Featuredస్టేట్ న్యూస్

ఆ లక్ష కోట్ల ఎక్కడ..?

  • ఆరా తీస్తున్న సిబిఐ
  • తెలంగాణలో 5,914 కోట్లు,
  • ఏపీలో 11,750 కోట్లు
  • డొల్ల కంపెనీలు
  • డమ్మీ చిరునామాలు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

కనిపించే ఘరానా దొంగలు బ్యాంకుల ఆస్తులను పబ్లిక్‌ గా కొల్లగొట్టారు. ఆ దోపిడీలో రాజకీయ నాయకులు, బ్యాంకు అధికారుల మధ్య ఉన్న చీకటి సంబంధాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా మరణించిన వారి పేర్లతో భారీగా రుణాలు పొందారు. ఈ బిగోతం మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల కేంద్రంగా జరిగాయి. రాజకీయులు ఏకంగా తప్పుడు చిరునామాలతో… డొల్ల కంపెనీలు సృష్టించారు. జల్సాలు చేసుకున్నారు. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న పరిశోధన కథనం.

ఇదీ జరిగింది: దేశవ్యాప్తంగా 1,60,978 కోట్ల మొండి బకాయిలు బ్యాంకులలో ఉన్నాయి. ఇలా తెలంగాణలో రూ.5,914 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ లో రూ.11,750 కోట్లు ఎగ్గొట్టడానికి సిద్దంగా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయుల కనుసన్నల్లోనే జరిగాయి. కొందరు నేరుగా ఉండగా.. మరికొందరు బినామీలతో దోపిడీ కొనసాగించారు.

ఇలా తనఖా పెట్టి…: రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌ మక్తాలో పాత ముంబై హైవేకు ఆనుకుని మొత్తం 525 ఎకరాలు భూమి ఉండేది. హైటెక్‌ సిటీకి అతి సమీపంలో ఉండటంతో ఎకరం రూ.50 కోట్ల పైమాటే. ఈ భూమికి రుక్నుద్దీన్‌ అనే వ్యక్తి 1950 వరకు యజమానిగా ఉన్నారు. కానీ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ రావడంతో అందులో కేవలం 99 ఎకరాలు మాత్రమే ఆయనకు మిగిలింది. తరువాత అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ నేతలకు పక్కా అవకాశం అనుకోకుండా కలిసొచ్చింది. ఇందులో నుంచి మరో 46 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై రుక్నుద్దీన్‌ హైకోర్టును ఆశ్రయించడంతో ‘స్టే’ వచ్చింది. ఈ వివాదం ఇలా ఉండగానే ఈ 99 ఎకరాలపై మన నాయకగణం ‘కన్ను’ అదోలా పడింది. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి ఒక్కరోజులో హక్కుదారులుగా మారిపోయారు.

సీబీఐ విచారణలో రట్టు: ఈ భూమిలో కొన్ని నకిలీ కంపెనీలను స్థాపించినట్లు చూపి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.40 కోట్లు లోను ఎత్తారు. ఈ రుణంతో కంపెనీలు నిర్మించేందుకు కాకుండా సొంతానికి వాడుకున్నారు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన బ్యాంక్‌ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈవిషయంలో రాజకీయ నేతల కుటుంబం సభ్యులుతో పాటు హైదరాబాద్కు చెందిన ఒక కంపెనీ ఎండీపై కేసు నమోదు అయింది.

సహకరించిన బ్యాంక్‌ అధికారులు కూడా కేసులో ఇరుక్కున్నారు. ఐపీసీ 120, 420, 458,421, 13(2), రెడ్‌ విత్‌ 1(సి) సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

ఇది మరీ విడ్డూరం: ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే… అసలు ఆ భూమికి సదరు నాయక గణానికి ఎలాంటి సంబంధం లేదు. అంటే లేని భూమికి దస్త్రాలు, ఆ భూమిలో కంపెనీలు, వాటి తాలూక నిర్మాణాలు, అందుకు 40 కోట్ల లోను. అప్పనంగా కాజేసిన ఈ డబ్బుతో ఎక్కే ఫ్లైట్‌, దిగే ఫ్లైట్‌.. టైం లేకుండా గడిపారు. విదేశీ పర్యటనలు, జల్సాలు, టివి షోలు… అ¬… భూలోకంలో స్వర్గం అనుభవించారు.

కొసమెరుపు: సిబిఐ అధికారులు విచారిస్తున్న సమయంలో… నిందితులు మాట్లాడుతూ… ఈలోను తాము వారం రోజుల్లో తీరుస్తామని చెప్పారు. ఎలా తీరుస్తారని ఆరా తీస్తే… రాజ్‌ భవన్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలం పై రూ.100 కోట్ల రుణం పొందటానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ‘అమ్మ నా… దొంగల్లారా..’ అనుకుంటూ సదరు బ్యాంకు సమాచారం ఇచ్చారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close