FeaturedInterviewsరాజకీయ వార్తలు

సిఎం సీటు ఎగరేసుకుపోతాడా?

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపైనే కాదు, సీఎం సీటుపై కూడా కుంపటి రాజుకుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తాజా ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం.. టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమే. పైగా, ఆయన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహాకూటమితో జతకట్టడం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఉన్న ఆధరణతో.. మళ్లీ తమ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే ధీమా టీఆర్‌ఎస్‌ వ్యక్తం చేస్తున్నా.. కూటమిని తక్కువగా అంచనా వేయకూడదని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం, ఏకాభిప్రాయం లోపించడంతో ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడం టీఆర్‌ఎస్‌కు కలిసివస్తోంది. ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో కూటమి పార్టీల్లో ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. సీఎం అభ్యర్థిపై పేచీ?: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోని చాలామంది సీనియర్‌ నేతలు ఉన్నారు. వీరందరికీ సీఎం సీటుపై చాలా ఆశలు ఉన్నాయి. ఈ సారి తప్పకుండా తాము సీఎం అభ్యర్థుల పరిశీలనలో ఉంటామని కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అయితే, ఇక్కడే పెద్ద చిక్కు వచ్చిపడింది. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సీఎం సీటును త్యాగం చేయాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధినేత కోదండరామే. కాంగ్రెస్‌ పార్టీ తమ సీఎం అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించకూడదని నిర్ణయించుకున్నా.. కూటమిలో మాత్రం అభ్యర్థిని ప్రకటించే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో కేసీఆర్‌ తర్వాత ఎక్కువ ఆదరాభిమానాలు కలిగిన నాయకుడిగా కోదండరామ్‌కు పేరున్న నేపథ్యంలో ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని టీజేఎస్‌ వర్గాలు కోరుతున్నాయి. టీజేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కోదండరామ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన పేరు ప్రకటిస్తే కూటమికి తప్పకుండా సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అయితే, సీఎం సీటు ఇవ్వకున్నా.. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలోని నాయకుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతోపాటు కూటమిలో మిత్రపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పడంతో కాంగ్రెస్‌ పార్టీ ఏ విషయమూ తేల్చుకోలేకపోతోంది. తాము కూటమిలో ఉండాలంటే కనీసం 20 స్థానాలు కేటాయించాలని, తగిన సీట్లు ఇవ్వడం సాధ్యం కాకపోతే కోదండరామ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని టీజేఎస్‌ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది.

కాంగ్రెస్‌కు కఠిన పరీక్ష: దేశవ్యాప్తంగా బీజేపీ గాలి విస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కర్ణాటక తరహాలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. మరోవైపు తెలంగాణ ఇచ్చినా.. ఆ క్రెడిట్‌ను పొందలేకపోయామనే ఆవేదనతో ఉన్న కాంగ్రెస్‌కు ఈ విజయం చాలా అవసరం. ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలోనే సీఎం సీటును త్యజించడానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతుందా లేదా అనేది చూడాలి. అయితే, కర్ణాటకతో పోల్చితే తెలంగాణలో సీఎం పదవి గురించి అధిష్టానంతో పోరాడుతున్న సీనియర్‌ నేతలు చాలామంది ఉన్నారు. సుమారు 30కి పైగా సీనియర్‌ నేతలు సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. పీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితోపాటు జానారెడ్డి, జైపాల్‌ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, సంపత్‌, సర్వే సత్యనారాయణ ఇంకా పెద్ద లిస్టే ఉంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రేవంత్‌ రెడ్డి కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనుందనేది ఆ పార్టీ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. టీజేఎస్‌ నేత కోదండరాం నేరుగా రాహుల్‌తో భేటీ కానున్న నేపథ్యంలో ఏ నిర్ణయాన్ని తీసుకోనున్నారనే ఆసక్తి నెలకొంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close