పడగొట్టిన చోటే…ప్రతిష్టిస్తాం

0

  • పంచలోహాలతో ఈశ్వరచంద్ర విగ్రహాం
  • బెంగాల్‌లో హింసకు మమతానే కారణం
  • సమాజ్‌వాద్‌ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందే
  • యూపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ

లక్నో :

బెంగాలీ విద్యావేత్త ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ భారీ విగ్రహాన్ని పడిపోయిన చోటనే ప్రతిష్టిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మావు పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బెంగాల్‌లో హింస చెలరేగడానికి కారణం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే కారణమని ఆరోపించారు. ఈరోజు సాయంత్రం బెంగాల్‌లో జరగబోయే తన సభనుకూడా మమత అడ్డుకుంటుందన్నారు. విద్యాసారగ్‌ విగ్రహాన్ని కూల్చింది టీఎంసీ కార్యకర్తలేనని ఆరోపించారు. విద్యాసాగర్‌ విజన్‌కు తాము కట్టుబడి ఉన్నామని, పంచలోహాలతో తయారు చేసిన విద్యాసాగర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ గుండాగిరితో పాటు యూపీలో హత్యకేసులో పరారీలో ఉన్న వ్యక్తికి ఎస్‌పీ-బీఎస్‌పీ టిక్కెట్‌ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. కొద్ది నెలల క్రితం తాను వెస్డ్‌ మిడ్నాపూర్‌ (పశ్చిమబెంగాల్‌)లో ర్యాలీ జరిపినప్పుడు టీఎంసీ గూండాలు స్వైరవిహారం చేశారని, ఆ తర్వాత ఠాకూర్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురుకావడంతో తన ప్రసంగాన్ని కుదించుకుని బలవంతంగా స్టేజ్‌ దిగాల్సి వచ్చిందని చెప్పారు. ‘ఇప్పుడు భాయ్‌ అమిత్‌షా కోల్‌కతా రోడ్‌షోలోనూ టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ పూర్వాంచల్‌ ప్రజలను బయట వ్యక్తులుగా మమతా దీదీ టార్గెట్‌ చేస్తున్నారని, బెహన్‌ మాయావతి అయినా ఈ చర్యను ఖండిస్తారని అనుకుంటే, ఆమె కూడా ఆ పని చేయడం లేదని ప్రధాని విమర్శించారు. అత్యాచారం కేసులో పరారైన వ్యక్తికి ఇక్కడ్నించి ఎస్‌పీ-బీఎస్‌పీ టిక్కెట్‌ ఇచ్చిందంటూ ఆయన మండిపడ్డారు. యూపీలో సమాజ్‌వాద్‌ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందనేనని, అలాంటి వ్యక్తులకు ఓటేయమని బెహన్‌జీ ప్రజలను కోరుతున్నారని ఎద్దేవా చేశారు. 8సీట్లతో కొందరు, 10 సీట్లు, 20-22 సీట్లు, 30-35 సీట్లతో ప్రధాని అయిపోదామని కొందరు కలలు కంటున్నారని, అయితే దేశ ప్రజలు మాత్రం మరోసారి మోడీ సర్కార్‌ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here