Featuredప్రాంతీయ వార్తలు

ఆరోగ్యమే మహాభాగ్యం అదనపు ఎస్పీ మహేందర్

గీతమ్ లో అంతర్ కళాశాల క్రీడోత్సవం ప్రారంభం 

మూడు రోజుల పాటు కొనసాగనున్న క్రీడా పోటీలు

 పటాన్ చెరు (ఆదాబ్ హైదరాబాద్)ః ఆరోగ్యమే మహా భాగ్యమని, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని, మరేదైనా సాధించగలమని సంగారెడ్డి అదనపు ఎస్పీ ఎన్.మహేందర్ అన్నారు. గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ వార్షిక అంతర్ కళాశాల క్రీడోత్సవం ‘లక్ష్య -2019’ని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులు అందించిన రిలే టార్చితో క్రీడాజ్యోతిని వెలిగించారు. బెలూన్లను ఎగురవేసి క్రీడోత్సవం ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక కసరత్తు అవసరమని, విద్యార్థులకు క్రీడల ద్వారానే అది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి సర్వసాధారణమైందని, దానిని అధిగమించడానికి ఆఠలు ఉపకరిస్తాయని తెలిపారు. ఇంత మంచి ప్రయోజనాలున్న క్రీడలను గీతం యాజమాన్యం ప్రోత్సహించడం ముదావహమంటూ, వారిని అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న పటాన్ చెరు డీఎస్పీ ఆర్.రాజేశ్వర రావు మాట్లాడుతూ సరైన సదుపాయాలు లేని 1920 ప్రాంతంలోనే మేజర్ ధ్యాన్ చంద్ ఒలెంపిక్స్ పతకాలు సాధించి, మనదేశంలోనూ అత్యుత్తమ క్రీడాకారులున్నారని ప్రపంచానికే చాటి చెప్పారని అన్నారు. శారీరక ధారుడ్యం లేకపోతే ఏ పని చేయలేమని, బలిష్టంగా ఉంటే రోగాలు మన దరిచేరలేవని  రాజేశ్వర రావు చెప్పారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా బంగారు పతకం సాధించిన పీవీ సింధు అత్యంత కఠోర సాధన ద్వారానే సాధించగలిగిందని, ఆ స్ఫూర్తిని ప్రతిఒక్క విద్యార్థీ గ్రహించాలని గీతం అదనపు ఉపకులపతి ప్రొ.ఎన్.శివ ప్రసాద్ సూచించారు. క్రీడల వల్ల బృంద స్ఫూర్తి అలవడుతుందని, కష్టించి పనిచేయడానికి సంశయించరని అన్నారు. అతిథులు ఇద్దరినీ ప్రొవీసీ సత్కరించారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ వర్మ ఈ మూడు రోజుల క్రీడోత్సవం విజయవంతం కావాలని అభిలాషించారు. తొలుత, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొ.ఏ శ్రీరామ్ తన స్వాగతోపన్యాసంలో ప్రతియేటా లక్ష్య పేరిట క్రీడోత్సవాలను ఒక సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్, టేబుల్ టెన్నీస్, వాలీబాల్, క్యారమ్స్, ఫుట్ బాల్, త్రోబాల్, అథ్లెటిక్స్ వంటి పలు క్రీడాంశాలను లక్ష్య – 2019లో భాగంగా నిర్వహించి, విద్యార్థుల సామర్థ్యాలను ప్రదర్శించే వెసులుబాటు కల్పించారు. 

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close