Featured

ప్రతిజ్ఞ’కు గుర్తింపు ఏది..?

పైడిమర్రికి భారతరత్న ఎందుకు ఇవ్వరు..?

తెలంగాణ వాడు కావడమే నేరమా..?

కేసీఆర్‌ పూనుకోవాలి

కిషన్‌ రెడ్డి సాధించాలి

ఆదాబ్‌ లోగో వాడాలి?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

130 కోట్లమంది భారతీయులలో హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్‌, క్రైస్తవులు బైబిల్‌, సిక్కులు గురుగ్రంథ్‌ సాహెబ్‌, బౌద్దులు త్రిపిఠకాలు.. ఇలా ఎవరి మతానికి సంబంధించినవి వారు చదువుతారు. అయితే వీరందరూ కలసి చదివే ఓ అద్భుత రచన మన మధ్య ఉంది. అది అందరికీ తెలిసిన ‘ప్రతిజ్ఞ’. ఇంగ్లీషులో ప్లెడ్జ్‌..ఇలా తొమ్మిది భారతీయ బాషలలో ప్రతి పాఠశాలలో అక్షరం నేర్చుకున్న, నేర్చుకునే ప్రతి భారతీయుడు ఆయన రాసిన ‘ప్రతిజ్ఞ’ చేయాల్సిందే..! అది పిఎం మోడీ అయినా సిఎం కేసిఆర్‌ అయినా..! అయితే అది రాసిన మహనీయుడికి చరిత్రలో దక్కాల్సిన చోటు దక్కలేదు సరికదా..! కనీసం ఒక్క చిన్న గుర్తింపు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వకపోవడం.. అస్సలు గుర్తించలేక పోవడం.. ఇప్పటిదాకా పాలించిన ప్రతి ప్రభుత్వం ‘సిగ్గు లేకుండా సిగ్గు పడే.. సిగ్గు పడాల్సిన గంభీర విషయం’. బాకాలు ఊదించుకున్నోళ్ళకు భారతీయరత్నాలు.. ఊదినోళ్ళకు కనీసం బజారు అవార్డులు.. ఇవేవీ లేనోళ్ళకు, తెలియనోళ్ళకు కనీసం ఓ అవార్డు, గుర్తింపు కూడా ఉండదని ‘నగ్నసత్యం’ తెలియచెప్పే నా నవీన భారతీయ రాజకీయానికి సజీవ పగిలిన దర్పణం. ‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా స¬దరులు..’ అంటూ భారతీయులందర్నీ దేశభక్తితో ప్రతిరోజు పాఠశాలలో లయబద్ధంగా పలకరించే సగర్వంగా, సవినయంగా, సగౌరవంగా పలికే ప్రతిజ్ఞ’… ఇంతకు రాసిన ఆయన ఎవరు..? ఎక్కడి వాడు..? ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక దేశభక్తి కథనం.

ప్రతిజ్ఞ ఎలా పుట్టింది: 1962-63 సంవత్సరంలో భారత్‌-చైనా యుద్ధం జరిగింది. యుద్ధానంతరం

దేశభక్తిని విద్యార్థులలో పెంపొందింపజేసేందుకు నాటి చైనా ప్రభుత్వం దేశభక్తి గేయాలను పాఠశాల విద్యార్థులతో రాయించి పాడించే విధంగా మహత్తర కార్యక్రమం చేపట్టింది. ఈ వార్తాంశమే మన ఓ భారతీయుడికి ప్రేరణ కలిగించింది. ఏదో ఒక దేశభక్తి గీతం రాయాలన్న ఆలోచనతోనే నేటి ‘ప్రతిజ్ఞ’ రచనకు రూపకల్పన చేశాడు.

ఎవరీ పైడిమర్రి వెంకట సుబ్బారావు: పైడిమర్రి వెంకట సుబ్బారావు జూన్‌10, 1916న నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించారు. ఆయన చదువు అంతా నల్లగొండ జిల్లాలోనే సాగింది. ఆయనకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిషు, అరబిక్‌ భాషల్లో ప్రావీణ్యం ఉంది. హైదరాబాద్‌ ట్రెజరీ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన పైడిమర్రి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఖమ్మం, నిజామాబాద్‌, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 1962లో ప్రతిజ్ఞ రాశారు. ఆ రచనను చదివి ఉప్పొంగిన సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, ఆ విషయాన్ని నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రతిజ్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందజేశారు. ఆ తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దాన్ని ‘జాతీయ ప్రతిజ్ఞ’గా గుర్తించారు. దేశంలోని 9 భాషల్లో అనువదించి అన్ని పాఠశాలల్లో ఆ ప్రతిజ్ఞను పిల్లలతో నిత్యం చదివించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26, 1965 నుంచి ప్రతి పాఠశాలలో విద్యార్థులతో ఆ ప్రతిజ్ఞ చేయించడం అధికారికంగా మొదలైంది.

రచనా ప్రస్థానం: పైడిమర్రి తన 18వ ఏట ‘కాలభైరవుడు’ నవల రాశారు. ‘దేవదత్తుడు’, ‘తులసీదాసు’, ‘త్యాగరాజు’ మొదలైన పద్యకావ్యాలు రచించారు. ‘బ్రహ్మచర్యం’ వంటి పలు నాటకాలతోపాటు వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘గోలకొండ’, ‘సుజాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆనందవాణి’ తదితర పతిక్రల్లో పైడిమర్రి రచనలు ప్రచురితమయ్యాయి. 1945లోనే ‘ఉషస్సు కథలు’ సంపుటిని రచించి తొలి తరం కథారచయితగా నిలిచారు.

ఇదో కుట్ర..: పైడిమర్రి రాసిన ‘ప్రతిజ్ఞ’ అన్ని భారతీయ భాషల్లో అనువాదమైనా.. ఆయన పేరు ఎక్కడా ప్రచురించకపోవడం గమనార్హం. పాఠ్యపుస్తకాలలో ప్రక్కప్రక్కనే ”వందేమాతరం” రాసింది బంకించంద్ర చటర్జీ అని, ‘జనగణ మన’ రాసింది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అని ముద్రించబడి ఉంటుంది. కాని ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకటసుబ్బారావు పేరు మాత్రం చేర్చకుండ ఉద్దేశపూర్వక కుట్ర చేశారు. ఈయన కనీసం సీమాంధ్రలో పుట్టి ఉంటే గురజాడ లాగా, పింగళి వెంకయ్య లాగా కీర్తించబడి ఉండేవారు. ఇటువంటి వివక్ష తెలంగాణ ప్రాంతానికి కొత్తేం కాదు. నల్లగొండలో పుట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కావడం వల్లే ప్రతిజ్ఞ రూపకర్త పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రించకపోవడంగానీ, ఆయనకు తగిన గుర్తింపు లభించక పోవడంగాని జరిగిందన్న విషయం రూడి అయింది. తన విశ్రాంతి సమయంలో ¬మియోపతి వైద్యం ఉచితంగా అందించాడు. వృద్ధాప్యభారంతో 13 ఆగస్టు,1988న తనను గుర్తించని భారతానికి దూరంగా నిశ్శబ్దంగా జరిగిపోయాడు.

ఇకనైనా గుర్తించండి: ఎంతో కాలం మరుగునపడిన విషయాని స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ రచయిత పేరును ముద్రించి గౌరవించింది. అయితే ప్రతియేటా పైడిమర్రి వర్ధంతి, జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌ ఏర్పడింది. పాఠశాలల్లో, కళాశాలల్లో ఆయన చిత్రపటాలు ఏర్పాటు చేసి వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తే గౌరవంగా నివాళులర్పించాలని తెలంగాణ కవులు, రచయితలు కోరుతున్నారు. ప్రతిజ్ఞ సుస్వరాలను ప్రపంచానికి తెలిసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎలుగెత్తి చాటుతుందని ఆశిద్దాం. అలాగే చివరిగా… కోట్లాదిమంది ప్రతిరోజూ పటించే ‘ప్రతిజ్ఞ’ రచయితకు భారతరత్న ఇస్తే తప్పేంటి..? ‘దేశభక్తి’ పరులూ… ఇది రాష్ట్రపతి కార్యాలయం ఈమెయిల్‌ ఐడికి ఈ రచయితకు భారతరత్న ఇవ్వాలంటూ… తీణ.బబీపతీజీఎజీనితిజీనిఏనితిఞ.తిని కి పంపండి. అవార్డు తెలంగాణ గుమ్మం ముందుకు వచ్చి నాట్యం చేస్తుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఇద్దరూ నడుంబిగించాల్సిందే. మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

ఇదే ప్రతిజ్ఞ.. ఓసారి మనసారా చదువుకుందాం…

”భారతదేశం నా మాతృభూమి.

భారతీయులందరూ నా స¬దరులు.

నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.

సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.

దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.

నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను.

ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.

నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం”.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close