Sunday, September 8, 2024
spot_img

ఉచితంగా గ్యాస్ సిలిండర్..

తప్పక చదవండి
  • దీపావళికి అందించనున్నట్లు వెల్లడి
  • ఇటీవల సిలిండర్ ధరను రూ.300 తగ్గించిన కేంద్రం..

న్యూ ఢిల్లీ : దేశంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రస్తుతం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు. ఈ క్రమంలోనే ఇటీవలె కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అది కేవలం ఉజ్వల యోజన కింద తీసుకున్న కనెక్షన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వెయ్యి రూపాయలు దాటిన వంట గ్యాస్ కాస్త తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. తాజాగా దీపావళి సందర్భంగా గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఉజ్వల యోజన కింద గ్యాస్‌ కనెక్షన్ ఉన్నవారందరికీ ఈ దీపావళి కానుక కింద ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఫ్రీగా అందిస్తామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. తాజాగా బులంద్‌షహర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం యోగి శంకుస్థాపన చేశారు. అయితే దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగి రూ. 1000 దాటిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా దగ్గర పడటంతో ఇటీవల కేంద్రం భారీ ఊరటను కల్పించింది. దేశ వ్యాప్తంగా ఉజ్వల యోజన కింద గ్యాస్‌ కనెక్షన్లు పొందిన వారిందరికీ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.300 మేర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్లాది మంది ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వారికి పెరిగిన ధరల నుంచి భారీ ఉపశమనం కలిగినట్లయింది.

ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ సర్కార్ ఒక అడుగు ముందుకేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవడం చాలా కష్టమైన పని అని.. కానీ నరేంద్ర మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.75 కోట్ల మంది లబ్ధి పొందారని యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ గ్యాస్ సిలిండర్ ధర ప్రచార అస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఇప్పటికే గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల మేనిఫేస్టోలో కూడా ఇదే అంశాన్ని చేర్చింది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తాము మరోసారి అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.400 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు