Saturday, April 27, 2024

ప్రశాంతంగా ముగిసిన జిహెచ్ఎంసి 7వ సాధారణ సమావేశం

తప్పక చదవండి

హైదరాబాద్ : జిహెచ్ఎంసి 7వ సాధారణ సమావేశం బుధవారం నాడు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రశాంతంగా జరిగినది. ముందుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ… ఈ కౌన్సిల్ సమావేశం అర్థవంతమైన చర్చలు, అధికారులు సమాధానం ఇచ్చే విధంగా సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేయర్ కోరారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించకుండా ప్రజల సమస్యల పట్ల కౌన్సిల్ దృష్టికి తేవాలని కోరారు. గౌరవ సభ్యులు తమ అమూల్యమైన సమయాన్ని ప్రజల కోసం వినియోగించుకోవాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అమలు చేస్తున్న పథకాలు గడపగడపకు చేరుతున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా గొప్ప పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆదర్శంగా నిలిచిందని తెలియజేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో నగరంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేస్తున్నారని మేయర్ తెలిపారు.

- Advertisement -

ఈ సమావేశంలో లింక్, మిస్సింగ్ రోడ్లపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్లు శానిటేషన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. దాంతో మేయర్ పార్టీ కి ఒకరి చొప్పున ఈ విషయం పై మాట్లాడాలని సభ్యులను కోరారు. బి.జె.పి కార్పొరేటర్ వంగ మధుసూధన్ రెడ్డి, టీ.ఆర్.ఎస్ నుండి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎం.ఐ.ఎం నుండి సలీం బేగ్ మాట్లాడారు. శానిటేషన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అన్ని పార్టీలు సమర్థించాయి. మానవతా దృక్పథంతో శానిటేషన్ వర్కర్ల పర్మినెంట్ గురించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయం పై కమిషనర్ మాట్లాడాలని మేయర్ కోరగా ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… సమావేశంలో చర్చించిన విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని కమిషనర్ వివరించారు.

మొట్టమొదటగా సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ తెలంగాణ ఏర్పడ్డాక ఎన్ని స్లిప్, మిస్సింగ్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రశ్నించగా దీనికి ప్రాజెక్ట్ సి.ఇ దేవానంద్ సమాధానం ఇస్తూ… మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ మొదటి దశలో రూ. 275.53 కోట్ల వ్యయంతో 22 పనులు చేపట్టగా 24.301 కిలోమీటర్ల పొడవు రోడ్లు పూర్తి చేయడం జరిగింది. రెండవ దశలో రూ. 216.79 కోట్ల వ్యయంతో 20.57 కిలోమీటర్ల పొడవు చేపట్టుటకు 13 పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయని తెలిపారు. మూడవ దశలో రూ. 2410 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతి లభించిందని, అందులో 1500 కోట్లతో 50 ప్రాధాన్యత రోడ్లను ప్రభుత్వం చేపట్టుటకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా 48 పనులలో 36 పనులు పూర్తయ్యాయని, ఇంకా 12 పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మిగతా పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఇ.ఎన్.సి జియా ఉద్దీన్ మాట్లాడుతూ… సి.ఆర్.ఎం.పి ద్వారా 812 కిలోమీటర్ల పొడవు గల రోడ్డును 7 ప్యాకేజీలుగా చేపట్టడం జరిగిందని, అందులో 777.77 కిలోమీటర్ల రోడ్డును రీ కార్పెటింగ్ చేయడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా 103 కిలోమీటర్ల పొడవు ఫుట్ పాత్ నిర్మించడం జరిగిందని తెలిపారు.

రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి ఎస్.ఎన్.డి.పి పనుల పరిస్థితి, వర్షాకాలంలో ఎదురుకున్న సమస్యలను వివరించాలని కోరగా ఇ.ఎన్.సి జియా ఉద్దీన్ సమాధానం ఇస్తూ… నగరంలో వరదల నష్టాన్ని నివారించేందుకు ఎస్.ఎన్.డి.పి కార్యక్రమాన్ని 985 కోట్ల వ్యయంతో జిహెచ్ఎంసి దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీలలో 57 పనులను చేపట్టడం జరిగిందని, జిహెచ్ఎంసి పరిధిలో రూ. 734 కోట్లతో 35 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 25 పనులు పూర్తయ్యాయని, 5 పనులు త్వరలో పూర్తి అవుతాయని, మిగతా పనులు వివిధ సమస్యల వలన పనులు ప్రారంభించడం జాప్యం జరిగిందని తెలిపారు. ఈ వర్షాకాలంలో ఎస్.ఎన్.డి.పి ద్వారా చేపట్టిన పనుల మూలంగా 150 కాలనీలు వరద ముంపు లేకుండా చేయడమే కాకుండా 6,50,000 మంది ప్రయోజనం పొందారని, రెండో దశ ఎస్.ఎన్.డి.పి కార్యక్రమం 2,141 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రహమత్ బేగ్ మాట్లాడుతూ… పాత బస్తీలో ఎస్.ఎన్.డి.పి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, ప్రజలకు ఇబ్బందులు జరుగకుండా వెంటనే పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ విభాగం 2వేల కోట్ల విలువైన పనులు మంజూరు అయ్యాయని, నిధులు లేక అట్టి పనులు ప్రారంభం కాలేదని, ప్రాజెక్టు ద్వారా మంజూరైన పనులు ఎస్.ఎన్.డి.పి ద్వారా నిధులను మంజూరు చేసి పాత బస్తీ వాసులకు వరద నుండి విముక్తి చేయాలని కోరారు.

నాలా విస్తరణ కార్యక్రమంలో ఇల్లు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ విషయం పై వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… మహేశ్వర నియోజకవర్గంలో సీవరేజ్ ని స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ లో కలుపుతున్నారని, ఇలా చేయడం వల్ల భవిష్యత్ లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, చంపాపేట్, గడ్డి అన్నారం, శంకరమ్మ గార్డెన్ వద్ద పై నుండి వచ్చే వరద వలన అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… 3 నుండి 4 మీటర్ల వెడల్పుతో బాక్స్ డ్రైన్ పనులు చేపట్టడం మూలంగా రోడ్డు దెబ్బతిన్నదని, వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.

పత్తర్ గట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీ పాత బస్తీ లోని చార్మినార్ పర్యాటక ప్రాంతంలో సుందరీకరణ, ఆధునిక విద్యుత్ దీపాల ఏర్పాటు పై అడిగిన ప్రశ్నకు కమిషనర్ సమాధానం ఇస్తూ… కులి కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అవి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి క్లాస్-5 కాంట్రాక్టర్లు 50 లక్షల వరకు పరిమితి తో టెండర్ లో పాల్గొనే వారికి కేవలం 5 లక్షల వరకే విధించారని, కొత్త కాంట్రాక్టర్లను ప్రోత్సహించడం అవసరం ఉందని అంటూ వార్డులలో చేపట్టిన పనులు నిధులు ఉన్నప్పటికీ వేగవంతంగా పూర్తి చేయడం లేదని అన్నారు.

డీ-సిల్టింగ్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇ.ఎన్.సి జియా ఉద్దీన్ సమాధానం ఇస్తూ… డి-సిల్టింగ్ పై ఏ రోజుకు ఆ రోజు తెలుసుకొనుటకు యాప్ తయారు చేయడం జరిగిందని, రోజువారిగా చేసిన పనిని అధికారులు ఫోటో సహా పోస్ట్ చేస్తారని, డి-సిల్టింగ్ నిరంతర ప్రక్రియ అని అన్నారు. వర్షాకాలంలో డి-సిల్టింగ్ చేయరని, నీటి ప్రవాహం తగ్గినప్పుడే డి-సిల్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అంతేకుండా డి-సిల్టింగ్ లో వచ్చిన వ్యర్థాలను జవహర్ నగర్ డంప్ యార్డ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు.

స్ట్రీట్ లైట్ పై మేయర్ మాట్లాడుతూ… స్ట్రీట్ లైట్లను మెరుగుపరిచేందుకు కమిషనర్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో అనేక సార్లు ఇ.ఇ.ఎస్.ఎల్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించడం జరిగిందని అన్నారు. కొందరు సభ్యులు పోల్స్ ఇవ్వడానికి ఆరు నెలలు పడుతుందని, ఇవి జిహెచ్ఎంసి లేదా రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేస్తుందా అని అడిగారు. అంతే కాకుండా వీధిలైట్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు ఎవరు చర్యలు తీసుకుంటారో తెలియడం లేదని పలువురు కార్పొరేటర్లు సభా దృష్టికి తీసుకురావడంతో కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… వీధి లైట్లను మెరుగుపరచడంలో పాటు పిన్ పాయింట్ ప్రోగ్రాం ను ఏర్పాటు చేశామని, కార్పొరేటర్ ఆధ్వర్యంలో అధికారులు ఆయా ప్రాంతాలను పర్యటించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటి వరకు 5,31,450 వీధి దీపాలు కలవని, 32,026 సి.ఎం.ఎస్ ఉన్నాయని తెలిపారు. మైక్రో లెవల్ లో ఎగ్జామ్ చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీధి దీపాల రీప్లేస్ మెంట్ కు చర్యలు తీసుకుంటున్నట్లు ఇ.ఇ.ఎస్.ఎల్ సంస్థ పై ఇప్పటి వరకు 6.50 కోట్ల జరిమానా వేయడం జరిగిందని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రోటోకాల్ పై చర్చ జరిగింది. జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కార్పొరేటర్ లను పిలవకుండానే ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవం చేస్తున్నారని, ముఖ్యంగా మెట్రో వాటర్ వర్క్స్ పనులు చేపట్టే సందర్భంగా ఎక్కువగా జరుగుతున్నదని, ఈ విషయం పై మేయర్ మాట్లాడుతూ… వార్డు పరిధిలో చేపట్టే పనులకు కార్పొరేటర్లకు చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని, ఇతర శాఖలకు సంబంధించిన పనుల సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు కార్పొరేటర్ లను పిలిచేందుకు సంబంధిత శాసన సభ్యుల తో స్వయంగా మాట్లాడుతామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… ప్రోటోకాల్ పాటించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో మెట్రో వాటర్ వర్క్స్ ఎం.డి తో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను వర్షాకాలం లోనే కాకుండా ఏడాది పాటు ఈ టీమ్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు కోరగా ఈ విషయంపై కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… 455 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లు, 242 స్టాటిస్టికల్, 157 మొబైల్, 27 డి.ఆర్.ఎఫ్, 28 సి.ఆర్.ఎం.పి బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 2,011 మంది పనిచేస్తున్నారని తెలిపారు. నాన్ మాన్సూన్ సీజన్ లో డి.ఆర్.ఎఫ్, సి.ఆర్.ఎం.ఫి టీమ్ లు పనిచేస్తున్నాయని వివరించారు. ఈ మాన్సూన్ టీమ్ లో వృద్ధులు ఉంటున్నారని, వారు ఏ పనులు చేయలేకపోతున్నారని, మాన్సూన్ టీమ్ లో ఉండాల్సిన లేబర్ రావడం లేదని ఎం.ఐ.ఎం మహిళా కార్పొరేటర్ ఆరోపించారు.

చనిపోయిన శానిటేషన్ వర్కర్ స్థానంలో వెంటనే భర్తీ చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ జోనల్ అధికారులు తగు చర్యలు తీసుకోవడం లేదని ఎం.ఐ.ఎం కార్పొరేటర్ ముస్తఫా బేగ్ ఆరోపించారు. ఈ విషయం పై కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… 60 రోజులకు పైగా విధులకు రానివారు 846 మంది ఉన్నారు. వారి స్థానంలో ఇప్పటి వరకు 278 మందిని నియమించడం జరిగిందని, మిగతా వారిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

గోషామహల్ కార్పొరేటర్ వార్డు ఆఫీస్ ఏర్పాటు కు స్థలం కేటాయించినా ఇప్పటి వరకు ప్రారంభించలేదని ప్రశ్నించడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోక్యం చేసుకొని ప్రారంభం కాని వార్డు ఆఫీస్ లను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని మేయర్ తెలిపారు.

నగరంలో కుక్కల సమస్య ఎక్కవగా ఉన్నదని, పిల్లలు, పెద్దలు భయాందోలనకు గురవతున్నారని మౌలాలి కార్పొరేటర్ సునిత ఆరోపించడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… ఈ విషయం పై ఆల్ పార్టీ సభ్యులతో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేశామని, వారు ఇచ్చిన సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా ఎజెండా నెంబర్ 12 లో పలు అంశాలను ఆమోదం తెలుపుతూ… సభను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వాయిదా వేశారు.

ఈ సమావేశంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, జయరాజ్ కెనడి, విజయలక్ష్మి, చంద్రారెడ్డి, కృష్ణ, ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ సి.ఇ దేవా నంద్, సిసిపి రాజేంద్ర ప్రసాద్ నాయక్, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్ కుమార్, జోనల్ కమిషనర్లు వెంకటేష్ దోత్రె, రవికిరణ్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు