Friday, April 26, 2024

ధరణి మహిమ..

తప్పక చదవండి
  • బిలా దాఖలా భూముల్లో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు..
  • పత్రికల్లో కథనాలు వచ్చిన రెండు రోజులకే ధరణిలోని వెబ్ సైట్ లో
    భూమిని కొన్న వారి పేర్లు మాయం..
  • బిలా దాఖలా భూముల్లో నుంచి 3 ఎకరాల 23 గంటల 5 సెంట్ల భూమి
    రేడియల్ రోడ్డులో పోతుండగా ఆ పరిహారపు డబ్బులు ఎవరికి ఇచ్చారు..?
  • భూమిని సర్వే చేయకముందే రైతుల వద్ద నుంచి కొనుగోళ్ళు..
  • సర్వే చేసి, రైతుల వివరాలతో కూడిన పూర్తి నివేదిక మాత్రం
    ఇదే సంవత్సరం జూన్ 29న రూపొందించారు
  • బిలాదాఖలా భూమిలో 20 ఎకరాలకు పైగానే అక్రమార్కులు కొనుగోలు..
  • మీడియా కథనాలు రావడంతో ప్రస్తుతం ఆగిపోయిన కొనుగోళ్లు..

రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, మోకీల, కొడంగల్ గ్రామాల బిలాదాఖలా భూముల్లో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. రెవెన్యూ అధికారుల అండదండలు, బడా బాబుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బిలాదాఖలా భూములను గురించి ఎప్పుడు కూడా పట్టించుకోని రెవెన్యూ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా సర్వే చేసి రైతుల వివరాలను నమోదు చేశారు. ఏకంగా ఒక ఫైల్ నే తయారుచేసి అది బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. ఈ సంవత్సరం జూన్ 29న సర్వేచేసి బిలాదాఖలా భూమి 117 ఎకరాల 16 గుంటల 75 సెంట్లుగా తేల్చి, అందులో 3 ఎకరాల 23 గుంటల 5 సెంట్ల భూమి రేడియల్ రోడ్డులో పోతున్నట్లుగా నివేదిక తయారు చేశారు. రేడియల్ రోడ్డులో పోను మిగతా 113 ఎకరాల 33 గుంటల 25 సెంట్లు భూమి మిగులుదని తేల్చి సర్వే రిపోర్ట్ ను తయారు చేశారు. ఈ సర్వే రిపోర్ట్ కు ఏ3/1567/2023 గా ఫైల్ నెంబర్ ను సైతం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు తయారుచేసిన సర్వే నివేదికలో కొడంగల్, మోకిలకు చెందిన మొత్తం 97 మంది రైతులు ఆ భూమిలో సాగు చేసుకుంటున్నట్లుగా నివేదిక రూపొందించారు. గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా భూమిని సర్వేచేసి తయారు చేసిన నివేదికను అధికారులు ఎవరికీ చూపించకపోగా.. అడిగినా ఇవ్వడం లేదు. అసలు ఆ భూమిని సర్వే చేసినట్టుగా కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్న రైతులకే తెలియదు. అధికారులు, భూ బకాసురులు కలిసి పకడ్బందీగా రహస్యంగా భూమిని సర్వే చేయించి, నివేదికను తయారుచేసి దాన్ని దాచి పెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా విచిత్రమేమిటంటే భూమిని సర్వే చేయకముందే రైతుల వద్ద నుంచి కొనుగోళ్ళు ప్రారంభమయ్యాయి. క్రయవిక్రయాలు ఈ సంవత్సరం మేలో ప్రారంభం కాగా, భూమిని సర్వే చేసి, రైతుల వివరాలతో కూడిన పూర్తి నివేదిక మాత్రం ఇదే సంవత్సరం జూన్ 29 న రూపొందించారు. నివేదిక తయారు చేయక ముందే బిలా దాఖలా భూమిలో క్రయ విక్రయాలు జరగడం విచిత్రంగా ఉంది. రూ. 20 కోట్లు పలికే భూమిని అప్పనంగా ఎకరాకు 2 కోట్ల 20 లక్షల రూపాయలు రైతులకు ముట్టజెప్పి పట్టా చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. సర్వే నెంబర్ లేని బిలా దాఖలా ప్రభుత్వ భూమి (రైతుల వద్ద లావాని పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి) పట్టా భూమిగా రిజిస్ట్రేషన్ అవుతుండడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ముందుగానే ఈ భూమిపై కన్నేసిన రాబందులు రెవెన్యూ అధికారులతో ఒప్పందం కుదుర్చుకొని క్రయవిక్రయాలు జరిపినట్టు తెలుస్తోంది.. ఓ పక్క భూమిని కొనుక్కుంటూనే సర్వే చేయించి, నివేదిక రూపొందించినట్టు అర్ధం అవుతోంది.. సర్వే నివేదికలో స్థానిక శంకర్ పల్లి తాసిల్దార్ కార్యాలయ అధికారుల సంతకాలతో పాటు ఉన్నతాధికారుల సంతకాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈతంగమంతా పరిశీలిస్తే కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారులు అందరికీ తెలిసే జరిగినట్లుగా అర్థం చేసుకోవచ్చని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. అయితే ఈనెల జూలై 28న బిలా దాఖలా భూముల భూ కుంభకోణం గురించి పత్రికలలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. బిలా దాఖలా భూములు (ప్రభుత్వ భూమి) అక్రమంగా పట్టా అవుతున్న విషయం ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికతో పాటుగా ఇతర పత్రికలు వెలుగులోకి తీసుకురావడంతో, భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటుగా అధికారులు అప్రమత్తమైనట్లు స్పష్టమవుతున్నది. పత్రికల్లో కథనాలు వచ్చిన రెండు రోజులకే ధరణిలోని వెబ్ సైట్ లో భూమిని కొన్న వారి పేర్లు కనిపించకుండా పోయాయి. ఒకవేళ భాజాప్తా కొన్న భూమి అయితే పత్రికల్లో కథనాలు వచ్చిన తదనంతరం ధరణి వెబ్ సైట్ లో పట్టాదారుల పేర్లు ఎందుకు కనిపించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పత్రికల్లో కథనాలు రాకముందు 55 సర్వే నెంబర్ కు బై నెంబర్లు వేసి 35 కొనుగోళ్ళు జరిగినట్లు ధరణిలో స్పష్టంగా కనిపించింది. బిలా దాఖలా భూమిని పెద్ద మొత్తంలో వినాయక డెవలపర్స్ అనేవాళ్లు కొనుగోలు చేశారు. కాగా ప్రస్తుతం ధరణి వెబ్ సైట్ లో వినాయక డెవలపర్స్ తో పాటుగా మిగతా వారి పేర్లు సైతం మాయమయ్యాయి. అయితే ధరణి వెబ్ సైట్ ను ఉన్నతాధికారులు ఇష్టానురీతిగా ఎలా దుర్వినియోగపరుస్తున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. బిలా దాఖలా భూమి (ప్రభుత్వ భూమి) పట్టా భూమిగా రిజిస్టర్ అవుతున్న విషయం, పత్రికల్లో కథనాలు రావడంతో, ధరణి వెబ్ సైట్ లో కొనుగోలు చేసిన వారి పేర్లు అదృశ్యమవడంతో ఉన్నతాధికారుల పాత్ర ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చిన తదనంతరం అయినా రెవెన్యూ అధికారులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ భూముల విషయమై స్పందించలేదు. అయితే కొసమెరుపు ఏమిటంటే ధరణి వెబ్ సైట్ లో కొనుగోలు చేసిన వారి పేర్లు కనిపించకుండా చేశారు.. కానీ, లేటెస్ట్ ఈసీలో వారి పేర్లను దాచిపెట్టలేకపోయారు. ఈసీలో చూడరనుకున్నారేమో లేక ఏమరపాటుతో మర్చిపోయారో తెలియడం లేదు. ఇప్పటివరకు ఈ బిలా దాఖలా భూమిలో 20 ఎకరాలకు పైగానే అక్రమార్కులు కొనుగోలు చేయగా, పత్రికల్లో కథనాలు రావడంతో కొనుగోళ్లు అయితే ప్రస్తుతం ఆగిపోయాయి. మరో విషయం ఏమిటంటే బిలా దాఖలా భూముల్లో నుంచి 3 ఎకరాల 23 గంటల 5 సెంట్ల భూమి రేడియల్ రోడ్డులో పోతుండగా.. ఆ పరిహారపు డబ్బులు ఎవరికి ఇచ్చారు..? అనేది తెలియాల్సి ఉంది. మిగతా 90 ఎకరాలకు పైగా భూమిపై భూ బకాసురులు కన్నేశారు. వందల కోట్ల విలువైన భూమిని అధికారులు ఇప్పటికైనా కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ, ఇప్పటివరకు అమ్మని రైతులకు సర్టిఫికెట్లను అందజేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు