అన్ని పార్టీలకు జై.. ఓటు వేసేదెవరికోయి…

0

అంతా మనవాళ్లే.. అది జనమా.. ప్రభంజనమా.. ఇసుకెస్తే రాలనంత జనం.. చీమల్లా బారులు తీరిన జనం… రెండు వేలు చూపిస్తూ విజయసంకేతాన్ని చూపిస్తున్న నాయకులు… వారి సభలు, సమావేశాలకు వచ్చిన వారంతా వారికే ఓటేస్తారనుకుంటే అంత కంటే పొరపాటు మరోటి లేదనుకుంటా.. నాయకుడి మీద నమ్మకం ఉంటే, పార్టీ మీద ప్రేమ ఉంటే ఓటు వేసేలా ప్రణాళికలు రూపొందించాలి కాని అధినాయ కుల మొప్పుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ, వేలాది వాహనాల్లో, లక్షలాది మంది జనాలను తరలిస్తున్నారు కాని వారి మనసులో ఏ పార్టీకి స్థానముందో మాత్రం తెలుసుకోలేక పోతున్నా రు.. భారీ బహిరంగ సభలకు వచ్చే వారు ఏ నాయకుడి భవిష్యత్తును మారుస్తారో పసిగట్టే వారు మాత్రం ఏ పార్టీలో లేరనుకుంటా…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంది మన పార్టీల పనితీరు.. ఎన్నికల రణరంగంలో పార్టీల బలం, బలహీనత వారు చేసే ప్రచారం మీదనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆ ప్రచారానికి వచ్చే జనం మీదనే పార్టీ మనుగడ, పార్టీ విజయం ఉంటుందని నమ్మె రాజకీయపార్టీలు ఎక్కువగా నమ్ముతున్నాయి. అందుకే రాజకీయపార్టీలు పెట్టే ప్రతి కార్యక్రమానికి అదీ రోడ్‌షో కానివ్వు, బహిరంగసభ కానివ్వు అదీ ఇంకెదైనా కానివ్వు జనం వచ్చారన్నదే చూస్తారు, అంచనాలకు మించి జనాలు వచ్చారని మన విజయానికి, పోటీ చేసే అభ్యర్థి ఉనికికి కొదవే లేదనుకుంటున్నారు.. అసలు సమావేశాలకు వచ్చే జనం స్వచ్చంధంగా వస్తున్నారా.. వచ్చిన జనం ఎవ్వరూ, ఏలా తీసుకొచ్చారు.. వారు పార్టీ సానుభూతిపరులా మరెలా వస్తున్నారనేది మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు.. వచ్చిన వారంతా పార్టీ ఓటు బ్యాంకేనా అనే ఆలోచన మరిచిపోతారు. మరుసటి రోజు మరోక పార్టీ సభ నిర్వహించినా అదే జనం క్యూకడుతారు.. అన్ని పార్టీలకు అదే జనం కనబడుతారు. కొన్ని సభల్లో మాత్రం ఐదు వందలు, వెయ్యి ఇస్తా అన్నారు. తీరామీటింగ్‌ అయ్యాక ఇవ్వకుండా నాయకులు జారుకున్నారని గొడవ చేసిన జనాలు అక్కడక్కడా ఉన్నారు.. పార్టీల మీద ప్రేమ ఉంటే, నాయకుల మీద అభిమానం ఉంటే జనాలను తరలించడం ఎందుకు ఆసక్తి ఉంటే వారే వస్తారు.. లేదా నచ్చిన నాయకునికి, చేసిన అభివృద్దిని చూసి ఓటేయ్యమని ప్రచార చేయాలి కాని ఇంటింటికి తిరుగుతూ, సభలు, సమావేశాలు అంటూ వాహనాలు పెడుతూ జనాల తరలించడం, సభలకు వస్తేనే మీకు ప్రభుత్వ రాయితీలు వస్తాయని, మహిళలకు రుణాలు ఇప్పిస్తామని, ఔట్‌సోర్సింగ్‌ వాళ్లకు పర్మినెంట్‌ చేస్తామని ఏదోఏదో మాటలు చెప్పి జనాలను తరలిస్తున్నారు.. కాని తీరా ఎన్నికల జరిగాక ఫలితాలను చూస్తే మాత్రం భారీగా జనంతో విజయవంతమైన పార్టీలన్నీ బోల్తాపడిన సంధర్బాలు చాలా ఉన్నాయి.. ముందస్తు ఎన్నికల్లో భాగంగా గులాబీ అధినేత కెసిఆర్‌ రంగారెడ్డి జిల్లాలోని కొంగర్‌కలాన్‌ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించారు. ఇరవై ఐదు లక్షల జనాలను తీసుకురావాలని ప్రతిపక్షాలకు వణుకు పుట్టేలా కనివినీరీతిలో సభ నిర్వహించాలనేది టిఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య ఉద్ధేశ్యం.. తెలంగాణ జనాభా మూడున్నర కోట్లకు పైగా ఉంటుంది. ఇరవై ఐదు లక్షల జనాలను సేకరించడమంటే అదీ మామూలు విషయం కాదు. వారం రోజుల నుండి వారు మంత్రులు, ఎమ్మెల్యెలు కంటిమీద కునుకులేకుండా కష్టపడితే ఐదారు లక్షలు దాటలేదు. వారు కూడా స్వచ్చంధంగా పార్టీ మీద అభిమానంతో వచ్చారా అంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానమే లేదు. స్థానిక నాయకులు వాహానాలతో పాటు రాకపోకలకు సంబంధించిన అన్ని వసతులు కల్పించారు. అందులో ఆ పార్టీకి ఓటు వేశావారెంతమందో తెలియదు.

అధినేతలందరికి అదే జనం… అసెంబ్లీ రద్దు అయ్యాక యాభై రోజుల్లో వంద నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని తెరాస పార్టీ నిర్ణయించింది. ఆశీర్వాద సభల పేరుతో ఐదారు నియోజకవర్గాల్లో కెసిఆర్‌ హజరైన సభలకు జనం వేలల్లో వచ్చారు. నల్లగొండలో జరిగిన ఒక సభకు మాత్రం యాభై, అరవై వేల మంది హజరయ్యారని అంచనా ఉంది. అదే నల్లగొండలోవారం రోజుల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన రోడ్‌షోకు కూడా టిఆర్‌ఎస్‌ సభకు తగ్గకుండా వేలాదిగా తరలివచ్చారు. అదే జనం అటు కెసిఆర్‌ నిర్వహించిన సభకు హజరయ్యారు. ఇటు కాంగ్రెస్‌ నిర్వహించిన సభకు హజరయ్యారు. రెండు పార్టీలు సభ సక్సెస్‌ అంటూ విజయకేతనం ఎగరేశారు. కాని ఓటింగ్‌ వచ్చేసరికి మాత్రం ఇందులో ఎవ్వరూ ఏ పార్టీనో అర్థం కాని పరిస్థితి. జనాలను చూసి సంబరపడుతున్నా నాయకులకు వారిని వారి పార్టీకి ఓటు వేయించుకునేలా ఎంత వరకు సక్సెస్‌ సాధిస్తారనేదే ముందున్న అసలైన పండగ… తెలంగాణ ఎన్నికలలో ప్రచారం కోసం ఈ నెలలో జాతీయ పార్టీలకు చెందిన అధినేతలు ఇద్దరూ భారీ బహిరంగసభలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిజామాబాద్‌లో హజరవగా, బిజెపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కరీంనగర్‌ బహిరంగసభకు హజరయ్యారు. ఇరు పార్టీలకు చెందిన జాతీయన అధ్యక్షులు కావడంతో తెలంగాణ పార్టీ నాయకులు చెమటోడ్చి, వాహనాలతో తరలించి వేలాది మంది జనాలను సభకు వచ్చేలా చేశారు. అధినాయకుల సభలను సక్సెస్‌ చేశారు. వీరంతా స్వచ్చంధంగా వచ్చారా.. తరలించారా.. డబ్బులు ఇచ్చి తీసుకొ చ్చారా అనేది పక్కనపెడితే ఇంత కష్టపడిన పార్టీ నాయకత్వం వచ్చిన వారందరూ తమకే ఓటేస్తారనే నమ్మకాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఏదో అధినాయకులు వస్తున్నారు. సభ విజ యవంతం చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు కాని వచ్చిన వారిలో పార్టీకి ఎంత బలం చేకూరిందో, ఎంత క్యాడర్‌ పెరుగు తుందో మాత్రం ఒక్క పార్టీనాయకులు ఆలోచించడమే లేదు..

ఓటు వేసే వరకు జనాలేటో తెలియదు…ఎన్నికల్లో ప్రతి పార్టీ సమావేశాలకు, బహిరంగసభలకు వేలాదిగా జనాలు తరలివస్తున్నారు అనడం కంటే, తరలిస్తున్నారనడమే మంచిది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఒక్కోపార్టీలో పనిచేసే పార్టీ క్యాడర్‌ వేలల్లోనే ఉంటుంది. కాని సభలకు మాత్రం అంచనాలకు మించి జనాలు హజరవుతారు. వచ్చినవారిలో మనవారెవరూ, అవతలివారెవరూ తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాని అధినాయకుడి మన్ననలు పొందాలంటే జనాలు కావాలి. వారు ఏ పార్టీవారైనా సంబంధం లేదు. సభ సక్సెస్‌ అయ్యిందా, లేదా అనేది నేడు ప్రధాన అంశంగా పార్టీలు పరిగణిస్తున్నారు. కానిజనాలు కూడా అవసరాన్ని పార్టీ ఏ పార్టీ నాయకులు పిలిచినా వెళుతున్నారు అదీ కూడా వారికి వెళ్లేందుకు సౌకర్యాలు కల్పిస్తేనే, అప్పటి వరకే జై అంటున్నారు. కాని ఓటు వేసే వరకు, ఫలితాలు ప్రకటించేవరకు వారి ఓటు ఎవరికి వేశారో తెలియడమే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here