Featuredరాజకీయ వార్తలు

ప్రతిపక్షాల జాడేదీ..

  • అన్ని తూతూ మంత్రమేనా..
  • ఉనికి కోసమే ప్రయత్నం..
  • కాంగ్రెస్‌కు నాయకత్వ లోపం..
  • బిజెపికి క్షేత్రస్థాయిలో క్యాడర్‌ కరువు..

రాష్ట్రంలో ఒక్కటే పార్టీ ఉండాలి.. అదీ కూడా టిఆర్‌ఎస్‌ పార్టీనే అన్నట్టుగా ఉంది ఇప్పుడు తెలంగాణలో. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ పార్టీ నయానో, భయానో తెలియదు కాని రాష్ట్రమంతా తానే ఏకచ్చత్రాధిపత్యంలా చక్రం తిప్పుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం తెలంగాణలో తన ఉనికిని చాటుకోలేకపోతుంది. పాగా వేస్తామని మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు కాని క్షేత్రస్థాయిలో తన ఉనికిని కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఆసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానానికే పరిమితమైనా బిజెపి, సిట్టింగ్‌లో ఉన్న రెండు సీట్లను కాపాడుకోలేకపోయింది. పార్లమెంట్‌లో ఎవరూ ఊహించని విధంగా నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకున్న కాషాయం పార్టీ అదే ఊపును కొనసాగించడంలో మాత్రం విఫలమైపోయింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమ అవకాశంగా మార్చుకోని ప్రతిపక్ష ఉద్యమ పంథాను మాత్రం నిర్వహించలేకపోతుంది. మొన్నటికి మొన్న జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కనీస ఓట్లు కూడా రాబట్టుకోలేని స్థితిలో బిజెపి ఉందంటే వారి పనితీరు, ప్రజల్లోకి వారు వెళ్లే విధానం ఏలా ఉందో తెలిసిపోతుంది. మరో పార్టీ కాంగ్రెస్‌ మాది అతి పురాతన గొప్ప చరిత్రగల పార్టీ అని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుందా అన్నట్లుగానే ఉంది. తెలంగాణలో ఆ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో సరియైనా నాయకుడు లేడని అర్థమైపోతుంది. పార్టీని ముందుండి నడిపిస్తామని ఎవరూ వచ్చిన తొక్కిపెట్టే నాయకత్వం అక్కడ సిద్దంగా ఉంది. వారు ముందుకు నడపరు, నడిపించేవారిని వెనక్కి లాగుతారు. ఈ రెండూ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే వామపక్షాలు ఎప్పుడు ఎవరికి జై కొడుతారో వారికే అర్థం కాదు. ప్రతిపక్షాల బలహీనతను అవకాశంగా మార్చుకుంటున్న టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ తన పార్టీని మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పథకాలు అమలైనా కాకున్నా, పనులు జరిగినా, జరగకపోయినా అల్లాఉద్దీన్‌ అద్భుత దీపంలా ఓటర్లను ఆకర్షించే విధానంలో కెసిఆర్‌కు సాటి మరొకరు లేరని తెలుస్తూనే ఉంది. అందుకే పుర ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటమి పాలైతే అందులో ప్రతిపక్షాల పాత్ర మాత్రం ఏ మాత్రం ఉండదనే చెప్పవచ్చు. టిఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలైతే అందుకు ప్రధాన కారణం అందులోని రెబెల్స్‌, తిరుగుబాటుదారులవల్లనే అని చెప్పవచ్చు..

ఎదురేలేదంటున్న టిఆర్‌ఎస్‌

ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా వస్తున్న తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్‌, కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న అధికారపక్షానికి తిరుగులేని అధిక్యతతో, అధికారంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌, బిజెపి, తెలుగుదేశం, వామపక్షాలు బలంగా లేకపోవడం ఎంత ప్రయత్నించినా వారి ఉనికిని మాత్రమే కాపాడుకుంటున్నారు కాని చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు గెలవలేకపోతున్నారు. ప్రతిపక్షాల బలహీనతనే ఇప్పుడు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీకి రోజురోజు బలంగా మారుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పుర ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని నమ్మకంగా ఉంటే, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కూడా విజయం తధ్యమని అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. పుర ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూల ఫలితాలు రావడం ఖాయమని మరోమారు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మాకు పోటీనే కాదని ఒంటరిగా ఎదుర్కొనలేక నిజామాబాద్‌, జగిత్యాల, రాయకల్‌, వేములవాడ, గద్వాల, నారాయణపేట లాంటి తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బిజెపిలు వారి ఉనికిని కాపాడుకోవడం కోసం, అవగాహన కోసమే మాత్రమే పోటీచేస్తున్నాయని అంటున్నారు. పుర ఎన్నికల్లో ప్రతిపక్షాలు తప్పుడు పద్దతుల్ని అవలంభిస్తున్నాయని పార్టీలు కలిసినంత మాత్రాన ఓటర్ల ఓట్లు బదిలీ కావంటున్నారు. అన్ని పార్టీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం ఖాయమంటుంది టిఆర్‌ఎస్‌. తమ పార్టీ తరపున అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని, గెలుస్తామని నమ్మకంతోనే టికెట్ల కోసం డిమాండ్‌ భారీగా ఉందని తెలుస్తోంది. అర్హుల్లో కొందరికి టికెట్లు దక్కకపోవచ్చని అలాంటి వారిని పదవుల్లో, ప్రభుత్వ నియమిత పదవుల్లో నియమిస్తామని చెపుతుంది టిఆర్‌ఎస్‌ పార్టీ. దేశంలోనే తెలంగాణ పాలన జనరంజకంగా ఉన్నట్లుగా వారి మాటలను చూస్తుంటేనే అర్థమైపోతుంది. ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ప్రజలకు అందుతున్నాయని, తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగానే చెపుతున్నట్లుగా ఉంది. కెసిఆర్‌ పాలన అత్బుధంగా ఉందని మరో నాలుగేళ్లు ఏలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నట్లుగానే చెపుతున్నారు.

కనీస పోటీనివ్వలేకపోతున్న ప్రతిపక్షాలు..

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఇచ్చిన హమీలే ఇప్పటికే అమలుకాకుండా ఉన్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన ప్రధాన హమీలు డబుల్‌ బెడ్‌ రూమ్స్‌, పిజి టూ కేజీ విద్యతో పాటు నిరుద్యోగులకు ఆర్థిక భృతి వంటి ఎన్నో హమీలు అములుకాకుండా మూలకుపడ్డాయి. రాష్ట్రంలో ప్రజలు నిత్యం ఎన్నో సమస్యలతో సతమవుతున్నారు. ప్రజల తరుపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల గొంతుకగా మాట్లాడే వారు ఏ ఒక్కరూ లేరనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు తమదైన పాత్రను సమర్థంగా పోషించినప్పుడే ఏదైనా సాధించవచ్చు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టచ్చు. కాని తెలంగాణలో జరుగుతున్నదీ వేరుగా ఉంటుంది. తెలంగాణలో జరుగుతున్న రెండవ ఆసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అనికలిసి ఎన్నికల్లో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌పై పోటీ చేసినా కనీస స్థానాలు దక్కించుకోలేకపోయాయి. ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఎన్నో పథకాలు నిర్వీర్యం చేసినా వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం చెందుతున్నారు. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి ప్రతిఫక్షంలో గెలిచినా వారిలో సగానికి పైగా వివిధ పార్టీల నాయకులను కారు పార్టీలో కలుపేసుకున్నారు. అంతో కొంతో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని ఆరోఫణలున్నాయి. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నాయని వారిని చిన్నాభిన్నం చేశారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఫక్షంగా చెప్పుకుంటున్న కొన్నిపార్టీలకు బరిలో నిలవడానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉంది. అందుకే టిఆర్‌ఎస్‌ నాయకులు గెలుపు మాకు చాలా సులువు అని మాట్లాడంలో తప్పులేదనే తెలుస్తోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close