీకటి ఒప్పందాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్‌.. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు