ఎందుకు పరుగులాట

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వెనకబడిన తరగతుల వారు ఎన్నో యేళ్ళుగా రాజ్యాధికారం కావాలని, తమ సమస్యలను తామే పరిష్కరించుకునే రోజులు రావాలని, అందరిలాగా తాము కూడా తలయెత్తుకుని తిరగాలని కోరుకుంటుంటే బిసిల నాయకుడు అని అందరిచేత కీర్తించబడుతున్న ఆర్‌. కృష్ణయ్య అందుకు విరుద్ధంగా రాజకీయాలు చేయడం పట్లల సామాజిక ఉద్యమకారుడు చెన్నోజు శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ కష్ణయ్య బీసీ జాతిపిత.. అందులో ఎలాంటి సందేహంలేదు. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. బిసి రాజ్యాధికారం కష్ణయ్య తోనే సాధ్యం ఇదీ ఎవ్వరూ కాదనలేని నిజం అంటారు ఆయన. కృష్ణయ్య అంటే వ్యతిరేక భావంలేని చెన్నోజు ఆయన అనుసరిస్తున్న విధానాలతో ఏకీభవించలేకపోతున్నారు. బిసిలు కృష్ణయ్యను రెండో అభిప్రాయానికి తావులేని విధంగా నమ్ముతుంటే ఆయన అగ్రకుల పెత్తనంసాగుబాటయ్యే పార్టీల వెంట, కూటముల వెంటపడి వారిని కొన్ని సీట్లిమ్మని దేవులాడడం పట్ల శ్రీనివాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బిసిలను సంఘటితం చేయి సిఎం సీటు నీకు అందిస్తామంటే దాన్ని పట్టించుకోకుండా అగ్రకులాల ప్రాపకం కోసం పాకులాడుతున్నాడనీ, పెత్తనం లేని సీట్లను డిమాండ్‌ చేస్తున్నాడని అంటున్నారు. అధికారం చేతిలో పెట్టుకునే అగ్రకుల నాయకులు బిసిలకు సంక్షేమం పేరుతో నాలుగు డబ్బులు పడేస్తుంటే అదే మహాభాగ్యమని తృప్తి చెందడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నిస్తున్నారు. అగ్రకుల పెత్తనం లేని రాజ్యాధికారం సంక్షేమ పోరాటాలతో సాధ్యమా అని నిలదీస్తున్నారు. చట్టసభల్లో 52 శాతం రిజర్వేషన్లు, సంక్షేమ పోరాటాలు అని బయల్దేరితే రాజ్యాధికారం ఎప్పటికి వస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. బిసిల న్యాయమైన రాజ్యాధికార డిమాండ్‌ను పక్కదోవ పట్టించి ఏం మాట్లాడినా అది అగ్రకులాలకు రాజ్యాధికారం కట్టబెట్టి బీసీ లను కట్టుబానిసలు చేయడానికి మాత్రమే పనికివస్తుందని ఆయన అంటున్నారు. 500 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, పూర్తిస్థాయి ఫీజు రియెంబర్స్‌ మెంట్‌ కాదు బీసీల కు కావలసింది సీఎం మనుమడు, కలెక్టర్‌ కొడుకు చదివే పాఠశాలలో బీసీలు చదివే రోజులు రావాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం లేని.. కూటికి లేని కులాలు ఆర్‌ కష్ణయ్య సీఎం కావాలని కోరుకుంటున్నారు. వారి మనోగతాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా కృష్ణయ్య పనిచేయాలి. అగ్రకులాల పార్టీలను 65 సీట్లు అడుక్కోవటం కాదు అగ్రకుల పెత్తనం లేని రాజ్యాధికారాన్ని సాధించుకోడానికి అవసరమైన పథకాలు రూపొందించాలి..తగిన వ్యూహరచనచేసి బిసిలను ముందుకు నడిపించాలి ఆయన కోరుతున్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఏ ,బి ,సి, డి, ఈ. వర్గీకరణ జరగాలి. 90% సబ్సిడీ లు అడగడం మానేసి 90 శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం వచ్చే మార్గాలు వెతకాలి అని ఆయన అంటున్నారు. పిడికెడు జనాలు ఉన్న అగ్రకులాల పార్టీల టికెట్లు మనకు అవసరమా! వారికి దామాషా ప్రకారం జనాభాకు తగ్గ రిజర్వేషన్‌లు ఇవ్వాలి. రాజ్యాధికారం బహుజనుల హస్తగతం కావాలి అన్నారు. అగ్రకుల పార్టీలను టికెట్లు అడగడమంటే బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని ఆయన అంటున్నారు. బీసీలకు 20 సీట్లా అంటారే 112 బిసి కులాలలో ఎవరికి ఇస్తారు? ఎవరిని సంతృప్తి పరుస్తారు? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అగ్రకులాల నాయకులు బిసిలలో నాలుగైదు సంపన్న కులాల వారికే పదవులిచ్చి మిగిలిన కులాలకు మొండిచేయి చూపిస్తున్నారని, వారిని ఓటుబ్యాంకుగా వాడుకుని గద్దెలు కాపాడుకుంటున్నారని అన్నారు. కులానికో సీటు ఇస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. బలహీన వర్గాలకు, వెనుకబడిన కులాలకు కంటితుడుపుగా సీట్లు ఇచ్చి పెత్తనం అగ్రకులాలు తమ చేతిలో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. బీసీల్లో చైతన్యం ఎక్కువే. నడిపించే నాయకుడు లేక వారు ఏకం కాలేకపోతున్నారు. ఈ బలహీనతనే అగ్రకులాలు సొమ్ముచేసుకుంటున్నాయి. అధికారం సొంతం చేసుకుంటున్నాయి. తాత ముత్తాతల నుండి ఇదే పద్ధతి. బిసిలకు మిగిలింది రెక్కలు విరిగే వెట్టిచాకిరి. ఏడుపదుల స్వతంత్రం జీవితమంతా దీనికే సరిపోయింది. వెనుకబాటుపై వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ పెట్టినా అగ్రకులాల వారే కోట్లకు పడగలెత్తారు. బిసిలు అభివద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం, సరైన ఉపాధి లేక ఆకలి చావులతో, ఆత్మహత్యలతో కూటికి లేని కులాలుగానే చని పోతున్నారు..అని ఆందోళన వ్యక్తంచేశారు. శాసన నిర్మాణంలోనూ, బడ్జెట్‌ కేటాయింపులోనూ బిసిల ప్రమేయం, ప్రాతినిథ్యం లేకుండా వెనుకబాటు రూపుమాపడం సాధ్యమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెరస ప్రభుత్వం గొర్లు, బర్లు, చేపలు మూడు నాలుగు సంపన్న కులాలకే కేటాయిస్తోంది. అందువల్ల ఇతర బిసిలు సంక్షేమ పథకాలు అందక, భూములు లేక ఇండ్ల స్థలాలు లేక అన్ని రకాలుగా అనర్హులుగా మిగిలిపోతున్నారు అని అన్నారు. బీసీలకు అవమానం ఆకలి దోపిడి పీడన అసమానతలు తొలగిపోవాలంటే అగ్రకులాల పెత్తనం లేని రాజ్యాధికారం కావాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీ సీ వర్గీకరణ జరగకుండా బహుజన రాజ్యాధికారం రాదు. బిసి నాయకులు అగ్రకులాల పార్టీలను టికెట్లు అడగడం మాని రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలను చైతన్య పరిచి రాజకీయ పార్టీ ఏర్పాటుచేసి రాజ్యాధికారం సాధ్యం చేసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇప్పటికీ నెరవేరలేదు. ఇక 52 శాతం రిజర్వేషను ఎప్పుడు సాధిస్తారు? బిసిలను ఊరిస్తున్న రాజ్యాధికార లక్ష్యాన్ని ఎప్పటికి నెరవేరుస్తారు? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

– చెన్నోజు శ్రీనివాసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here