Sunday, September 8, 2024
spot_img

శవాల దిబ్బగా అఫ్గాన్‌ ప్రావిన్స్‌

తప్పక చదవండి
  • భూకంపం ధాటితో కుప్పకూలిన ఇళ్లు
  • చురుకుగా సహాయక చర్యలు

కాబూల్‌ : అఫ్ఘాన్‌ భూకంపం ధాటికి అతలాకుతలం అయ్యింది. ఎటు చూసినా కూలిపోయి మట్టిదిబ్బలుగా మారిన ఇళ్లు.. ఆనవాళ్లు లేకుండాపోయిన గ్రామాలు.. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. విగతజీవులైన ఆత్మీయులను చూసి మిన్నంటుతున్న రోదనలు.. రాత్రంతా వారి మృతదేహాల వద్దే జాగారం.. కట్టుబట్టలు తప్ప ఏం మిగలని దైన్యం.. ఇంకా జాడ తెలియని ఎన్నో కుటుంబాలు.. ఇవీ వరుస భారీ భూకంపాలతో కకావికలమైన అఫ్ఘానిస్థాన్‌లో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలు. మిలిటరీతోపాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన బృందాలు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. 7బృందాలను పంపామని, ఇతర ప్రావిన్సుల నుంచి కూడా మరికొన్ని బృందాలు వస్తున్నాయని అప్ఘాన్‌ రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ ప్రతినిధి తెలిపారు. వైద్యులు హెరాత్‌ ప్రాంతీయ ఆస్పత్రి వద్ద 5 శిబిరాలు ఏర్పాటు చేసి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి వలస విభాగం వైద్యులు, అంబులెన్సులను పంపింది. భూకంపం ప్రభావిత ప్రాంతాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని పాకిస్థాన్‌ తెలిపింది. క్రికెట్‌ ప్రపంచ కప్‌లో తనకు వచ్చే ఫీజు మొత్తం భూకంప బాధితులకు విరాళంగా ఇస్తానని అఫ్ఘాన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ప్రకటించారు. పశ్చిమ అఫ్ఘాన్‌లోని హెరాత్‌ ప్రావిన్సులో శనివారం మధ్యాహ్నం సంభవించిన వరుస భూప్రకంపనల్లో మరణించిన వారి సంఖ్య 2 వేలు దాటింది. 2,060 మంది మరణించారని, 9,240 మంది గాయపడ్డారని, పలు గ్రామాలు, వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా తర్వాత మరో 8 శక్తిమంతమైన ప్రకంపనలు కుదిపేశాయి. శనివారం రాత్రి వరకు 300 మందికి పైగా మరణించినట్టు గుర్తించారు. కొందరు రాత్రంతా అయినవాళ్ల మృతదేహాల వద్ద రోదిస్తూ ఉండిపోగా.. మరికొందరు కుటుంబ సభ్యుల జాడ తెలియక చీకట్లో శిథిలాల మధ్య గడిపారు. తెల్లారి వెలుగొచ్చాక అతికష్టంవిూద శిథిలాలు తొలగించి.. మిగతావారి మృతదేహాలను వెలికితీశారు. కొందరు మృత్యుముఖం నుంచి బయటపడ్డారు. కూలిన భవన శిథిలాల కింద చిక్కుకుపోయి తల మాత్రమే బయటకి కనిపిస్తున్న ఓ బాలికను స్థానికులు కాపాడిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది.గతేడాది జూన్‌లో తూర్పు అఫ్ఘానిస్థాన్‌ పక్తికా ప్రావిన్సులో 5.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 1,000 మంది చనిపోయారు. ఇప్పుడు దానికి రెట్టింపు సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు