Sunday, September 8, 2024
spot_img

కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి..

తప్పక చదవండి
  • 13 మందితో కేంద్ర సమన్వయ కమిటీ ఏర్పాటు..
  • లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చెయ్యాలని నిర్ణయం..
  • బీజేపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్న ఖర్గే..
  • ”ఒక దేశం..ఒకేసారి ఎన్నికల” పై మండిపడ్డ కూటమి..
  • కపిల్ సిబాల్ ఎంట్రీతో ఖంగుతిన్న నేతలు..
  • ఇస్రోను అభినందిస్తూ తీర్మానం చేసిన సమావేశం..

ముంబై : ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన-యూబీటీ నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ ఖాన్, జేడీయూ నేత లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, సీపీఐ నేత డీ రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీకి కన్వీనర్‌ను ప్రకటించలేదు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు. సీట్ల పంపకాలను ఇచ్చి, పుచ్చుకునే పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా, ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

‘జుడేగా భారత్, జీతేగా ఇండియా’ నినాదంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. భాగస్వామ్య పార్టీల కమ్యూనికేషన్స్, మీడియా స్ట్రాటజీలను సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రచార కార్యక్రమాలను స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబరు 2నాటికి మేనిఫెస్టోను సిద్ధం చేయాలని టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ ఈ సమావేశంలో కోరారు. అయితే ఈ కూటమి లోగో, అధికార ప్రతినిధుల నియామకాలు జరగవలసి ఉంది.

- Advertisement -

పాట్నా, బెంగళురులో జరిగిన రెండు సమావేశాలు విజయవంతం కావడం, ఇండియా కూటమి రోజురోజూకూ బలపడుతుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వణుకు పట్టుకుందని, రాబోయే రోజుల్లో విపక్ష నేతలపై ఏజెన్సీలతో మరిన్ని దాడులు జరిపించే అవకాశం ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ముంబై లో జరుగుతున్న ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తొలి రెండు సమావేశాల విజయంతో ప్రధాన మంత్రి తన ప్రసంగాల్లో ”ఇండియా” కూటమిపై దాడి చేయడమే కాకుండా, మన దేశాన్ని కూడా ఉగ్రవాద సంస్థగా, బానిసత్వానికి ప్రతీకగా పోల్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. “ప్రభుత్వ ప్రతీకార రాజకీయల కారణంగా రాబోయే రోజుల్లో మనం (విపక్షాలు) మరిన్ని దాడులు, అరెస్టులను ఎదుర్కోవలసి రావచ్చు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి” అని ఖర్గే సూచించారు.

”మన కూటమి ఎంతగా బలపడితే అంతగా బీజేపే ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేయవచ్చు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్‌లో జరిగిందిదే. నిజానికి, గతవారంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి దాడులు జరిగాయి. బీజేపీ అవకతవకల పాలనతో ఇవాళ సమాజంలో అన్ని వర్గాలు, ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు, అట్టడుగు వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, మేథావులు, ఎన్జీవోలు, చివరకు జర్నలిస్టులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. తమ కష్టాల నుంచి ఉపశమనం కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు మన (కూటమి) వైపు ఆశగా చూస్తు్న్నారు” అని ఖర్గే అన్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ గత తొమ్మిదేళ్లుగా మతపరమైన విషం జిమ్ముతున్నాయని, ఇప్పుడు అమాయకులైన రైలు ప్రయాణికులు, స్కూలు పిల్లలపై కూడా విద్వేష నేరాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అత్యంత ఘోరంగా అత్యాచారాలు చేసిన వారిని విడుదల చేసి వారికి సన్మానాలు చేస్తున్న ఘటనలను చూస్తున్నామని, ఘోరమైన నేరాలను ప్రోత్సహిస్తూ, మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని తప్పుపట్టారు. ‘మోదీజీ ఇండియా’లో కార్గిల్ అమర సైనికుడి భార్యలను కూడా ఖాతరు చేయడం లేదన్నారు. పేద గిరిజనలు, దళితులపై తమ నేతలు మూత్ర విసర్జన చేసినా బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత చూపుతోందని, దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని ఘాటుగా విమర్శించారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కూడా వారికి దక్కనీయడం లేదన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎంజీఎన్‌ఆర్ఈజీఏ బకాయిలు చెల్లించడం లేదని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు చేసిన ప్రత్యేక గ్రాంటులు, రాష్ట్ర స్పెసిఫిక్ గ్రాంటులు రకిలీజ్ చేయం లేదని, విపక్ష పాలిత రాష్ట్రాల్లోని పెట్టుబడులు, ప్రాజెక్టులను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏజేన్సీలు, సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం కోరుకుంటోందని, ఈడీ చీఫ్, సీబీఐ డెరెక్టర్, ఎన్నికల కమిషనర్లు, చివరకు దేశంలోని కోర్టుల్లో జడ్జిల నియామకాలను సైతం తమ అధీనంలో పెట్టుకునేందుకు పట్టుబడుతోందని ఖర్గే విమర్శించారు. పార్లమెంటు లోపల, వెలుపల కూడా విపక్ష ఫ్రంట్ బలం పెరుగుతుండటంతో స్వల్ప కారణాలపై ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేస్తూ కీలక బిల్లులకు కేంద్రం ఆమోదముద్ర వేయించుకుంటోందన్నారు. విపక్ష ఎంపీలపై హక్కుల తీర్మానాలు పెడుతూ, మైక్‌లు కట్ చేస్తూ, నిరసనలు కవర్ చేసేందుకు కెమెరాలను అనుమతించకుండా, సంసద్ టీవీలో విపక్ష ఎంపీల ప్రసంగాలను సెన్సార్ చేస్తోందని వరుస విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలో తమకు ఆశ, శ్వాస అని, చంద్రయాన్ విజయం శాస్త్రవేత్తల విజయమని, నీరజ్ చోప్రా, చెస్ విజార్డ్ ప్రగ్గనానంద వంటి వారు దేశానికి గర్వకారణని ఖర్గే అన్నారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న వీరందరినీ తాను అభినందిస్తున్నట్టు చెప్పారు. ”ఒక దేశం..ఒకేసారి ఎన్నికల”కు కేంద్రం పావులు కదుపుతుండడంపై ఖర్గే విమర్శలు గుప్పించారు. కేంద్రం ఎంతోకాలం ప్రజలను మోసం చేయలేదని, వారి నిరంకుశ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు.

లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యలు సమాఖ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తాయని దుయ్యబట్టింది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఏకపక్ష నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారని నిలదీసింది. కాంగ్రెస్, జేడీయూ, ఎన్‌సీపీ-శరద్ పవార్ వర్గం, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, టీఎంసీ, సహా 28 ప్రతిపక్ష పార్టీల నేతలు ముంబైలో గురు, శుక్రవారాల్లో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ ఇండియా కూటమి నేతల సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనడంపై చర్చించారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై నేతలు చర్చించారు. సమన్వయ కమిటీ, ఉప సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక దేశం-ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఆలోచనపై ఈ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల దేశంలోని సమాఖ్య నిర్మాణం దెబ్బతింటుందని ఆరోపించారు. సీపీఐ నేత డీ రాజా మాట్లాడుతూ, భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అంటూ ఉంటారని, ఇతర రాజకీయ పార్టీలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు.

చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థను అభినందిస్తూ ఈ కూటమి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇస్రో సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని, ఆ సంస్థలో పని చేసిన, చేస్తున్నవారందరికీ అభినందనలని తెలిపింది. ఇస్రో శక్తి, సామర్థ్యాలను నిర్మించి, విస్తరించి, పటిష్టం చేయడానికి ఆరు దశాబ్దాలు పట్టిందని పేర్కొంది. చంద్రయాన్-3 ప్రపంచాన్ని అబ్బురపరచిందని తెలిపింది. ఆదిత్య ఎల్-1 ప్రయోగం కోసం ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తోందని, ఇస్రో సాధిస్తున్న అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని బలోపేతం చేస్తాయని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువతకు ప్రేరణగా నిలుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇండియా కూటమి లోగో గురించి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఇది చాలా ముఖ్యమైనదని, దీని గురించి సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిని శుక్రవారం విడుదల చేయడం లేదన్నారు.

సమన్వయ కమిటీలో భాగస్వాములయ్యేందుకు ప్రతి పార్టీ ఒక నేత పేరును సూచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ మాట్లాడుతూ, అక్టోబరు 2నాటికి మేనిఫెస్టోను సిద్ధం చేయాలని కోరారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, వచ్చే నెలాఖరునాటికి లోక్ సభ స్థానాల పంపకాలు పూర్తి కావాలన్నారు.

ఈ సమావేశాల్లో పాల్గొన్నవారలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ; ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా; పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత సీతారామ్ ఏచూరి, సీపీఐ నేత డీ రాజా, సీపీఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉన్నారు.

కాంగ్రెస్ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ముంబైలో జరుగుతున్న విపక్ష ఇండియా కూటమి సమావేశంలో శుక్రవారం హాజరుకావడంతో ఒకింత హైడ్రామా నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎంట్రీ ఇవ్వడంతో పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. కొద్దికాలం క్రితం కాంగ్రెస్‌ పార్టీకి ఉద్వాసన పలికి, సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇండియా కూటమి సమావేశానికి ఆయనకు అధికారికంగా ఆహ్వానం లేకపోయినప్పటికీ ఆయన విచ్చేశారు. విపక్ష నేతలంతా కలిసి ఫోటో తీయించుకోవడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు