అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ గుడ్‌బై

0

ఇన్నేళ్లు నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతఙ్ఞతలు

  • క్రికెట్‌ నాకు ఆడడం, పోరాడటం నేర్పింది
  • నాపై నేనెప్పుడూ విశ్వాసం కోల్పోలేదు
  • విలేకరుల సమావేశంలో యువరాజ్‌ సింగ్‌

ముంబయి : అంతర్జాతీయ క్రికెట్‌కు సిక్సర్ల వీరుడు, ఇండియన్‌ బ్యాట్స్‌మెంట్‌ యువరాజ్‌ సింగ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక విూడియా సమావేశంలో యూవీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ.. ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తన జీవితంలో తనపైతాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదని, క్రికెట్‌ తనకు ఆడడం, పోరాడటం, పడటం, లేవటం, ముందుకు సాగడం నేర్పిందని చెప్పారు. ఇకపై కేన్సర్‌ బాధితులకు అండగా ఉండటమే తన తదుపరి లక్ష్యమని అన్నారు. దాదాపు 17ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, జీవితంలో ఏవిధంగా పోరాడాలో ఆటనే నేర్పిందని యువరాజ్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

రెండు ప్రపంచకప్‌ల్లో కీలక పాత్ర పోషించిన యువీ..

మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో యువీ కీలక 

పాత్రపోషించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో బంతితో మెరిసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు. ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ ఉందని తెలిసినా ఆటకే ప్రాధాన్యత ఇచ్చిన యువీ.. ప్రపంచకప్‌ అనంతరం అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. ఈ చికిత్స అనంతరం యువీ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక భారత జట్టుతరపున 2012లో చివరి టెస్ట్‌..2017లో చివరి వన్డే, టీ20 ఆడిన యువీ.. ఐపీఎల్‌-12లో ముంబై ఇండియన్స్‌ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. 1996లో అండర్‌-15 వరల్డ్‌ కప్‌, 2000 సంవత్సరంలో అండర్‌-19 వరల్డ్‌ కప్‌, 2007,2011 ప్రపంచకప్‌ల్లో యువరాజ్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి నయా ట్రెండ్‌ సృష్టించాడు. మొత్తం 40 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 11 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు చేశాడు. 52 హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 1177 పరుగులు నమోదు చేశాడు. టీ20ల్లో 8 ఆఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. 132 ఐపీఎల్‌ మ్యాచుల్లో 2750 పరుగులు చేశాడు. రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లాండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here