Featuredరాజకీయ వార్తలు

పంచాయతీలను చంపేస్తారా?

-జీన్స్‌ప్యాంట్లు వేసుకున్నవాళ్లుంటే వాటిని పట్టణాలుగా మార్చేస్తారా?

˜ -పంచాయతీల విలీనంపై

ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

˜ -వ్యతిరేకంగా తీర్పు వస్తే వాటికీ

-ఎన్నికలు పెడతామని సర్కారు హామీ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మున్సిపాలిటీలను విస్తరించే అధికారం ప్రభుత్వానికి ఉందా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. జీన్స్‌ ప్యాంట్లు వేసుకుని ప్రజలు ఆధునికంగా కనిపిస్తే చాలు పట్టణీకరణ చేస్తూ పంచాయతీలను చంపేస్తారా అంటూ వ్యాఖ్యానించింది. పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేయడానికి శాస్త్రీయ పద్ధతులను అనుసరించరా అంటూ ప్రశ్నించింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు సమాధానమిస్తూ అధ్యయనం చేశాకే ప్రభుత్వం పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. విలీనం చెల్లదని ఈ కోర్టు ఉత్తర్వులిస్తే వెంటనే మరో నోటిఫికేషన్‌ జారీ చేసి 21 రోజుల్లో ఆ పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించడానికి సర్కారు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ హామీని రికార్డు చేసుకున్న హైకోర్టు సుమారు 95 పిటిషన్లపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

మున్సిపాలిటీల్లో పంచాయతీలను విలీనాన్ని సవాలు చేస్తూ కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి 95 దాకా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై శుక్రవారం జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకష్ణన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, రచనారెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. పంచాయతీలను విలీనం చేసే ముందు అనుసరించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పంచాయతీలను డీనోటిఫై చేసి.. అక్కడ వ్యవసాయేతర రంగాలపై ఆధారపడిన జనాభా, జనసాంద్రత, తలసరి ఆదాయం, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఇవేవీ చేయకుండా, పంచాయతీ తీర్మానాలు లేకుండా ఏకపక్షంగా మున్సిపాలిటీల్లో విలీనం చేశారని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లో లేకపోవడంతో ఈ పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. ఇటీవల జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌లో ఈ గ్రామాలను మినహాయించారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం పంచాయతీలను చంపేస్తారా అని వ్యాఖ్యానించడంతో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు సమాధానమిచ్చారు. మున్సిపాలిటీల్లో పంచాయతీలు కలిసిపోయి ఉన్నాయని, విద్యుత్తు, నీరు, మురుగునీటి సరఫరా అన్నీ మున్సిపాలిటీ ద్వారానే కొనసాగుతున్నాయని చెప్పారు. పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని వివరించారు.

గిరిజన గ్రామాల్లో రిజర్వేషన్లపై పిటిషన్లు

గిరిజన గ్రామాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 100 శాతం రిజర్వేషన్‌ కల్పించడం వల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన 100 శాతం గిరిజనులే ఉన్నపుడు వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఏఏజీ చెప్పారు. వాదనలు విన్న జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేశారు.

ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిస్తే?

పిటిషనర్లు కోరినట్లుగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిస్తే ఏమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఏఏజీ స్పందిస్తూ ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికైన సర్పంచులను ఐదేళ్లపాటు పదవి నుంచి తొలగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఇదే జరిగితే అయిదేళ్లపాటు ప్రజలకు మున్సిపాలిటీ నుంచి సౌకర్యాలు అందక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పట్టణాభివద్ధి కుంటుపడుతుందన్నారు. విలీనానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడినట్లయితే 21 రోజుల్లో ఆ పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close