Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

తెలంగాణ సెక్రటేరియట్‌ కార్యాలయాలెక్కడ…?

తరలించినా సమాచారమే లేదు..

  • ఏ శాఖ ఎక్కడికి పోయిందో తెల్వదు..
  • ఆఫీసుల జాడ కోసం తిరుగుతున్న ప్రజలు..
  • ఏదీ ఎక్కడుందో చెప్పని యంత్రాంగం..

ఏ అధికారి ఎక్కడుంటారో తెలియదు.. ఏ నాయకుడు ఎక్కడ పర్యటిస్తున్నాడో సమాచారమే ఉండదు.. ఇక మంత్రుల సంగతి చెప్పడానికే లేదు.. వీరందరూ దొరకడం కష్టమనుకొని సమస్యలతో, వినతి పత్రాలతో అప్పుడో, ఇప్పుడో జిల్లాల నుంచి చాలామంది ప్రజలు సచివాలయానికి వచ్చేవారు.. కాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఆ సచివాలయానికి కూడా రాకుండా పోయింది. కొత్తదీ నిర్మించేసరికి ఎన్నిరోజులు పడుతుందో తెలియదు. ఉన్నది కూల్చాలే, కొత్తది కట్టాలంటూ సచివాలయంలో ఉన్న ప్రభుత్వ శాఖలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఖాళీ చేపించింది.. నగరంలోని ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ శాఖలను తరలించింది. ఏ శాఖ ఎక్కడికో మార్చిందో, ఏ అధికారి ఎక్కడుంటారో మాత్రం రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు సమాచారమే ఇవ్వలేదు.. కార్యాలయాల అడ్రస్‌ల కోసం ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక మంత్రుల సంగతి మాత్రం చెప్పనక్కర్లేదు,ఇక్కడంటే అక్కడంటారు, అక్కడంటే ఇక్కడంటారు మామూలే రోజుల్లోనే వారిని కలవడానికి చాలా సమయం పట్టేది.. ఇక ఇప్పుడు వారి అడ్రస్‌ తెలుసుకోవడానికే నెలలు పట్టేలా ఉంది.. నిత్యం సచివాలయ సందర్శన కోసం, వివిధ సమస్యలతో వినతుల కోసం వేలాదిగా ప్రజలు వస్తారని ప్రభుత్వానికి, అధికారులకు తెలుసు.. తెలిసినా ప్రభుత్వం తరలించినా కార్యాలయం సమాచారం మాత్రం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదో మాత్రం అర్థం కావడం లేదంటున్నారు సందర్శకులు.. ఏ ప్రభుత్వ శాఖను ఎక్కడికి మార్చారో తెలియక తిరిగి తిరిగి చేసేదేమి లేక వెనుదిరగడమే తప్ప ఏమి చేయలేకపోతున్నారు సామాన్య ప్రజానీకం.. అంతో, కొంత చదువుకొని రాజకీయం చేసిన నాయకులకే కార్యాలయాల అడ్రస్‌లు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితే అలా ఉంటే సామాన్యుల పరిస్థితి మాత్రం మరీ అధ్వాన్నంగా మారిపోయింది. ప్రభుత్వం తాను అనుకున్నదీ చేస్తుందీ తప్ప ప్రజలకోసం ఆలోచించడం లేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్న చిన్న పథకాలు, వివిధ ప్రారంభోత్సవాల ప్రచారానికి కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్న ప్రభుత్వం ప్రజలకు నిత్యం అవసరమయ్యే కార్యాలయాల తరలింపు సమాచారం తెలపడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదంటున్నారు ప్రజలు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

ఆరునూరు కాని, నూరు ఆరు కాని ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చడమే.. అనుకున్న పథకం ప్రకారం కొత్త సచివాలయం నిర్మించడమే.. వాస్తు బాగా లేదు.. అక్కడనుంచి పరిపాలన సజావుగా సాగడం లేదు. అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా, అవరోధాలు ఏర్పడినా ఆపే సమస్యే లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘాల మీద సచివాలయంలో ఉన్న శాఖలన్నింటిని తరలింపు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసింది. ఒక్కటో, రెండో తప్ప ఇప్పుడు సచివాలయమంతా దాదాపుగా బోసిపోయినట్టే కనిపిస్తోంది. ఇందుకు ముందు వివిధ జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది నాయకులు, సందర్శకులు నాయకులను కలవడానికో, అధికారులతో పనులు చేపించుకోవడానికో వచ్చేవారు. ఇప్పుడు అటు మోహం చూసే వారే కరువయ్యారు. సచివాలయంలో ఉన్న ఏ కార్యాలయం ఎప్పుడు తరలిస్తున్నారో, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియక సామాన్య జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త సచివాలయాన్ని కట్టాలనే ఆనందంతో ప్రభుత్వ అధికారులు కాని, ప్రభుత్వ యంత్రాంగం కాని పలానా శాఖను పలానా కార్యాలయంలోకి తరలించామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు ఏలాంటి సమాచారమే ఇవ్వలేదు.. చిన్న చిన్న పథకాలను ప్రవేశపెట్టే ప్రభుత్వం వాటి ప్రచారానికి కోట్ల రూపాయలను ఖర్చుపెడుతోంది. ప్రజలకు అవసరమయ్యే అత్యవసర విషయాలపై మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం దొరకక పడకేశాయి. పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిధులు లేక మండలాల్లో, గ్రామాల్లో ఒక్కటంటే ఒక్క పని కూడా పూర్తి కావడం లేదు. మధ్యలో ఆగిన పథకాల మాటేమిటని అడిగినా ప్రతిసారి సచివాలయం వైపు చూసే నాయత్వం ఇప్పుడు ఏ కార్యాలయం ఎక్కడికి తరలిందో తెలియక తికమకపడుతున్నారు. అంతో, కొంత చదువుకొని రాజకీయం చేసిన నాయకుల పరిస్థితే ఇలా ఉంటే వివిధ పనుల కోసం రాష్ట్ర రాజధాని కోసం వచ్చే సామాన్యుల పరిస్థితి మాత్రం మరీ అధ్వాన్నంగా ఉంది. నిత్యం ప్రజలకు ఉపయోగపడే సచివాలయంలోని కార్యాలయాలను ఎక్కడికి తరలించారో అనే సమాచారం రాష్ట్ర ప్రజలకు ఇవ్వకపోవడం మరీ విడ్డూరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

బాధితులు బాధలు వర్ణనాతీతమే..

కొమరం భీం జిల్లా నుంచి రామయ్య అనే రైతు అనుకోకుండా ఆనారోగ్యానికి గురయ్యాడు. వ్యాధి చిన్నదే అనుకొని స్థానిక ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు. కాని అదీ స్కిన్‌ ఇన్‌పెక్షన్‌ అయ్యేసరికి హుటాహుటీన హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పోరేట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు. చిన్నచిన్నగా ఆసుపత్రిలో బిల్లు ఆరు లక్షలు అయింది. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ధరఖాస్తు చేసుకుంటే ఎంతో, కొంత వస్తుందనుకొని కొమరం భీం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పుడో, ఇప్పుడో రావడంతో ఆయనకు సచివాలయం అడ్రస్‌ తెలుసుకోవడమో అతికష్టం అవుతోంది.. ఏలాగోలా సచివాలయానికి వచ్చినా రామయ్య విజిటర్స్‌ పాస్‌ తీసుకొని లోపలికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించిన ఆఫీసు వివరాలను ఆరా తీయగా సచివాలయం కూల్చివేతలో భాగంగా ఆ ఆఫీసును ఇక్కడి నుంచి తరలించామని అక్కడి వారు చెప్పారు. ఎక్కడికి తరలించారో తెలియదు. వారు చెప్పినా అడ్రసేమో ఈయనకు అర్థం కాదు. రెండు, మూడు రోజులు హైదరాబాద్‌ నగరంలో అటూ, ఇటూ తిరిగి తిరిగి చేసేదేమి లేక చివరకు ఇంటిదారి పట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన సచివాలయం కూల్చివేస్తున్నారని తెలిసినప్పుడు అందులో ఉన్నా కార్యాలయాలను ఎక్కడికి తరలించామనేది కనీసం ప్రజలకు చప్పకం పోవడం ఏంటనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిపోయింది…

    ములుగు జిల్లా ఏజెన్సీ నుంచి ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఆనారోగ్యంతో ఉంది. ఆవిడ సుదూర ప్రాంతంలో విధులు నిర్వహిస్తోంది. అంత దూరం వెళ్లి విధులు నిర్వహించడం కష్టం కావడంతో విద్యాశాఖ మంత్రిని కలిసి విన్నవించుకుందామని, అలాగే పాఠశాల సెక్రటరీని కూడా కలవోచ్చని పాఠశాలకు సెలవు పెట్టి మరీ హైదరాబాద్‌కు వచ్చింది. ఆవిడ చదువుకున్నదీ కావడంతో నేరుగా సచివాలయానికి వచ్చింది. అక్కడ విద్యాశాఖ కార్యాలయం లేదు. ఏలాగోలా తెలుసుకొని విద్యాశాఖ సెక్రటరీని కలిసింది. ఆయనపై ఆలోచిస్తానని సమయం కావాలని చెప్పారు. ఏలాగైనా మంత్రిని కలిసి పని చేయించుకోవాలని మంత్రికోసం ఆరా తీయడం మొదలెట్టింది. ఆయన ఎక్కడున్నాడో, ఎప్పుడోస్తాడో తెలుసుకునే వరకే వారం రోజులు పట్టింది. తిరిగే ఓపిక లేకపోవడంతో ఆవిడ స్వంత గ్రామానికి వెళ్లిపోయింది. సచివాలయం నుంచి కార్యాలయాలను తరలించారు బాగానే ఉంది. మరీ ఏ రోజు ఏ మంత్రి ఏక్కడ అందుబాటులో ఉంటారో కనీసం చెప్పేవారు లేరు. ప్రజలు సమస్యలతో, బాధలను చెప్పుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి రాజధానికి వస్తే ఇప్పుడు వారి పరిస్థితి ఆగమ్యగోచరంగానే మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల నుంచి, జిల్లాల నుంచి ప్రజలు పనుల మీద నగరానికి వస్తే వారి అధికారులను, నాయకులను కలవడానికి ఎక్కడికెళ్లుతారనే విషయంపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.. 

తరలింపు కార్యాలయాలపై సమాచారమే లేదు..

కొత్త సచివాలయం నిర్మిస్తున్నామనే ప్రభుత్వం హడావుడీ చేస్తోంది. సచివాలయంలో ఉన్న ఏ ఒక్క శాఖకు అధికారికంగా నోటీసులు ఇవ్వకుండా మాట వరసకు మాత్రమే చెపుతూ కార్యాలయాలను తరలిస్తున్నారని అంటున్నారు. కార్యాలయాలను తరలించేటప్పుడు అధికారులకు సమాచారం ఇస్తే సరిపోతుందా, పనుల నిమిత్తం నగరానికి వచ్చే ప్రజలకు ఏ కార్యాలయం ఎక్కడికి తరలించారో ఏలా తెలియాలంటే మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వయంత్రాంగం నుంచి సమాచారమే లేదు. కొత్తది కట్టాలే… పాతది కూలగొట్టాలే అంటూ హడావుడీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలోని కార్యాలయాల తరలింపుపై మాత్రం ప్రజలకు సమాచారమే ఇవ్వడమే లేదు. నిత్యం సచివాలయానికి వచ్చే సందర్శకులు మాత్రం మారిన కార్యాలయాల అడ్రస్‌ తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు.. తిరిగి తిరిగి కార్యాలయాల అడ్రస్‌లు దొరకక, దొరికినా అధికారులు అందుబాటులో లేక బాధతో వెనుదిరిగే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఏ ప్రభుత్వ శాఖ ఎక్కడికి తరలించారో చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.. దీనిపై ప్రభుత్వం ఏలా స్పందిస్తుందో చూడాల్సిందే..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close