Featuredరాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి పీఠం – కాంగ్రెస్ రథసారథి ఎవరు..?

(ఆదాబ్ విశ్లేషణ కథనం-1)★ అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే.!
★ పని తక్కువ ప్రచారం ఎక్కువ
★ 6 నెలల క్రితమే గోతులు తవ్వడం ఆరంభం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్) :అనుకున్న దానికన్నా ముందే కేసీఆర్ ‘ముఖ్యమంత్రి’ పళ్ళెం అందరి ముందు పెట్టారు.

అందరూ ఉద్దండ పిండాలే. ఎవరికి ఎవరు తీసిపోరు. ఏపార్టీలో అయినా ఒకరిద్దరు, మహా అయితే ఓ నలుగురి మధ్యలో ‘కిస్సా కిర్చీకా’ ఆట ఉంటుంది. కాంగ్రెసులో మాత్రం అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. రెడ్డి ఆధిపత్యం ఉంది.అలా అని పార్టీ ‘కుల’ సమతూల్యం కోసం అహర్నిశలు కష్టపడినట్లు కనిపిస్తోంది. జాతీయ దృక్పథంతో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తుంది. అశావాహులు అందరూ పార్టీ
అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ అర్హత ఉన్నా లేకున్నా.. పీఠం కోసం ఓ ‘రాళ్ళ మూట’ పక్కన పెట్టుకుని చీకట్లో కాచుక్కూర్చుంటారు.

6నెలల ముందుగానే..:
కేసీఆర్ కు ‘మాత్రమే’ తెలిసిన ముందస్తు వ్యూహం ఎలా ఉన్నా.. కాంగీయులు మాత్రం గత 6నెలలుగా సొంతపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులను బజారుకీడ్చే కార్యక్రమం చేపట్టారు. అందుకోసం ఎంతకు దిగజారారంటే ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపేంత. గాంధీభవన్ వేదిక ‘రచ్చ’లు చేయించారు.

పార్టీ పదవులతో పక్కదారి..: భవిష్యత్తులో ‘తమ పీఠం’ కలలు కల్లలు కాకుండా ఉండాలని జిల్లాల వారి డిసిసి కమిటీలలో శత్రువులకు స్థానం కల్పించారు. ఆ కమిటీలలో క్రియాశీలక సభ్యులకు సీట్లు ఇవ్వరాదని నెమ్మదిగా అధిష్టానానికి సమాచారం చేరవేశారు. ఇదిలా ఉండగా మరో వర్గం వారసులకు ద్వారాలు తెరవద్దని, సిట్టింగులను వదిలి కుటుంబానికి ‘ఒక్కసీటు’ అనే సూత్రాన్ని తెరపైకి తెచ్చింది.

‘సీల్డ్’ సిత్రాలు:
అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్నట్లు ఈపార్టీలో కనిపిస్తుంది. ‘సీల్డ్ కవర్’ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంతకైనా తెగించి.. దిగజారే అధ్భుతమైన (అవ) లక్షణం ఈపార్టీ నాయ’కుల’కు సొంతం. ఈ పార్టీలో ఏ పదవికైనా ‘ఏళ్ళ తరబడి ఉన్నవారికి ఎన్ని అవకాశాలు ఉంటాయో.. ఇప్పుడే కండువ కప్పుకున్న ‘ఊసరవెల్లి’కి అదే అవకాశం’. ఇదే కాంగ్రెసును ఇంతకాలంగా నడిపిస్తున్న ఇంధనం. రాజీవ్ గాంధీ హయంలో సుధీర్ఘ అనుభవం ఉన్న పి.వి.నర్సింహారావుకు
అస్సలు సీటు ఇవ్వను పొమ్మంది. ‘శ్రీ పెరంబదూర్’ దుర్ఘటనతో పరిస్థితులు తారుమారయ్యాయి. సీటుకే దిక్కులేని పివి ప్రధానమంత్రి కాగలిగారు. దినదిన గండంగా ఉన్న మైనర్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు ఆర్థిక సంస్కరణలతో ముందుకు లాగారు. ఇదీ కాంగీ స్టామినా.

కోవర్ట్ ఆ’పరేషాన్’:
కోవర్టు ఆపరేషన్ల విషయంలో ఈ పార్టీ వ్యూహకర్తలు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే చాణిక్యులు. ప్రత్యర్థి పార్టీలను అర్థంతరంగా చీల్చి ‘అమీబా’లా కలుపుకుంటుంది. అప్పటిదాకా సింహాలుగా గర్జించిన ఎంతోమందిని ‘కనుబొమ్మ’ సైగలతో పిల్లిలా ఆడిస్తుంది. వినకుంటే ‘నాదస్వరం’తో కట్టడిచేస్తుంది. ఈ పార్టీకి ఓర్పు నేర్పు అవసరాన్ని బట్టి ఆడ్డంగా వాడేసుకుంటుంది. ఈ పార్టీలో ఉన్న స్వేచ్చ ఏపార్టీలో కనిపించదు. పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీలతో పొత్తులు అల్లుతుంది. ధీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ప్రత్యర్థి శిబిరంలో రాష్ట్రస్థాయి ‘ముఖ్యమంత్రి’లను రంగం మీదకు తెస్తుంది. రాజశేఖర్ రెడ్డి వ్యవహారశైలి చూసిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల విషయంలో లోతుగా ఆలోచన చేస్తుంది. ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’ ఫలానా అని చెప్పకుండా పనికానిచ్చేస్తుంది. అవసరానికి అనుగుణంగా ‘జోకర్’ కార్డు ఉపయోగిస్తుంది.

రెడ్డికి ‘విశ్రాంతి’:
కాంగ్రెసులో రెడ్డి హవా బాగానే కొనసాగింది. ఒక్క రాజశేఖర్ రెడ్డి మినహా మిగిలిన వారంతా అధిష్టానం కనుసైగలలో కొనసాగి నలిగినవారే. ఆయితే ఈసారి పొత్తులతో ముందుకు సాగాలని భావిస్తుండటంతో మిత్రపక్షాల సూచలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అందుకే ‘సామాజిక సర్దుబాటు’ కోసం ఈ ఒక్కసారి ‘రెడ్డి’లకు విశ్రాంతి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది.

గిప్ట్ కొట్టు – సీటు తీసుకో..:
కాంగ్రెస్ అధిష్టానానికి ఆధారాలతో అందిన పిర్యాదులో ఓ గ్రానైట్ వ్యాపారి ముగ్గురు క్రియాశీలక సభ్యులకు కార్లు బహుమతులుగా ఇచ్చారని కారు నెంబర్లు, వీడియోలు కూడా జత చేసి పంపారు. పాపం ఆశావాహులైన అభ్యర్థి మాత్రం ఇంకా ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశతో ఉన్నారు.

ముందస్తుతో అందివచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ అంది పుచ్చుకుంటుందా…? అంతర్గత కుమ్ములాటలతో అక్కడే ఆగిపోతుందా..? అన్నది కాలం చెపుతుంది.

Box
ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్న నాయకుల జాబితా:
ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, వి.హన్మంతరావు, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి, సబితా ఇంద్రారెడ్డి, ముఖేష్ గౌడ్, డి.కె.అరుణ, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు. వీరు కాకుండా ‘ముఖ్య పీఠం’ కోసం ఏఐసీసీ వద్ద 47 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి సరిపోయిన సంఖ్యాబలం వస్తే… ముందు సిఎం పీఠాన్ని అధిష్ఠించి అనంతరం 6 నెలల్లో ఎమ్మెల్సీ అవతారంలో రావాలని వీరు భావిచడం గమనార్హం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close