Sunday, September 8, 2024
spot_img

స్థానిక ఎన్నికలకు నాయకులు రెడీ..!

తప్పక చదవండి
  • ఎమ్యెల్యే శంకర్‌, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ల రాజకీయ వ్యూహం ఏంటో..?
  • సర్పంచ్‌, ఎంపీటీసీ, నామినేటెడ్‌ పదవులకు పెరుగుతున్న పోటీ..
  • అధికార పార్టీ కాంగ్రెస్‌లో నాయకుల ‘‘మస్కా’’..
  • ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కు ‘‘దోస్తీ’’ల వెల్లువ..
  • జోరుగా హుషారుగా కాంగ్రెస్‌..

కొత్తూరు : అసెంబ్లీ ఎన్నికల్లో అంకితభావంతో పనిచేశాను.. హై హై నాయకా అంటూ గెలుపు కోసం కృషి చేశాను.. అనుకున్న ఫలితం వచ్చింది.. మరి నాకేటి.. అంటూ నేతల సందడి మొదలైంది. సర్పంచ్‌ పదవీకాలం ముగుస్తుండడం, రానున్న ఏడాదిలోనే ఎంపీటీసీ, కౌన్సిలర్‌ ఎన్నికలు కూడా వస్తుండడం, మరోవైపు నామినేటెడ్‌ పదవులు లక్ష్యంగా గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలు అడుగులు ముందుకు వేస్తున్నారు. షాద్‌ నగర్‌ కొత్త ఎమ్మెల్యే ‘‘వీర్లపల్లి శంకర్‌’’ ద్వారా తమ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి ఈ కొంగొత్త సందడికి తెర తీస్తే..

  • మొన్న అలా..
    అసెంబ్లీ ఎన్నికలలో గ్రామీణ స్థాయి నుంచి ప్రతి నాయకుడు కాంగ్రెస్‌ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. అందుకే గ్రామాలు మొదలుకొని పట్టణం దాకా ప్రతి చోట కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ కనిపించింది. గ్రామీణ స్థాయిలో ఉన్న సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, మాజీలు, అలాగే ఓటు బ్యాంకు ఉన్న నాయకులు, ఆశావాహులు, ఇలా ప్రతి ఒక్కరు పార్టీ విజయం కోసం తమ వంతు కృషి చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కూడా అందరిని ఒక తాటి మీదకు తెచ్చి ముందుకు నడిపించారు. పార్టీ కోసం పని చేస్తే అధికారంలోకి వచ్చేది మనమే కాబట్టి అందరికీ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. దీనితో ఎన్నికలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సహజంగానే అధికార పార్టీ మీద ఒత్తిడి పెరుగుతుంది. పదవుల కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు నాయకులు పెద్ద ఎత్తున ముస్తాబయ్యారు.
  • మొదలైన ‘పంచాయతీ’..
    ప్రప్రథమంగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాయకులు పావులు కదుపుతున్నారు. సర్పంచ్‌ ఎన్నికల పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికల శంఖారావం మోగుతుంది అని గ్రహించిన గ్రామీణ నాయకులు తాము ఆశించిన పదవుల కోసం ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే నామినేటెడ్‌ పదవులు , ఇతర పదవులకు కూడా పోటీ మొదలైంది. అయితే ఒక్కరే రంగంలో ఉన్నచోట ఎలాంటి సమస్య లేదు. కానీ కొన్ని చోట్ల ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండటం అధికార పార్టీలో సమస్యగా కనిపిస్తుంది. వీరిని బుజ్జగించి దారికి తీసుకురావడం అనేది పార్టీకి సమస్యగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కొంతమంది పేరు ఉన్న నాయకులు ఇతర పార్టీల నుంచి బయటకు వచ్చి అధికార పార్టీలో నుంచి మద్దతు పొందేందుకు చూస్తున్నారు. దీనితో ఇప్పటిదాకా పార్టీకి సేవలు అందించిన నాయకులు భయపడుతున్నారు. ఎన్నికల కల్లా పోటీదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరి అధికార పార్టీ దీనిని ఎలా తట్టుకుంటుందో, రంగంలోకి ఎవరిని దించుతుందో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
  • తగ్గేదేలే..
    దీనితో పాటు సహజంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో కూడా పోటీ లేకపోలేదు. ఆ పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఇప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ నాయకులు కూడా ఎలాగైనా అత్యధిక సర్పంచ్‌ స్థానాలను దక్కించుకొని తమ ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో సర్పంచ్‌ స్థానాలను అత్యధికంగా ఆ పార్టీయే నిలబెట్టుకుంది. ఈ విడత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని కసితో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ప్రత్యర్థుల ద్వారా కాంగ్రెస్‌ కు గట్టి పోటీ అయితే తప్పదు. ఇలాంటి సమయంలోనే గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలా, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలా అన్న సవాలు అధికార పార్టీకి తప్పదు. మరి దీనిని అధికార పార్టీ ఎలా ఎదుర్కొంటుందో, అత్యధిక స్థానాలలో ఇలా జెండా పాతుతుందో అన్నది చూడాలి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ల వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్న ప్రధాన చర్చ.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు