భార్యనే వదిలేసిన మోడీకి..

0

మహిళలపై గౌరవం ఎలాఉంటుంది?

  • మోడీని చూసి.. మహిళా నేతలు భయపడుతున్నారు
  • తమను భర్తలు వదిలేస్తారేమనని ఆందోళన
  • అల్వార్‌ అత్యాచారంపై నోరు విప్పని మోడీ
  • బీజేపీ మేలుకోసం నీచరాజకీయాలు
  • మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాయావతి

లక్నో:

మోడీని చూసి మహిళా నేతలు భయపడుతున్నారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి తీవ్ర వ్యాఖ్యలతో మోడీపై విరుచుకుపడ్డారు. సోమవారం లక్నోలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ భర్తలు మోడీని కలుస్తున్నారంటేనే బీజేపీలోని మహిళా ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారనీ.. మోడీలాగే తమను కూడా భర్తలు వదిలేస్తారేమోనని వారు భయపడుతున్నారని మాయావతి వ్యాఖ్యానించారు. బీజేపీలో, వివాహితులైన మహిళా నేతలు తమ భర్తలను మోడీతో పాటు చూస్తే తెగ భయపడిపోతున్నారని, మోడీ తమను కూడా భర్తల నుంచి దూరం చేస్తారేమోనని వాళ్లకు దిగులు పట్టుకుందని వ్యాఖ్యానించారు. అళ్వార్‌ సామూహిక అత్యాచారంపై రేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అల్వార్‌ అత్యాచార ఘటనపై మాయావతి మొసలికన్నీరు కారుస్తున్నారంటూ ప్రధాని మోడీ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాయవతి.. మోడీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. తన భార్యనే వదిలేసిన మోడీకి మహిళలపై గౌరవం ఎలా ఉంటుం దంటూ విమర్శించారు. అల్వార్‌ అత్యాచారంపై ప్రధాని మోడీ నోరు విప్పడంలేదు. దీనిపై ఆయన తన పార్టీకి మేలు చేకూరేలా నీచ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత సిగ్గుచేటైన విషయమని, రాజకీయ ప్రయోజనాల కోసం తన సొంత భార్యనే వదిలేసిన మోడీకి ఇతరుల భార్యలు, సోదరీల పట్ల ఎలా గౌరవం ఉంటుందంటూ మాయావతి విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో దళితుల ఓట్లు కోసం.. మోడీ వారిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాయావతి ఆరోపించారు. కానీ దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దాడులను వారు మర్చిపోరన్నారు. వేముల రోహిత్‌, షహరాన్‌పూర్‌ సంఘటనను దళితులు మర్చిపోరు.. మోడీని క్షమించరని మాయావతి స్పష్టం చేశారు. అయితే మాయావతి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఒడిషా పూరి బీజేపీ అభ్యర్థి సంబీత్‌ పాత్ర మాట్లాడుతూ.. మాయావతి వ్యాఖ్యలను టీవీల్లో చూశాను. మోడీని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె మనస్తత్వం ఎలాంటిదో అర్థం కావడంలేదు. ఎందుకంటే మోడీ తన కుటుంబాన్నిసైతం కాదనుకుని.. దేశాన్నే తన ఇల్లుగా భావిస్తున్నారు. మాయావతి జీ.. మీకు మీ సోదరుడే ఎక్కువ కావచ్చు.. కానీ మోడీకి దేశమే ఎక్కువ అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here