గాలి జనార్దన్‌ ఎక్కడ..?

0

పోలీసు వేట

57 కిలోల బంగారం తీసుకుని

అంబిడెంట్‌ కంపెనీకి మెహర్బానీ..

ఇడికే కోటి లంచం ఎర

బెంగళూరు: పరారీలో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి హైదరాబాదులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన కోసం పోలీసులు లుకవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. గాలి జనార్దన్‌ రెడ్డి అనుచరుల ముబైల్‌ సిగ్నళ్ల ఆధారంగా జనార్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో గాలి జనార్ధన్‌రెడ్డి కేసు గురించిన వివరాలు బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం…. 2014లో బెంగళూరులో అంబిడెంట్‌ మార్కెటింగ్‌ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ కంపెనీ ప్రజల నుంచి భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించింది. డిపాజిట్లపై 30-40శాతం వడ్డీ ఇస్తామని డిపాజిట్‌ దారులకు కంపెనీ హామీ ఇచ్చింది. కంపెనీ హామీ నిలబెట్టుకోకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చేశారు. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు 2017లో కంపెనీలో ఈడీ తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసింది. కేసు నుంచి తప్పించుకునేందుకు నిర్వహకులు కొద్ది మందిని ఆశ్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కంపెనీ ఆశ్రయించిన వారిలో గాలి జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఈడీ నుంచి అంబిడెంట్‌ కంపెనీని తప్పించేందుకు జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంబిడెంట్‌ కంపెనీ నుంచి ఆయన 57 కిలోల బంగారం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై తెలుగు న్యూస్‌ ఛానెళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. హైద్రాబాద్‌, బెంగుళూరు, ఢిల్లీలోని జనార్థన్‌ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గాలి జనార్ధన్‌ రెడ్డి మిత్రుల ఇళ్లలో కూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో ఈ డీల్‌ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై గాలి జనార్ధన్‌ రెడ్డిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేకుండా పోయినట్టుగా పోలీసులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here