Sunday, September 8, 2024
spot_img

తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పొంగులేటి

తప్పక చదవండి
  • తుమ్మలకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని వ్యాఖ్య
  • వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ పద్ధతి ఉందని విమర్శ

హైదరాబాద్ : సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఆయన ఇంటికి పొంగులేటి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ… తుమ్మలకు అపార రాజకీయ అనుభవం ఉందని అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్న చిత్తశుద్ధితో పని చేస్తారని కొనియాడారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు బీఆర్ఎస్ తీరు ఉందని పొంగులేటి మండిపడ్డారు. అనేక అవమనాలకు గురిచేసి తుమ్మలను బయటకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ముందు తనను సాగనంపారని… ఇప్పుడు తుమ్మలను బయటకు పంపేందుకే అవమానిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొమ్మనలేక పొగ పెడుతుందని.. తుమ్మల కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయన్నారు. జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు.. పొంగులేటి తన చిరకాల మిత్రుడని అన్నారు. జిల్లాను అభివృద్ది చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని చెప్పారు. ప్రజలు, తన అభిమానులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అయితే వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. నాలుగేళ్లు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా.. పొంగులేటి, తుమ్మల ఏనాడు మాట్లాడుకోలేదు. అలాంటి ఇప్పుడు ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకొని కొనియాడుకోవటం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

- Advertisement -

ఇక పాలేరు బీఆర్ఎస్ సీటు ఆశించిన తుమ్మల నాగేశ్వరరావుకు భంగపాటు ఎదురైంది. ఇటీవల సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. తన అభిమానులతో మాట్లాడిన ఆయన తాను కచ్చితంగా పోటీలో ఉంటానన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మలతో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పార్టీ మార్పు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు