Sunday, September 8, 2024
spot_img

చెక్‌ పోస్టులో రూ.17 లక్షల విలువైన గంజాయి పట్టివేత

తప్పక చదవండి

వైరా : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 17 లక్షల రూపాయల విలువైన గంజాయిని శుక్రవారం వైరా పోలీసులు పట్టుకున్నారు.కారులో అక్రమంగా తరలిస్తున్న 87 కేజీల గంజాయి తో పాటు ఈ గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైరా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అయిన వైరా మండలంలోని గన్నవరం క్రాస్‌ రోడ్‌ లో పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్ట్‌ లో శుక్రవారం వైరా ఎస్సై మేడా ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెమలి గ్రామం నుంచి వైరా వైపు వస్తున్న షిఫ్టు డిజైర్‌ కారు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది.దీంతో ఆ కారును పోలీసులు చెక్‌ పోస్ట్‌ వద్ద ఆపి తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో కారు డిక్కీలో సుమారు 87 కేజీల గంజాయి పట్టుబడిరది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. సీలేరు నుంచి వయా తిరువూరు నెమలి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా సరఫరా చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. గంజాయి పట్టుబడిన కారు తో పాటు మరో కారులో కూడా సుమారు 25 కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. ముందుగా ఒక కారు పోలీసులకు పట్టు పడటంతో వెనక వస్తున్న మరో కారులోని నిందితులు పోలీసులకు చిక్కకుండా రూటు మార్చి హరారయ్యారు. సూర్యాపేట జిల్లా లాల్‌ సింగ్‌ తండాకు చెందిన ఆంగోతు నాగరాజు, ధరావత్‌ కృష్ణ అక్రమ గంజాయి రవాణాకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను మధిర కోర్టులో రిమాండ్‌ చేసినట్లు వైరా సీఐ నున్నావత్‌ సాగర్‌ తెలిపారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న వైరా ఎస్సై మేడా ప్రసాద్‌ తో పాటు పోలీస్‌ సిబ్బందిని, చెక్‌ పోస్ట్‌ సిబ్బందిని వైరా ఏసీపీ రెహమాన్‌, సీఐ నున్నావత్‌ సాగర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు