Sunday, September 8, 2024
spot_img

యుద్ధాల్ని నిలువరించడంలో ఐరాస పాత్ర నామమాత్రమేనా ?

తప్పక చదవండి
  • ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధానికి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా..

రెండవ ప్రపంచయుద్ధం (1939 – 45) నేర్పిన గుణపాఠాలను పునాదులుగా చేసుకొని 26 జూన్‌ 1945 రోజున 51 దేశాల నిర్ణయం ఫలితంగా విశ్వశాంతిని కోరుతూ 24 అక్టోబర్‌ 1945 రోజున ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్థాపించడం అనివార్యంగా జరిగిపోయింది. ‘యునైటెడ్‌ నేషన్స్ (యూయన్‌)’ అనే పదాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్ రూపొందించారు. అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఐరాసలో నేడు 193 (రెండు పరిశీలన దేశాలుగా ఉండగా) దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. స్వతంత్ర దేశాలుగా గుర్తింపు పొందని నార్థ్ సైప్రస్‌, సొమాలిల్యాండ్‌, అబ్కాజియా లాంటి రాజ్యాలకు ఐరాస సభ్యత్వం ఇవ్వలేదు. వాటికన్‌ సిటీ, పాలస్తీనాలు సభ్యత్వాన్ని పొందలేదు.

ప్లాటినమ్‌ జుబ్లీ మైలురాయి దాటిన ఐరాస:
గత 77 సంవత్సరాలుగా ప్రపంచదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ, పలు వివాదాల పరిష్కారానికి నిర్విరామం కృషి చేస్తూ, మానవాళికి కరోనా మహమ్మారి లాంటి ప్రకృతి విపత్తు జరిగినపుడు ప్రజలను చైతన్య పరిచే ఐక్యరాజ్యసమితి ’ప్లాటినమ్‌ జుబ్లీ వేడుకలు’ చేసుకునే స్థాయికి ఎదగడం విశ్వ జనావళికి సంతోషదాయకం. అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందిస్తూ, ప్రపంచ దేశాలకు తగు పరిష్కారాలను సూచిస్తూ, ప్రపంచశాంతి స్థాపన యజ్ఞంలో తన వంతు బాధ్యతలను నిర్వహిస్తున్న ఐరాస సేవలు ప్రశంసనీయమని కొనియాడబడుతున్నది.

- Advertisement -

ఐరాస భద్రతా మండలి పెద్దరికం:
అంతర్జాతీయ శాంతి స్థాపనలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న యుయన్ఓ భద్రతా మండలి‌ (సెక్యూరిటీ కౌన్సిల్‌)లో ఐదు అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, యుకె, ఫ్రాన్స్, చైనాలు శాశ్వత సభ్యులుగా “వీటో పవర్”‌ను కలిగి ఉండడం ఐరాస బలం, బలహీనత కూడా అవుతున్నది. భద్రతా మండలిలో మరో 10 దేశాలకు 2 సంవత్సరాల వ్యవధితో తాత్కాలిక వీటో లేని సభ్యత్వాన్ని కల్పిస్తారు. మిగిలిన 188 ఐరాస సభ్య దేశాల అభిప్రాయాలకు ప్రాధాన్యం లేదు, వారి అభిమతానికి విలువ ఉండడం లేదు. ప్రస్తుత‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ముఖ్య పరిపాలనాధికారిగా (సిఏఓ) సేవలందిస్తున్న ఐరాస సంస్థ నిర్థేశిత నియమాలను తీవ్రంగా ఉల్లంఘించిన దేశాలను “భద్రతా మండలి సిఫార్సు”తో జనరల్‌ అసెంబ్లీ ఆయా దేశాల సభ్యత్వాన్ని రద్దు కూడా చేయవచ్చు. ఐరాస ప్రధాన విధుల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతల స్థాపన, దేశాల మధ్య స్నేహబంధాలను నెలకొల్పడం జరుగుతున్నది. దేశాల మధ్య నెలకొన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మానవీయ సమస్యకు పరిష్కారాలు చూపుతూ, మానవహక్కులను కాపాడుతూ మౌళిక స్వేచ్ఛను కల్పించడం జరుతున్నది. విశ్వమహమ్మారి విజృంభన వేళ ప్రజలను జాగృత పరచడం, పర్యావరణ కాలుష్య నియంత్రణ, భూగోళాన్ని పరిరక్షించడం లాంటి అతి ముఖ్యమైన అంశాలలో ప్రపంచ దేశాలను చైతన్య పరచడం జరుగుతున్నది. దేశాల మధ్య సమానత్వం, నమ్మకాలను గౌరవించడం, దేశ అంతర్గత సమస్యలకు దూరంగా ఉండడం, సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం లాంటి సూత్రాల ఆధారంగా ఐరాస పని చేస్తున్నది.

యూయన్‌ అలంకారప్రాయ సంస్థగా మిగులుతోందా ?
ఆవిర్భావం నుంచి నేటి వరకు ఐరాస నిర్వహించిన పాత్ర ప్రశంసనీయంగా ఉంటూనే కొన్ని సందర్భాలలో నిరాశనే మిగిల్చిందని చరిత్ర చెబుతోంది. అనేక ఆటంకాలు, సవాళ్ల నడుమ తన ఉనికిని చాటుకుంటూ, ప్రపంచదేశాలలో శాంతి స్థాపన దిశగా అడుగులు వేస్తున్నది. ఐరాస చరిత్రలో ఎన్ని మైలురాళ్ళు దాటినా, కొన్ని విషమ పరిస్థితులలో తగు న్యాయం చేయలేక పోయిందనే విమర్శలను మూటకట్టుకుంది. అమెరికా ఇరాక్ దేశా‌ల మధ్య వివాదం, సూడాన్‌లో అమాయక ప్రజల మరణాలను అరికట్టుటలో ఐరాస విఫలమైందని తెలుస్తున్నది. 24 ఫిబ్రవరి 2022న ప్రారంభమై గత 19 మాసాలుగా కొనసాగుతూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న భీకర ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని నిలువరించడంలో ఐరాస తీసుకున్న చొరవ నామ మాత్రమే అని విధితమవుతున్నది. 07 అక్టోబర్‌ 2023న ఇజ్రాయిల్ ఆవాసాలపై హనాస్‌ భీకర‌ ఆకస్మిక దాడులతో మొదలైన యుద్ధంలో ఇజ్రాయిల్ పక్షాన కనీసం 1,400 ప్రాణాలు (240 ఇజ్రాయిలీలను బంధించి హమాస్‌ తమ అదీనంలోకి తీసుకోవడం), గాజా నగరంపై ఇజ్రాయిల్‌ దాడుల్లో గత నెల రోజులుగా దాదాపు 9,700 (అందులో 4,800 మంది పిల్లలు) వరకు మరణాలు నమోదు అయ్యాయి. ఇజ్రాయిల్‌, హమాస్‌ పోరాటంలో గత నెల రోజులుగా గాయపడిన ప్రజల సంఖ్య 50 వేలు దాటి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు:
సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తరువాత నెలకొన్న యూఎస్‌ ఆదిపత్యం దాదాపు 15 ఏండ్లపాటు కొనసాగడం చూసాం. 2008 తరువాత అఫ్ఘానిస్థాన్‌, ఇరాన్‌ విషయాల్లో అమెరికా ఆదిపత్య చర్యలు చైనాకు నచ్చక పోవడంతో భద్రతా మండలి దేశాల మధ్య విభేదాలు బయట పడడం చూసాం. చైనా క్రమంగా బలపడడంతో యూఎస్ ఆదిపత్యం తగ్గుతూ ‌రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొని నేడు జరుగుతున్న రెండు యుద్ధాల పరిష్కారంలో ఇరుపక్షాలు ఉత్తర దక్షిణ ధృవాలుగా దూరం జరగడం పెద్ద సమస్యగా నిలుస్తున్నది. ఈ పోరాటాన్ని శాంతింపజేయడం, కాల్పుల విరమణ అంగీకారానికి ఇరు దేశాలను ఒప్పించడంలో ఐరాస పెద్దన్న పాత్రను పోషించడంలో విఫలం అయినట్లు కనిపిస్తున్నది.‌ అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఐరాస లక్ష్యాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నేడు భద్రతా మండలిలో ఏకాభిప్రాయం రావడం అసాధ్యంగా తోస్తున్నది. ముఖ్యంగా దేశాల మధ్య సంఘర్షణలు తారస్థాయికి చేరినపుడు భద్రతా మండలి తీర్మానం లేకుండా ఏకాభిప్రాయానికి రావడం జరగదని మనకు తెలుసు.
అగ్రరాజ్యాల ఆదిపత్య ధోరణిలతో ఐరాస కార్యదక్షత అయోమయంలో పడుతున్నదని, ప్రపంచ శాంతి స్థాపనకు ఐరాస చేస్తున్న ప్రయత్నాలు దాదాపు శూన్యమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయుధాలతో అగ్రరాజ్య స్థాయి సాధ్యపడదని, విశ్వమానవాళికి సుఖ సంతోషాలు పంచగలగడమే పెద్దరికం అవుతుందని భద్రతా మండలి దేశాలు గుర్తించాలి. ప్రపంచశాంతి స్థాపనలో ఐరాస పెద్దన్నలా నిలబడి, దేశాల మధ్య విభేదాలను చెరిపి, అవసరమైతే కొరడా జులిపి, సహకార భావనను పెంచి, ప్రపంచ కుగ్రామాన్ని సుందర ఆవాస ప్రదేశంగా నిర్మించాలని ఆశిద్దాం. భద్రతా మండలిని విస్తరిస్తూ, ఐరాసను గౌరవిద్దాం, ప్రపంచ శాంతికి పునాదులు వేద్దాం.

  • డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
    కరీంనగర్‌ – 9949700037
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు