రేవంత్‌ అరెస్టుకు ప్రాతిపదిక ఏమిటి ?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అరెస్టుపై ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని హైకోర్టు డీజీపీని ప్రశ్నించింది. మంగళవారం రేవంత్‌ అరెస్టు విషయంలో బుధవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉదయం విచారణ జరపుగా నేరుగా డీజీపీనే హాజరు కావాలని కోర్టు సూచించింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి స్వయంగా విచారణకు హాజరయ్యారు. పోలీసులు సమర్పించిన నిఘావర్గాల నివేదికలపై సంతకాలు, తేదీలు, అధికారిక ముద్రలు ఎందుకు లేవని ప్రశ్నించింది. ఎవరినైనా, ఎప్పుడైనా అరెస్టు చేస్తారా? అని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయాలని ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని డీజీపీని ప్రశ్నించింది. అక్కడ ఉన్న ఎస్పీ ఇచ్చిన సమాచారం మేరకు తానే మౌఖికంగా ఆదేశాలు జారీచేశానని డీజీపీ నివేదించారు. అయితే, ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పూర్తిగా ఆక్షేపణీయంగా ఉందని, పద్ధతి ప్రకారం అనుసరించలేదని కోర్టు మండిపడింది. నిఘావర్గాలు అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించగా.. వాటన్నింటిపైనా హైకోర్టు అనుమానాలు వ్యక్తంచేసింది. ఒక్క నివేదికపైనా అధికారుల సంతకాలు, తేదీలు, అధికారిక ముద్రలు కూడా లేవని, నిఘావర్గాలే వాటిని ఇచ్చినట్టు ఎలా నమ్మాలని నిలదీసింది. కేవలం తమకు ఇవ్వడానికే సృష్టించినట్టు అవి కనబడుతున్నాయి తప్ప నమ్మశక్యంగా లేవని వ్యాఖ్యానించింది. అయితే, నిఘావర్గాల నివేదికలు అలాగే ఉంటాయని, వాటిపై స్టాంపులు వేసే పక్రియ రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థలో లేదని డీజీపీ వివరణ ఇచ్చారు. ఒకవేళ బయట వ్యక్తులెవరైనా సృష్టించి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే కూడా ఎవరినైనా అరెస్టు చేస్తారా? అని పదే పదే ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వ్యవహార శైలి సరిగా లేదని సూటిగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో ఈ నెల 12న కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఓ పద్ధతి ఉండాలని, హుందాగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వికారాబాద్‌ ఎస్పీగా ఐపీఎస్‌ అధికారి అవినాశ్‌ మహంతి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంలో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్‌ ఎస్పీగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అవినాశ్‌ మహంతిని నియమించింది. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో అన్నపూర్ణను తీసుకోకూడదని ఈసీ ఆదేశించింది. కొడంగల్‌లోని రేవంత్‌ నివాసంలో మంగళవారం వేకువజామన పోలీసులు చొరబడి అరెస్ట్‌ చేయడంపై కాంగ్రెస్‌ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here