ఎవరికి వారే యమునా తీరే..

0
  • తెరాసలో వర్గాల కుంపటి..
  • కొరవడుతున్న ఐకమత్యం..
  • అధినేత చెప్పిన మారని శ్రేణులు..

రావాలి రావాలి అందరూ అన్ని పార్టీల వారూ రావాలి. మా పార్టీ తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పిన తెరాస అధిష్టానం చిన్నా, పెద్దా, ఆ పార్టీ, ఈ పార్టీ అని అందరికి గులాబీ కండువా కప్పింది. వచ్చిన నాయకులు అభిమానంతోనో, ప్రేమో, నయానో, భయానో తెలియదు కాని అందరూ క్యూకట్టారు. అన్ని రంగుల జెండాల నాయకులు గులాబీ రంగులో కలిసిపోయారు. అంతా బాగానే ఉన్నా, పార్టీ నాయకులతో తెరాస నిండుగా కళకళలాడుతున్న వారి గుడారంలో మాత్రం ఐకమత్యం కరువవుతోందని తెలుస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవరెవరూ వచ్చారో, ఎవరికి వారు టిడిపి నుంచి వచ్చిన వారు టిడిపి వర్గం, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారు కాంగ్రెస్‌ వర్గాలుగా ఏర్పడుతున్నట్లు సమాచారం. తెరాస అధినేత ఇక్కడకొచ్చాక అందరూ ఒక్కటేనని అంతా సర్దుకుపోవాలని ఎంత చెప్పినా ఎవరికి వారిగానూ ఉంటూ సభలకు, సమావేశాలకు హజరవుతున్నారని సీనియర్‌ నాయకులు అంటున్నారు. ఇదీ ఇలాగే ఉంటే భవిష్యత్తులో చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. మొదట్లోనే వీరి మధ్య బేధాభిప్రాయాలను తుంచివేయాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.. అంతా హేమాహేమాలీ కావడంతో ఎవరు ఎలా స్పందిస్తారో తెలియక అధిష్టానం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఖాళీ చేయించాలి. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురులేకుండా మరో పది, పదిహేను సంవత్సరాలు తెలంగాణలో తెరాస పార్టీనే అధికారంలో ఉండేలా చక్రం తిప్పుతున్నారు కెసిఆర్‌. అందుకే తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా, మరో ఇతర పార్టీ మనుగడ సాగకుండా అంతా క్లీన్‌ స్వీప్‌ చేస్తూ టిఆర్‌ఎస్‌ హవానే కొనసాగిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు వివిధ పార్టీల్లో కొనసాగి పోటీ చేసి ఓడి, గెలుపొందిన కొంతమంది నాయకులు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో, లేదో గులాబీ బాట పడుతూ కారు ఎక్కడం మొదలెట్టారు. కాంగ్రెస్‌ తో పాటు దాదాపు అన్ని పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. నాయకులంతా క్యూకట్టడంతో గులాబీ పార్టీలో నేతల సందడి మొదలయింది. తెరాసలో ఏ సమావేశం జరిగినా నేతలకు మాత్రం కొదవలేకుండా పోయింది. ఇటీవల జడ్పీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన టిఆర్‌ఎస్‌ సన్నాహాక సమావేశంలో ఎమ్మెల్యెలతో పాటు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జిల్లాలనుంచి వచ్చే నాయకులు రాష్ట్ర రాజధానికి వస్తే వారి వారి పార్టీ కార్యాలయాలైనా గాంధీభవన్‌ కో, ఎన్టీఆర్‌ భవన్‌ కో వెళ్లెవారు. కాని ఇప్పుడు ఇంచు మించుగా నాయకులంతా టిఆర్‌ఎస్‌ లో చేరడంతో నియోజకవర్గాలు, జిల్లాల నుంచి వస్తున్న వారంతా నేరుగా ప్రగతి భవన్‌ బాట పట్టడం ఆసక్తికరంగా మారిపోయింది. తెరాస పార్టీలోకి కాంగ్రెస్‌, టిడిపి నుంచి చాలా మంది నాయకులు గులాబీ కింద చేరిపోయారు. అటు సిపిఐ నుంచి కూడా వలస వచ్చారు. ఇక్కడ పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్నవారూ ఉన్నారు. ఈ దశలోని వీరంతా ఒక్క గూటికి చేరిపోయారు. ఒకప్పుడు సూటి, పోటి మాటలతో వేరే వేరే పార్టీలలో ఉంటూ బద్ద శత్రువులుగా మారిపోయిన వారంతా కూడా ఒకే దగ్గరికి చేరిన మనసువిప్పి మాట్లాడుకోవడానికి వెనుకా ముందూ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

పార్టీల వారీగానే తెరాసలో గ్రూపులు

తెరాస పార్టీలోకి ఏ పార్టీ నుంచి ఎంతమంది వచ్చారో వారంతా గ్రూపులుగానే కలిసుంటూ సభలకు, సమావేశాలకు హజరవుతున్నారు. ఇటీవల జరిగిన తెరాస కార్యవర్గసమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చుట్టూ అప్పటి టిడిపిలో కొనసాగిన నేతలు కలుసుకొని వీరంతా ఒక్కచోట చేరి సందడి చేయడం ఆసక్తిగా మారిపోయింది. అటు సబితా ఇంద్రారెడ్డితో పాటు సునీతా లక్ష్మారెడ్డిలు టిఆర్‌ఎస్‌ లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారంతా మరో గ్రూపులో కలిసి ఉన్నట్లు కనిపించింది. ఒకప్పటి కాంగ్రెస్‌ నాయకులు అప్పటి టిడిపి నాయకులు దూరం దూరంగా ఉండడంపై ఇప్పడు పార్టీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇలా ఇతర పార్టీల నుంచి గులాబీ వనంలోకి వచ్చినా వారందరూ ఒక్కటిగా కలిసి పోకుండా ఎవరికి వారే గ్రూపులుగా ఉండడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. జడ్పీ ఎన్నికల్లో ఎలాంటి పోకడలకు పోకుండా అందరిని కలుపుకొని పోవాలమి తెరాస అధినేత కెసిఆర్‌ ఓ వైపు హెచ్చరిస్తున్నా ఇలా గ్రూపులుగా విడిపోవడం అందరిని ఆలోచింపజేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్‌ఎస్‌ కు ఎదురులేని పార్టీ రాష్ట్రంలో లేనేలేదనే వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ సమయంలో టిఆర్‌ఎస్‌ లో చిన్న చిన్న గ్రూపులు సహజమే అనిపించినా ఈ విషయం పెద్దదిగా మారితే మొదటికే మోసం వస్తుందని ప్రతిపక్షాలు గుసగుసలాడుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచనతో అందరిని పార్టీలోకి ఆహ్వనించారు. ఇప్పుడు పార్టీలో చేరిన వారందరిని ఒక తాటిపైకి తీసుకురావడం కెసిఆర్‌ కు తలకుమించి భారంగా తయారైనట్లు తెలుస్తోంది. ఎవ్వరికి వారుగా తయారవుతూ గ్రూపులు, వర్గాలుగా ఏర్పడడంతో మిగతా వాళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పుడంతా లోలోపల భయంతో ఉన్న భవిష్యత్తుల్లో పార్టీకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ బాస్‌ కెసిఆర్‌ బహిర్గతం కంటే అంతర్గతంగా జరిగే విషయాలపై దృష్టిసారిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరిని ఐకమత్యం చేసేందుకు టిఆర్‌ఎస్‌ అధినేత ఏలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here