Featuredజాతీయ వార్తలు

ప్రణబ్‌ ముఖర్జీకి బీజేపీ భారతరత్న ఎందుకిచ్చింది?

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న ఇచ్చిన బీజేపీ ఒకే బాణంతో చాలా లక్ష్యాలను గురిపెట్టింది. ఈ చర్చ ప్రణబ్‌ ముఖర్జీ యోగ్యత గురించి కాదు, దానికి బదులు ఎన్నికల సంవత్సరంలో పెద్ద ప్రతీకాత్మక నిర్ణయం ద్వారా ఇస్తున్న సందేశం గురించి జరుగుతోంది. భారత రత్న, పద్మ పురస్కారాలు ఎప్పుడూ రాజకీయం అవుతూనే వచ్చాయి. అవి ఎంత రాజకీయం అయ్యాయంటే, 1988లో సరిగ్గా ఎన్నికలకు ముందు తమిళనాడు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం అప్పటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ఎంజీ రామచంద్రన్‌కు భారతరత్న ఇచ్చింది. దాని గురించి అప్పట్లో చాలా విమ ర్శలు కూడా వచ్చాయి. అయితే, 1998, 2004లో అర్హుడు అనిపించుకున్నా ప్రధానమంత్రి కాలేకపోయిన లేదా గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడుగా లేకపో వడం వల్ల అంచుల్లో ఉండిపోయిన ప్రణబ్‌ ముఖర్జీని కాంగ్రెస్‌ కుటుంబ రాజకీయాలకు బలైన వ్యక్తిగా బీజేపీ చూపిస్తోంది. కాంగ్రెస్‌లోని ఒక ప్రత్యేక కుటుంబం సర్దార్‌ పటేల్‌, శాస్త్రి, నరసింహారావు నుంచి ప్రణబ్‌ ముఖర్జీ వరకూ బయటి వారికి అర్హత ఉన్నప్పటికీ చోటు ఇవ్వలేదని బీజేపీ చెబుతూ వచ్చింది. ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న ఇచ్చి అదే స్క్రిప్టును ఇప్పుడు మరింత బలంగా మార్చింది. అయితే, కాంగ్రెస్‌ ఆలోచనా విధానానికి ప్రధాన ముఖంగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ గత ఏడాది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లినప్పుడు, ఆయనకు పార్టీకి అతీతంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చే ప్రయత్నాలు కనిపించాయి. అప్పుడు దీని గురించి చాలా చర్చ కూడా నడిచింది. ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీయే తన తండ్రి నిర్ణయంపై అప్పుడు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రణబ్‌ ముఖర్జీ 2018 జూన్‌ 7న నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు. అందులో ఆయన జాతీయత, జాతీయతావాదం, దేశభక్తి గురించి మాట్లాడారు. దాంతో వేదిక వేరైనా, ఆయన ఆలోచనల్లో ఎలాంటి తేడా రాలేదు అనే విషయం స్పష్టమైంది.

పశ్చిమ బంగపై గురి

గత ఏడాది ఆ ఘటన తర్వాత, కొత్త ఏడాదిలో ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న ఇవ్వాలన్న నిర్ణయం… గాంధీ కుటుంబానికి, ఆయనకు ఉన్న దూరాన్ని చూపించేదిగా, కాంగ్రెస్‌కు అతీతంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే, విషయం అది మాత్రమే కాదు. పశ్చిమ బంగలో అడుగుపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ బెంగాలీల ఐడెంటిటీని కూడా తాము గౌరవిస్తున్నట్టు కనిపించాలని అనుకుంటోంది. ఒక కుటుంబం చేతుల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌ పుత్రుడిని రెండు సార్లు ప్రధాని కాకుండా అడ్డుకుంటే, ప్రత్యర్థి పార్టీ అయినా మేం ఆయనకు అత్యున్నత గౌరవం ఇచ్చాం అని బీజేపీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఓపెన్‌గా మాట్లాడగలదు. దీని ద్వారా ఉత్తర భారత్‌, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ముంచుకొచ్చే నష్టాన్ని బెంగాల్‌తో పూరించగలమని కూడా ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి ఇది కాంగ్రెస్‌లో ఉన్న ఫ్యామిలీ నంబర్‌ వన్‌ను తగ్గించి చూపించేలా మోరల్‌ హై గ్రౌండ్‌ తీసుకోవడం, బంగాల్‌లో రాజకీయ లబ్ధి పొందడం, ముఖ్యంగా కాంగ్రెస్‌ ఒక కుటుంబాన్ని మాత్రమే గౌరవిస్తుంటే బీజేపీ దేశ పుత్రులందరినీ గౌరవిస్తుందని చెప్పడమే అన్నట్టు కనిపిస్తోంది.

అసోం మంటలు చల్లార్చడానికేనా

భారతరత్న పొందిన నేతల్లో ప్రణబ్‌ ముఖర్జీని కూడా నిలిపిన బీజేపీ ఆయనను భారతరత్న అందుకున్న కాంగ్రెస్‌ ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులకు సమానంగా నిలిపింది. ఈ పురస్కారం అందుకున్న వారిలో ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ కూడా ఉన్నారు. అలాగే భారత రాజకీయాల్లో ప్రణబ్‌ను సోనియా కంటే పైన కూర్చోపెట్టిన బీజేపీ ఆయన రాజకీయ లింకులు కూడా కత్తిరించేసింది. ఇదే అంశంపై బీజేపీ భాగస్వామి అసం గణపరిషత్‌ వారి పొత్తు వదిలేసింది. బీజేపీ అసోం రాష్ట్ర విభాగంలో చీలికలు వస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పౌరసత్వం బిల్లు అక్కడి ప్రజలను రెండు వర్గాలుగా విడగొట్టింది. అయినా, భూపేన్‌ హజారికా భారతరత్న పురస్కారం పొందిన తొలి అసోం వాసి కాదు. ఆయనకు ముందు స్వతంత్ర సమరయోధుడు, రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గోపీనాథ్‌ బొర్దొలోయికి కూడా 1999లో ఈ గౌరవం లభించింది. ప్రముఖ సంగీత కళాకారుడు, గాయకుడు, చిత్రనిర్మాత అయిన భూపేన్‌ హజారికాను ఈశాన్య భారత వాణిగా భావిస్తారు. అసోంలో ఆయన్ను చాలా గౌరవిస్తారు. 2004లో బీజేపీలో చేరిన హజారికాకు ఇప్పుడు బీజేపీ భారతరత్న ఇచ్చి, ఆ రాష్ట్రంలో మంటలను చల్లార్చే ప్రయత్నం చేసింది. బీజేపీ ప్రభుత్వం ఒక కాంగ్రెస్‌ నేతకు భారత రత్న ఇచ్చి గౌరవించడం అనేగి ఇది మొదటిసారేం కాదు. అంతకు ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా పనిచేసిన పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవీయకు కూడా నరేంద్ర మోదీ ఈ పురస్కారం ప్రకటించారు.

సంఘ్‌కు తీపికబురు

పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవీయకు అత్యున్నత పురస్కారం ఇవ్వడంతో ఒక కొత్త సంప్రదాయం మొదలైంది. దాని లక్ష్యం హిందుత్వ వాద ఇమేజ్‌ ఉన్న నేతలకు మార్గం వేయడం. మాలవీయ కాంగ్రెస్‌లో ఉండేవారు, కానీ ఆయన నెహ్రూవాదం ఉన్న సెక్యులర్‌ సెక్షన్‌ ప్రతినిధిలా లేరు. బదులుగా ఆయన లాలా లజపతి రాయ్‌లా ఉదార హిందుత్వ వాద వైఖరిని అవలంబించారు. మాలవీయ 1909లో లా¬ర్లో జరిగిన అఖిల భారతీయ హిందూ మహాసభలకు అధ్యక్షత కూడా వహించారు. చండికాదాస్‌ అమృత్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌ అంటే నానాజీ సంఘ్‌తో నేరుగా అనుబంధం ఉండి భారతరత్న పురస్కారం పొందిన మరో నేతగా నిలిచారు. ఆయనకు ముందు అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంఘ్‌ నుంచి భారతరత్న గౌరవం అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఈ నిర్ణయం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు తీపికబురు లాంటిదే. భవిష్యత్తులో బీజేపీ అధికారంలో కొనసాగితే అది శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ లాంటి నేతల దారిలోనే చివరికి సావర్కర్‌, కేశవ్‌ బలరామ్‌ హెడ్గేవార్‌, సదాశివ రావ్‌ గోల్వల్కర్‌ లాంటి వారిని గౌరవించే దిశలో వెళ్తుంది. సావర్కర్‌, హెడ్గేవార్‌, గోల్వల్కర్‌ ఈ గౌరవానికి అర్హులా కాదా అనే అంశంపై దేశమంతా విస్తృత చర్చ జరగవచ్చు. కానీ, ఇంతకు ముందు కూడా వివాదాలు, చర్చల్లో నిలిచిన చాలా మందికి భారతరత్న ఇచ్చారు. నోబెల్‌ పురస్కారం లాగే, భారతరత్న కూడా దానికి అర్హులైన ఎంతో మందికి దక్కలేదు. అదే సమయంలో వివాదాల్లో నిలిచిన చాలా మందిని అది వరించింది. ఈసారీ భారతరత్న పురస్కారం పొందిన ఈ ముగ్గురి గురించి ఎక్కడా ఎలాంటి ప్రత్యేక చర్చా జరగలేదు. కానీ ఈ పురస్కారాల గురించి ఒక అద్భుతమైన విషయం మాత్రం చెప్పుకుంటున్నారు. దేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను వ్యక్తుల గౌరవం పెంచడానికి కాకుండా, ఆ అవార్డు గౌరవాన్ని మరింత పెంచే వ్యక్తులకు మాత్రమే దానిని ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close