Sunday, September 8, 2024
spot_img

విజయవంతంగా మరో కీలక ఆపరేషన్..

తప్పక చదవండి
  • చంద్రయాన్ – 3 సాధించిన ఘనత..
  • చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైన స్పేస్ క్రాఫ్ట్..
  • తదుపరి ఆపరేషన్ 14 న 11-30 గం. నుంచి 12-30 గం. మధ్య..
  • ‘చంద్రుడి దక్షణ ధృవంపై ల్యాండింగ్’ ఘట్టం ఆగస్టు 23న సాయంత్రం 5:47 గం.లకు..
  • వివరాలు వెల్లడించిన ఇస్రో శాస్త్రవేత్తలు..

న్యూ ఢిల్లీ : చంద్రయాన్-3 మిషన్‌ అత్యంత కీలకమైన మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. మరోమారు స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కి.మీ బై 1437కి.మీ.లకు తగ్గించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం ప్రకటించింది. మూడోసారి చేసిన ఈ ఆపరేషన్‌తో చంద్రుడి ఉపరితలానికి స్పేస్‌క్రాఫ్ట్ మరింత చేరువైందని వెల్లడించింది. చంద్రుడి కక్ష్యకు సమీపాన ఇంధనాన్ని మండించడం ద్వారా తాజా ఆపరేషన్‌ను పూర్తి చేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇస్రోలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ ఈ విన్యాసానాన్ని విజయవంతంగా పూర్తిచేసిందని వివరించారు. ఫలితంగా స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య తగ్గిందని తెలిపారు. ఇక తదుపరి ఆపరేషన్‌ను ఆగస్టు 14, 2023న భారత కాలమానం ప్రకారం.. 11:30 నుంచి 12:30 మధ్య నిర్వహించనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ఆపరేషన్‌లో స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువవుతుందని వెల్లడించారు.
చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి శాస్త్రవేత్తలు వరుసగా నిర్వహిస్తున్న ఆపరేషన్లు విజయవంతమవుతున్నాయి. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి ముందు పలు ఆపరేషన్లను విజయంగా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాక కూడా క్రమంగా కక్ష్యను తగ్గించుకుంటూ జాబిల్లిని సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అందరి కళ్ళూ ఆగస్టు 23నే ఉన్నాయి. ఎందుకంటే మిషన్ అంతిమ లక్ష్యమైన ‘చంద్రుడి దక్షణ ధృవంపై ల్యాండింగ్’ ఘట్టం ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు జరగనుంది. ఈ ఘట్టం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలుస్తుంది. అంతకుముందు అమెరికా, పూర్వ సోవియెట్ యూనియన్, చైనా ఈ జాబితాలో ఉన్నాయి. ఇస్రో సాధించబోయే ఈ మైలురాయి అంతరిక్ష అన్వేషణల్లో భారత్ ఎదుగుదలను చాటిచెప్పడమే కాకుండా చంద్రుడిని మరింతగా అవగతం చేసుకోవడానికి ఆస్కారముంటుందనే అంచనాలున్నాయి. కాగా చంద్రయాన్-3 మిషన్‌ను జులై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగించారు. చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్ లక్ష్యం దిశగా ఈ మిషన్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ మిషన్‌లో అత్యంత కీలకమైన చంద్రుడి కక్ష్యలోకి ఆగస్టు 5న ప్రవేశించిన విషయాలు తెలిసినవే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు